నలుగురు కార్మికులు దుర్మరణం
రక్తపు ముద్దలై తెగిపడ్డ కార్మికుల అవయవాలు
రాష్ట్ర ఆవిర్భావం రోజున ఆవిరైన కార్మికుల జీవితాలు
రూల్స్‌ను అతిక్రమించి బ్లాసింగ్‌లు చేపట్టిన యాజమాన్యం
మృతుల కుటుంబాలకు కోటి నష్టపరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కార్మిక సంఘాల డిమాండ్
ప్రజాపక్షం/పెద్దపల్లి బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున సింగరేణి గనుల్లో భారీ పేలుడు సంభవించిం ది. కార్మికుల ప్రాణాలు గాలిలో కలిశాయి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న సమయంలో మృతుల కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంతో అనేక ప్రమాదాలు సంభవించి ఎంతో మంది కార్మికుల ప్రాణాలు పోతున్నప్పటికీ యాజమాన్యం మాత్రం కార్మికుల ప్రాణాలపై నిర్లక్ష్య దోరణి అవలంబిస్తున్నాయి. కేవలం ధనార్జనే ధ్యేయంగా బ్లాస్టింగ్ విభాగం పనులను ప్రైవేటు కంపెనీలకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. ప్రైవేటు కంపెనీ మహాలక్ష్మీ ఒబి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల మంగళవారం ఆర్‌జి 3 పరిధిలోని ఒసిపి-1లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కాంట్రాక్టు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలుకాగా, ఒక కాంట్రాక్టు కార్మికుడి పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాళ్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా ఆర్‌జి 3 పరిధిలో ఉన్న ఓపెన్‌కాస్ట్ -1లోని 78 ఆర్‌ఎల్ (సముద్ర నీటిమట్టం) ఫేస్-2 అప్‌లోడింగ్ పని స్థలంలోని మహాలక్ష్మీ ప్రైవేటు కంపెనీకి చెందిన కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులు బండి ప్రవీణ్, బిల్లా రాజేశం, అర్జయ్య, రాకేష్‌లు అక్కడికక్కడే మరణించారు. కమాన్‌పూర్‌కు చెందిన వెంకటేష్‌కు రెండు కళ్లు పోయి పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులైన మరో ముగ్గురిలో రత్నాపూర్‌కు గ్రామానికి చెందిన భీమయ్యకు రెండు కాళ్లు విరుగగా, సూపర్ వైజింగ్ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కాంట్రాక్టు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన రామగుండం సింగరేణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎప్పటిలాగే కార్మికులు ఉదయం 10గంటలకు బోల్డర్‌కు వేసిన డ్రిల్ రంద్రంలో డిటోనేటర్, ఎక్స్‌ప్లోజివ్స్‌ను పైపుతో నింపుతుంటే భూమిలో నుండి వేడి వచ్చి బ్లాస్టింగ్ సంభవించింది. వెంటనే సింగరేణి అధికారులు, మహాలక్ష్మీ కంపెనీ అధికారులు కార్మికుల మృతదేహాలను, గాయపడిన కార్మికులను గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆసుపత్రి ఆవరణలో మృతుల కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి. మృతదేహాల వద్ద కుటుంబీకులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించాయి.
ఐదుగురు కార్మికులను కాపాడిన మంచినీరు..
ఒసిపి-1లో జరిగిన పేలుడు సమయంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుల్లో ఐదుగురు కార్మికులు ఎండ తీవ్రత వల్ల తమ దాహార్తి తీర్చుకునే నిమిత్తం మంచినీరు తాగేందుకు వెళ్లారు. దీంతో బాంబు పేలుడు సమయంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా ఆ ఐదుగురి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఒకవేళ నీరు తాగేందుకు వెళ్లకుంటే వీరు కూడా ప్రమాదానికి గురై ఉండేవారని అధికారులు, తోటి కార్మికులు తెలిపారు.
నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న యాజమాన్యం
సింగరేణి సంస్థలో అనేక ప్రమాదాలు సంభవించి ఎంతో మంది కార్మికులు తమ ప్రాణాలు కోల్పోతున్నా సింగరేణి యాజమాన్యం మాత్రం తమకేమీ పట్టనట్లుగా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. బొగ్గు గనుల చట్టం 1952, బొగ్గు గనుల నిబంధనలు 2017 ప్రకారం మైనింగ్ సాంకేతిక అధికారులు సూపర్‌వైజర్ల పర్యవేక్షణలో సుశిక్షుతులైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కార్మికులతోని బ్లాస్టింగ్ చేయించాలి. కానీ, మహాలక్ష్మీ ప్రైవేట్ కంపెనీ మట్టి తొలగింపు పనులను అనుభవం లేని, శిక్షణ లేని కాంట్రాక్టు కార్మికులతో బ్లాస్టింగ్ పనులు చేయించి ఈ ఘోర ప్రమాదానికి కారణమైందని సదరు కాంట్రాక్టు సంఘాల నాయకులు వాపోతున్నారు. అనుభవం కలిగిన కార్మికులను, అధికారులను నియమించుకుంటే వారికి ఎక్కువ జీతాలు చెల్లించాల్సి వస్తుందనే భయంతో ఇలాంటి అమాయక కార్మికులతో బ్లాస్టింగులు చేయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారని, ఇలాంటి ప్రైవేటు కంపెనీలపై సింగరేణి యాజమాన్యం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు.
మృతుల కుటుంబాలకు కోటి నష్టపరిహారమివ్వాలి : ఎఐటియుసి
aసిపి-1 బాంబ్ బ్లాస్టులో జరిగిన ఘటనలో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు కాంట్రాక్టు కార్మిక చట్టం 1970 ప్రకారంగా ప్రమాదంలో చనిపోయిన కాంట్రాక్టు కార్మికుని కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు వారి ఇంట్లో ఒకరికి సింగరేణి సంస్థలో పర్మినెంట్ ఉద్యోగం కల్పించాలని ఎఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన కాంట్రాక్టు కార్మికులకు రూ. 50లక్షలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. లాక్‌డౌన్ సందర్భంగా సింగరేణి యాజమాన్యం డిజిఎంఎస్ రూల్స్‌ను అతిక్రమించి బ్లాస్టింగులు జరిపించి కార్మికుల మరణాలకు కారణమైయ్యారని, ఈ ప్రమాద ఘటనపై డిప్యూటీ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన మహాలక్ష్మీ కంపెనీపై క్రిమినల్ కేసులు పెట్టాలని, ఒసిపి-1 సింగరేణి అధికారులను, జిఎంను సస్పెండ్ చేసి చనిపోయిన కార్మికుల కుటంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మట్టి తొలగింపు పనులను సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించిన మృతదేహాలను ఎఐటియుసి నాయకులు వై. గట్టయ్య, వాసిరెడ్డి సీతారామయ్య, వైవి. రావు, ఎల్. ప్రకాష్, మేరుగు రాజయ్య, మద్దెల దినేష్‌లు సందర్శించి మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి ప్రకటించారు.
సమగ్ర విచారణ జరిపించాలి : చాడ
ప్రజాపక్షం / హైదరాబాద్: సింగరేణి ఓపిసి పేజ్-2లో బాంబు పేలుడు సంఘటన పూర్వాపరాలను, మేనేజిమెంట్ తీసుకున్న జాగ్రత్తలను పరిశీలించేందుకు సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రక్షణ జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదో? ఆ దుర్ఘటనకు బాధ్యులెవరో నిర్ధారించాలన్నారు. ఈ ఘటనలో నలుగురు కాంట్రాక్టు ఉద్యోగులు దుర్మరణం పాలైనట్లు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుందన్నారు. సింగరేణి యాజమాన్యం చనిపోయిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలలో అర్హులైన వారికి విధిగా ఉద్యోగాలు ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి కోటి రూపాయలను, గాయపడినవారికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.