HomeNewsTelanganaసింగరేణిని ఆదుకుంటాం

సింగరేణిని ఆదుకుంటాం

బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సంస్థ
441 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్‌
గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సింగరేణి సంస్థను అన్ని రకాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌ లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద బుధవారం నాడు సింగరేణిలో 441 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సిఎం, విద్యుత్‌, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సింగరేణి పరిధిలోని శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, మక్కన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌, ప్రేమ్‌ సాగర్‌ రావు, గడ్డం వివేక్‌, గడ్డం వినోద్‌, కోవా లక్ష్మీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సింగరేణి ఎండి బలరాం నాయక్‌, సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఐ.ఎన్‌.టి.యు.సి జనరల్‌ సెక్రటరీ
జనప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాంఛనంగా పలువురికి కారుణ్య నియామకాల పత్రాలను ముఖ్యమంత్రితఅందజేశారు. ప్రజాస్వామ్య స్పూర్తికి నిదర్శనంగా, అంబేడ్కర్‌ విగ్రహ సాక్షిగా నియామకాల పత్రాలను అందజేస్తున్నామని ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్రను ఎవరూ తగ్గించలేరని ఆయన స్పష్టం చేశారు. పార్టీలు తెలంగాణ సాధనలో వైఫల్యం చెందినా కార్మికులు రాష్ర్టం కోసం అనేక పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. గత రాష్ర్ట ప్రభుత్వం సింగరేణిని ఖాయిలా పడేలా చేసిందని ఆయన విమర్శించారు. కేంద్రం కూడా సింగరేణి సంస్థకు అనేక అడ్డంకులు సృష్టించిందన్నారు. గత ఎన్నికల్లో సింగరేణి ప్రాంతం కాంగ్రెస్‌ , సిపిఐలకు అండగా నిలిచి ప్రజాప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిందని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులకు వేలాది ఓట్ల మెజారిటీ రావడం వెనుక సింగరేణి కార్మికుల కృషి వుందని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల అధికారంలో వున్న బిఆర్‌ఎస్‌ పార్టీ అనుబంధ సంఘానికి సింగరేణి ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని సిఎం అన్నారు. సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఇటివలే తాను ఆదేశించినట్లుగా ఆయన స్పష్టం చేశారు. సింగరేణి ప్రాంతంలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే అంశంపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. కారుణ్య నియామకాల వయస్సు సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు.
బొగ్గుబావుల కోసం కేంద్రంతో మాట్లాడుతున్నాంః డిసిఎం భట్టి
తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన సింగరేణి కాలరీస్‌ ను ఇందిరమ్మ రాజ్యంలో కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుంటుందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్మికుల పట్ల మానవీయంగా వ్యవహరిస్తుందని, కార్మిక హక్కులు కాపాడే విధంగా ప్రజా పాలన అందిస్తామన్నారు. తెలంగాణలో బొగ్గు బావులు సింగరేణికి ఉండేలా కేంద్రంతో మాట్లాడుతున్నామని చెప్పారు. బొగ్గు బావులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర గత ప్రభుత్వం చేసిందని విమర్శించారు. సింగరేణి సంస్థలో 1.05 లక్షల ఉద్యోగాలను గత పాలకులు 42 వేలకు కుదించారని, ఈ ఎన్నికల్లో తిరిగి వాళ్లే గెలిచి ఉంటే ఐదు వేల కు కుదించేవారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. సింగరేణి కాలరీస్‌ సంస్థను గత ప్రభుత్వం తమ రాజకీయాలకు, స్వలాభం కోసం వాడుకున్నారని , పదేళ్ళు పరిపాలించి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజా ప్రభుత్వం రాగానే పారదర్శకంగా నియామకాలు చేస్తామని చెప్పామని, అందులో భాగమే రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సాక్షిగా సింగరేణి సంస్థలో 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నామని తెలిపారు.
సింగరేణి అభివృద్ధికి కార్యాచరణ ః మంత్రి పొన్నం
ఇటీవల ఆర్టీసి లో కారుణ్య నియామకాలు పూర్తయ్యాయని, ఇప్పుడు సింగరేణిలో కారుణ్య నియామక పత్రాలు ఇచ్చిని సిఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు అని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. సింగరేణి ని మరింత ముందుకు తీసుకుపోవాల్సి ఉన్నదని, భవిష్యత్‌ కార్యాచరణ సింగరేణి అభివృద్ధి దిశగా ఉంటుందన్నారు.

