సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
మరో దేశ్‌ముఖ్‌గా మారారని ముఖ్యమంత్రి కెసిఆర్‌పై విమర్శలు
ప్రజాపక్షం/కొత్తగూడెం ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితో ప్రజలు తిరగబడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేంమంతరావు అన్నారు. మరో వైపు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితో భూ పోరాటాలను కొనసాగిద్దామనన్నారు. నిజాం రాజు నిరంకుశ పాలనను పాలన ను అంతమొందించి తెలంగాణను భారత యూనియన్‌లో విలీనం చేసిన ఘనత కమ్యూనిస్టులదేనని వారు పునరుద్ఘాటించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వా రోత్సవాల్లో భాగంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి నేతృత్వంలో చేపట్టిన బస్సు యాత్ర సోమవారం భద్రాది జిల్లా కేంద్రానికి చేరుకుంది. బస్సు యాత్రకు సిపిఐ, ప్రజా సంఘాల శ్రేణులు మోటార్ సైకిళ్ళతో భారీ ర్యాలీ నిర్వహించి ఘనస్వాగతం పలికారు. సభా ప్రాంగణం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఉన్న సాయుధ పోరాట యోధులు యూనియన్ నేత కొమరయ్య విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ అప్పటి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీల నాయత్వంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచారికి నుండి విముక్తి కోసం, దొరలు దేశముఖ్‌ల పెత్తనం అంతం కోసం, ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం సాగిన పోరాటం నేటితరానికి ఆదర్శమన్నారు. దొరలు, దేశముఖ్‌ల గుండాలు, నిజాం సైన్యాలు, రజాకార్లకు ఎదురొడ్డి పోరాడింది కమ్యూనిస్టులేనని వారు గుర్తు చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.అయోధ్య మాట్లాడుతూ అనాది సాగుచేసుకుంటున్న భూములకు గిరిజనులు, పేదలు, దళితులను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని, దాడులకు పూనుకుంటోందని, ప్రభుత్వంపై సాయుధ పోరాట స్పూర్తితో పోరాటాలకు సిద్దమై భూములను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు స్వేచ్ఛ లభించిన అక్టోబర్ 17న ఉత్సవాలు నిర్వహించడానికి, తెలంగాణ విలీన దినోత్సవం అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని విమర్శించారు. అమరవీరుల విషయంలో మాట తప్పితే ప్రజలు టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెపుతారని స్పష్టం చేశారు. సాయుధ రైతాంగ పోరాటంలో జమీందార్ల, నిజాం నిరంకుశ పాలను ఎదుదొడ్డి సుమారు పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత కమ్యూనిస్టులదేనన్నారు. నాడు రైతాంగ పోరాటంలో పంచిన భూముల్లో నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ మూడో వంతు కూడా పంచకపోగా పేదలు అనాదిగా సాగుచేసుకుంటున్న భూములను లాక్కుంటూ కెసిఆర్ మరో నిజాం నవాబుగా, దేశ్‌ముఖ్‌గా మారారని విమర్శించారు. సాయుధ పోరాటంలో ఇసుక రేణువంత పాత్ర కూడా బిజెపికి లేదన్నారు. తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర కళాకారుల బృందం సభ్యులు లక్ష్మినారాయణ, పల్లె నర్సింహా బృందం ప్రదర్శించిన పలు గేయాలు, నృత్యాలు సభికులను ఆకట్టుకున్నాయి. సిపిఐ నేతలు జి.వీరస్వామి, వంగా వెంకట్ అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు గుత్తుల సత్యనారాయణ, నరాటి ప్రసాద్, వై.శ్రీనివాసరెడ్డి, ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అనీల్, సిపిఐ జిల్లా సమితి సభ్యులతో పాటు పార్టీ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రాజకీయ కుట్రతోనే సాయుధ పోరాటాన్ని విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులు
20 నుంచి నిరసన కార్యక్రమాలు
రాజకీయ కుట్రతోనే సాయుధ పోరాటాన్ని కేంద్ర, రాష్ట్ర పాలకులు విస్మరిస్తున్నారని చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటం వారోత్సవాల సందర్భంగా సిపిఐ నిర్వహిస్తున్న బస్సు యాత్రకు మహబూబాబాద్ జిల్లాలో ఘనస్వాగతం లభించింది. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారధి అధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గార్ల మండలంలోని పాఖాల వాగులో లెవల్ బ్రిడ్జి వద్ద గల ఎల్లంకి సత్యనారాయణ స్థూపం వద్ద ఆయన చిత్ర పటానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో పాటు నేతలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పాకాల చెక్ డ్యామ్‌పై గల రోడ్డును పరిశీలించారు. మండల కేంద్రంలోని స్తానిక నెహ్రూ సెంటర్ లో తెలంగాణ సాయుధ పోరాట అమర వీరుల స్థూపం వద్ద పోరాట యోధుల చిత్ర పటాలకు పూల మాళలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆనాటి సాయుధ పోరాట యోధులను శాలువాలతో సత్కరించారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 20 నుండి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాను నిర్వహించనున్నామని, హైదరాబాద్‌లో ఇందిపార్కులో దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని బి.విజయసారధి అన్నారు. బయ్యారం మండలంలోని బండ్ల కుంట గ్రామంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న దొడ్డి కొమరయ్య నేతృత్వంలో 12 మందిని సామూహికంగా చెట్లకు కట్టేసి వరి గడ్డి వేసి సామూహిక దహనం చేశారని, గార్ల , మండలంలో అనేక మంది మహిళలపై అత్యాచారాలు చేసి భయభ్రంతులకు గురిచేసి దోపిడి చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కట్టేబోయిన శ్రీనివాస్, సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి.అజయ్, 36 వార్డు కౌన్సిలర్ నీరజరెడ్డి, ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అనిల్ కుమార్, సిపిఐ నాయకులు పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.