ఢిల్లీలో సీతారాం ఏచూరి సంతాప సభలో ‘ఇండియా’ నేతలు
న్యూఢిల్లీ : ఇటీవల మరణించిన సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడమే ఆయనకు అసలైన నివాళి అని పలువురు జాతీయ నాయకులు అన్నారు. ఆయన మరణం ప్రతిపక్షాలకు తీరని నష్టమని పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో శనివారం నాడు సీతారాం ఏచూరి సంతాప సభ జరిగింది. సభలో కేరళ ముఖ్యమంత్రి పినరరు విజయన్, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, త్రిపుర మాజీ సిఎం మాణిక్ సర్కార్, సిపిఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, డిఎంకె నేత కనిమొళి, ఎన్‌సిపి నేత సుప్రియా సూలే, ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్, ది హిందూ మాజీ సంపాదకులు ఎన్.రామ్, పలువురు ప్రతిపక్షనేతలు పాల్గొన్నారు.
ఇండియా, యుపిఏ కూటమిలో ఏచూరిది కీలక పాత్ర : రాహుల్‌గాంధీ
సీతారాం ఏచూరి కోపం, అహంకారం లేనివాడు , నమ్మదగిన వ్యక్తి అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. ఏచూరి ఏం చేసినా దేశ హితం కోసమేనని, ఈ ఆలోచనే తన చర్యలన్నింటికీ ప్రేరణనిచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమిలో ఇతర పార్టీల మధ్య వారధి లాంటి వ్యక్తి అని, ప్రస్తుత ఇండియా కూటమి, గతంలో యుపిఏ కూటమిని బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఏచూరి సిగరెట్ ఎందుకు మానేయరని అనేక సార్లు అడిగానని, బహుశా ఆ ఒక్క అలవాటునే ఆయన మానలేకపోయారన్నారు. తన తల్లికి కూడా ఏచూరి నాకంటే ఎక్కువ మితృడు అని, కొద్ది రోజుల క్రితం మా తల్లి వద్దకు వచ్చారని, అప్పుడు ఆయన దగ్గుతూ ఉన్నారని చెప్పారు. వారిద్దరూ ఎలాంటి పరిస్థితులలో ఆసుపత్రికి వెళ్ళాలనుకోవద్దనే వారని, ఆరోజు ఏచూరిని వెళ్ళాలని కోరానని గుర్తు చేశారు. ఏచూరి కుమారుడు మరణించినప్పుడు ఆయనకు ఫోన్ చేసి ఏమి మాట్లాడలేకపోయానని, ఏచూరి మరణించినప్పుడు ఆయన భార్యకు లేఖ రాద్దామని ఏమీ రాయలేకపోయానని రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్ని వత్తిళ్ళు ఉన్నా ఆయన ఎన్నడూ రాజీపడలేదని, ఏది చేసిన దేశ హితం కోసమేనని అన్నారు.
కమ్యూనిస్టు కుటుంబానికి, దేశాని నష్టం : డి.రాజా
సీతారామ్ ఏచూరి, తనకు విద్యార్థి ఉద్యమ కాలం నుంచి పరిచయం అని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సమకాలీన చరిత్రలో అద్భుతమైన కమ్యూనిస్టు నాయకులలో ఆయన ఒకరు అని కొనియాడారు. నాటి నుంచి ఇద్దరం వివిధ దశల్లో సన్నిహితంగా పని చేశామని, ఆయన పొలిట్‌బ్యూరోకు, తాను జాతీయ నాయకత్వానికి ఒకే స మయంలో వచ్చామయని, రాజ్యసభలో ఒకే సమయంలో కలిసి పని చేశామని, చివరకు రెండు వామపక్ష పార్టీలకు ఒకే సందర్భంలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్నామని చెప్పారు. ఏచూరి మరణం కేవలం సిపిఐ(ఎం)కు మాత్రమే కాకుండా, మొత్తం కమ్యూనిస్టు ఉద్యమం, కమ్యూ నిస్టు కుటుంబానికి, దేశానికి అంతటికీ నష్టమని పేర్కొన్నారు. యునైటెడ్ ఫ్రంట్ డ్రాఫ్టింక్ కమిటీలో, యుపిఎ సిఎంపి కమిటీలో తామిద్దరం అనేక క్లిష్టమైన సమావేశాలలో నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గతంలో సిపిఐ, సిపిఐ(ఎం)ల ప్రధాన కార్యదర్శులుగా ఉన్న ఇంద్రజిత్ గుప్తా, సుర్జీత్ సింగ్‌లు కమ్యూనిస్టు పార్టీలు, ఉద్యమాన్ని మరింత దగ్గరగా తీసుకువచ్చేందుకు ఒక ప్రయత్నం చేశారని, తామిద్దరం దానిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే అంశంపై అనేక సార్లు చర్చించామన్నారు. ఏచూరి మరణం తనకు వ్యక్తిగతంగా కూడా నష్టమన్నారు.
మా అనుబంధం 50ఏళ్ల నాటిది : ప్రకాశ్ కారాట్
ఏచూరితో తనకున్న అనుబంధం 50 ఏళ్ల నాటిదని సిపిఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ అన్నారు. వామపక్ష ఉద్యమానికి ఆయన చేసిన కృషిని, ముఖ్యంగా హిందుత్వ రాజకీయాలపై ఆయన చేసిన విమర్శలను గుర్తు చేసుకున్నారు. మెరుగైన భారతదేశం ,సామ్యవాద భారతదేశం ఏచూరి ఆలోచన అని, ఈ ఆలోచనను నెరవేర్చే దిశగా మనమందరం కలిసి పని చేయాలని, అదే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని ఆయన అన్నారు.
ఏచూరి మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త : విజయన్
సీతారాం ఏచూరి భారతీయ చరిత్ర, సమాజం, సంస్కృతి , రాజకీయాలపై మంచి అవగాహన ఉన్న మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త అని కేరళ ముఖ్యమంత్రి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ అన్నారు. ఆయన వివిధ రాజకీయ పార్టీల నాయకులను ఏకతాటిపైకి తీసుకురాగలిగారని, ఇండియా బ్లాక్‌ను నిర్మించడంలో కీలక పాత్ర పోషించాడు అని ఆయన చెప్పారు.
సీతారాం సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలి : ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ‘ప్రజలను, పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కామ్రేడ్ సీతారాం గొప్ప సమర్థుడు అని అన్నారు. పార్టీల మధ్య విభేదాలను తొలగించడానికి ఆయన నిరంతరం చర్చలు జరిపేవారని, దేశ ప్రజల కోసం, ముఖ్యంగా పేదల కోసం ఆయన నిరంతరం కృషి చేశారని కొనియాడారు.ఇండియా బ్లాక్ నిర్మాణంలో సీతారాం పాత్ర గురించి ఖర్గే న మాట్లాడుతూ ఏచూరికి ప్రజాస్వామ్యంపై ఎంతో నమ్మకం ఉందన్నారు.
దేశాన్ని రక్షించడానికి నిరంతరం కృషి చేశారు : ఫరూక్ అబ్దుల్లా
సీతారాం ఏచూరి భారతదేశం యొక్క విలువలను కాపాడడమే కాకుండా, దేశాన్ని రక్షించడానికి నిరంతరం కృషి చేశారని నేషనల్ కాన్షరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. మహారాష్ట్రలో జరిగిన పోరాటాలకు ఏచూరి విశేష కృషి చేశారని, ముఖ్యంగా ఉల్లి రైతులు చేసిన పోరాటానికి ఆయన తన సంఘీభావాన్ని తెలిపారని ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలే అన్నారు.భిన్నత్వంలో ఏకత్వం ఉందని విశ్వసించారని డిఎంకి ఎంపి కనిమొళి గుర్తు చేసుకున్నారు. ఇండియా వేదికను ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించి, పార్టీలకే కాదు.. ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయినప్పుడు సీతారాం ఏచూరి మద్దతునిచ్చారని ఆప్ నేత గోపాల్ రాయ్ అన్నారు. భారత రాజకీయాలలో ఆయన ఎల్లప్పుడూ విశిష్టనేతగానే ఉంటారని అన్నారు.