ప్రజాపక్షం / హైదరాబాద్‌ :
సింగరేణి సంస్థ ఆధ్వరంలో కొత్త గనులను ప్రారంభించాలని,ఇందుకు వివిధ గనుల కేటాయింపునకు నిర్వహించే బిడ్డింగ్‌లో పాల్గొనేలా ప్రభుత్వం ఆదేశించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. కొత్త గనులు వేస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని, సాధ్యమైనంత వరకు అన్ని ఓపెన్‌ కాస్ట్‌ మైన్స్‌ కాకుండా మెనైజ్డ్‌ మైన్స్‌ ఉంటే ఉపాధి కల్పించవచ్చన్నారు. సింగరేణి అంటే తెలంగాణకు గుండెకాయ లాంటిదని, సింగరేణి బాగుంటే రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు బాగుంటాయని, రాష్ట్రం బాగుంటుందని అన్నారు. హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహించిన సింగరేణి ఉద్యోగ మేళా కార్యక్రమంలో ప్రసంగిస్తూ సింగరేణి సమస్యలను సిఎం రేవంత్‌ రెడ్డి, డిసిఎం, విద్యుత్‌ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కల దృష్టికి తీసుకెళ్ళారు. ఒకప్పుడు 1.30 లక్షల కార్మికులతో కళకళ లాడిన సింగరేణిలో ఇప్పుడు కేవలం 30 వేల కార్మికులకు పరిమితమైందని, అదే సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు ఉండడం శోచనీయమన్నారు. కొత్త గనుల ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చని సూచించారు. సింగరేణి కార్మికులకు సంస్థ స్థలంలో ఇంటి నిర్మాణానికి 250 గజాలు కేటాయించాలని కోరారు. డిపెండెంట్స్‌ ఉద్యోగాల కోసం వయో పరిమితిని 35 నుండి 40 ఏళ్ళకు పెంచాలని, సాంకేతిక అంశాల జోలికి వెళ్ళకుండా గతంలో మాదిరిగా ఈ నియామకాలు చేయాలని కూనంనేని కోరారు. సంస్థ ఇచ్చే పెర్క్‌ విషయంలో అధికారులకు రాయితీ ఉన్నదని, అలాగే కార్మికులకు కూడా కల్పించాలన్నారు. కోల్‌ ఇండియా హై పవర్‌ కమిటీ సిఫార్సు చేసిన వేతనాలు అమలు చేయాలని, మహిళలకు కూడా వర్తింపజేయాలని అన్నారు. ఒకప్పుడు అవినీతికి తావులేని సింగరేణి ఉండేదని, ఇప్పుడు ఇక్కడ కూడా డబ్బు ఉంటేనే పని అనే సంస్కృతి వచ్చిందని, దీనిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. గత ముఖ్యమంత్రి కేవలం సింగరేణి ఎన్నికల ముందు మాటలు చెప్పేవారని, ప్రైవేటు మైన్స్‌ అడ్డుకుంటామనే వారని, అవి అమలు కాలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని, ఈ ప్రభావం 13 నియోజకవర్గాలపై ఉంటుందని తెలిపారు. ఇతర సమస్యలపై సిఎం, డిసిఎంలు అపాయింట్‌మెంట్‌ ఇస్తే కలిసి వివరిస్తామని కూనంనేని అన్నారు. దీనికి సిఎం రేవంత్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సింగరేణి సమస్యలపై చర్చిచేందుకు కూనేంనేనికి, గుర్తింపు సంఘాలకు అపాయింట్‌మెంట్‌ ఇస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments