పేదలకు ప్రతిపక్షాల పిలుపు
భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సాయం చేయకుంటే 12న ధర్నా
ప్రభుత్వానికి ప్రతిపక్షాల హెచ్చరిక
ప్రజాపక్షం/హైదరాబాద్: లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పేదలు సాయం కోసం తహసీల్దార్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధి నుండి భవన కార్మికులకు ఈనెల 10లోపు రూ. 5 వేలు ఇవ్వాలని, లేదంటే 12వ తేదీన హైదరాబాద్‌లో ని కార్మిక సంక్షేమశాఖ భవన్ ముందు కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించనున్నట్టు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేదలను ఆదుకోవడంలో ఉమ్మడి కార్యాచరణతో ఐక్యంగా పోరాటం చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని టిజెఎస్ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఎఐసిసి కార్యదర్శి సంపత్‌కుమార్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, తెలంగాణ ఇంటి పార్టీ నాయకులు సందీప్ చౌహన్‌తో పాటు టిజెఎస్ నాయకులు భవానిరెడ్డి, శ్రీశైల్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించిన ప్రతిపక్షాలను ముఖ్యమంత్రి హేళన చేస్తున్నారని వారు ఆగ్ర హం వ్యక్తం చేశారు. రైతు రాజ్యం ముసుగులో ముఖ్యమంత్రి కెసిఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో లాక్‌డౌన్ ఒక ప్రహసనంగా మారిందన్నారు. విశాఖ గ్యాస్ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో తలెత్తిన ఆరోగ్య, ఆర్థిక సమస్యలు, ముఖ్యమంత్రి స్పందన, ధాన్యం కొనుగోలు, కాళేశ్వరం టెండర్, ఆదివాసీ ప్రాంతాలకు చెందిన జివో 3పై సుప్రీంకోర్టు తీర్పు అంశాలపై సమావేశంలో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రజా గొంతుకగా పనిచేస్తాం : వెంకట్‌రెడ్డి
ప్రతిపక్షాలు ప్రజా గొంతుకగా పనిచేస్తాయని, ప్రభుత్వానికి డు..డు. బసువన్నగా ఉండవని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్ ఇంతకు రాజ్యాంగాన్ని చదివారా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ తన వైఖరి మార్చకోవాలని సూచించారు. భవన కార్మికులకు భవన సంక్షేమ నిధి నుండి సాయం చేసి ఆదుకోవాలని, వారి నుండి ఇది వరకే అన్ని పత్రాలు తీసుకున్నారని గుర్తు చేశారు. పేదలు కూడా తమ సమస్యలను, సాయం కోరుతూ స్థానిక తహసీల్దార్లకు దరఖాస్తులు చేసుకోవాలని, ఈ విషయంలో తాము పూర్తి అండగా ఉంటామని భరోసానిచ్చారు. డబ్ల్యుహెచ్‌ఒ సూచన మేరకు ట్రేస్, టెస్ట్, ట్రీట్‌ను అమలు చేయాలనడం ప్రతిపక్షాల తప్పా అని సిఎంను ప్రశ్నించారు. మూడు నెలల పాటు రేషన్ తీసుకోని వారికి కరోనా సమయంలో ఆదుకోకపోవడం అన్యాయమన్నారు.