ఆర్‌టిసి సమ్మె పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి
ఇడిల కమిటీ నివేదికలోని లెక్కలన్నీ సరైనవేనా?
డిమాండ్లు తీరిస్తే ఎంత భారం పడుతుందో తేల్చండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ప్రజాపక్షం / హైదరాబాద్ : ‘ఆర్‌టిసి బస్సుల్లో నేను కూడా ప్రయాణించాను. సామాన్యుడి బాధలు ఎలా ఉంటాయో తెలుసు. సామాన్యుడికి సణుగుడే ఉంటుంది. స్వరం పెంచలేడు. గోడు చెప్పుకోలేదు. బస్సు ఉంటేనే దవాఖానాకు వెళతాడు. లేకపోతే అంబులెన్స్‌లో వెళ్లి వైద్యం చేయించుకోలేడు. ఆదిలాబాద్‌లో గిరిజను డు గోడు చూడండి. పాలమూరు పౌరుల పాట్లు కనండి. రోగం వస్తే పక్కనే ఉన్న వరంగల్ లేదా హైదరాబాద్ దవాఖాలకు వెళ్లాలంటే ఎన్ని కష్టాలు పడతారో ఒక్కసారి ఊహించుకోండి. ఆర్‌టిసి సమస్యను అంత లోతుగా ప్రజావీక్షణం చేస్తేనే తెలుస్తుంది. అందుకే ఇప్పటికీ ఆర్‌టిసి సమ్మె విషయాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించి ఇరుపక్షాలను ఒక్క అడుగు ముందుకు పడేలా చేయాలని పదేపదే కోరుతున్నాం. విజ్ఞాపనలు చేస్తున్నాం. బస్పు లేక రోగం వచ్చిన మన పిల్లలు ప్రాణాలు నిలిపేలా మన చర్యలు ఉండాలి. పిల్లల ప్రాణాలు పోయేలా విధానాలు ఉండకూడదు’ అని హైకోర్టు తీవ్ర స్వరంతో మానవీయతతో వ్యాఖ్యానాలు చేసింది. సమ్మెకు వ్యతిరేకంగా ఒయు రీసెర్చ్ స్కాలర్ సుబేందర్‌సింగ్ దాఖలు చేసిన పిల్‌ను సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. చర్చలు జరపాలని 18న ఆదేశిస్తే 26న చర్చలు జరిపామని అడిషినల్ ఎజి రామచందర్‌రావ్ చెప్పారు. ఆర్‌టిసి సర్కార్‌లో విలీనం చేయాలన్న మెయిన్ డిమాండ్‌కు ముడిపెట్టి ఇతర డిమాండ్లపై చర్చ చేయలేదన్నారు. గంట ఆలస్యంగా చర్చకు వచ్చి మధ్యలో బయటకు వెళ్లి వచ్చాక కూడా చర్చలు చేయలేదన్నారు. విలీనం చేయాలన్న డిమాండ్ అమలు చేసే ప్రసక్తే లేదని, ఇది అమలు సాధ్యంకానిదని, దీనితో ముడి పెట్టడం వల్ల ఇతర 21 డిమాండ్లపై చర్చలు జరగలేదని, అన్నింటినీ రికార్డు చేశామని చెప్పారు. సమ్మె చట్ట వ్యతిరేకమని 2015లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్నే తిరిగి జారీ చేయాలని కోరారు. ఆర్‌టిసికి వార్షిక నష్టం రూ.1200 కోట్లని, సమ్మె కారణంగా రూ.75 కోట్ల నష్టం వచ్చిందని, రోజూ పది కోట్లు నష్టం వస్తోందని తెలిపారు. ఆర్‌టిసి నష్టాల ఊబిలో కూరుకుపోయిందని, ఆదాయం 4882 కోట్లు అయితే ఖర్చు 5811 కోట్లని తెలిపారు. 2017లో మధ్యంతర భృతి 16 శాతం ఇస్తే గత ఏడాదికి రూ.200 కోట్లు అవుతోందన్నారు. ఆర్థిక కష్టాల ఊబిలో ఆర్‌టిసిఉందని, 2014 నుంచి 2019 సెప్టెంబర్ వరకూ రూ.4253 కోట్లను ప్రభుత్వం ఇచ్చిందని, ఇలా ఇస్తూ పోవడం కష్టమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రాయితీల బకాయిలు రూ.5 వేల కోట్లకు గానూ రూ.47 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అనే ప్రశ్నకు అదనపు ఎజి కల్పించుకుని రాజ్యాంగంలోని 226 అధికరణ కింద అన్నింటినీ హైకోర్టు విచారణ చేయాల్సిన అవసరం లేదన్నారు. 10 వేల బస్సుల్లో నాలుగు వేలు మాత్రమే నడస్తున్నాయి. రోగులు ఇక్కట్లు వర్ణనాతీతం. పౌర, మానవహక్కుల అంశంతో ముడిపడిన వ్యవహారమిది.రాజ్యాంగంలోని 226 ప్రకారం విచారణ పరిధి ఆకాశమే. హద్దుల్లేని తీరులో హైకోర్టు విచారణ చేస్తుంది.. అని డివిజన్ బెంచ్ గట్టిగా జవాబు చెప్పింది. ఆర్టీసీ సమ్మె చేస్తున్న యూనియన్, జేఏసీ నేతలతో చర్చలు జరపాలని 18న ఇచ్చిన ఉత్తర్వుల మేరకు 26న అధికారులు 21 అంశాలపై చర్చలు జరిపారని అదనపు ఏజీ చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆమోదయోగ్యం కాని డిమాండ్‌ను చర్చిస్తేనే ఇతర డిమాండ్లపై చర్చ చేస్తామని యూనియన్లు పట్టుబట్టాయని, వాయిదా వేశాక తిరిగి సమావేశం అయినా చర్చలు కొలిక్కి రాలేదని చెప్పారు. అధికారులు నిరీక్షించి వెళ్లిపోయారని, విలీనం అంశం అమలు ఏనాటికీ అమలు కాబోదని, అమలు చేయలేమని తేల్చి చెప్పారు. ఈడీలు చర్చల సమయంలో అధికారులకు ఇచ్చిన రిపోర్టులోని అంశాల్ని ఆయన చెప్పారు. దీంతో ఆ రిపోర్టును డివిజన్ బెంచ్ తీసుకుని పరిశీలించింది చర్చలు ఏవిధంగా ఉండాలో, ఏవిధమైన ఫలితాలు ఉండాలో ముందే ఒక నిర్ణయంతో రిపోర్టు తాయరు చేశారా. ఇది సమర్ధనీయం కాదు. క్లోజ్‌డ్ మైండ్‌గా రిపోర్టు ఉంది. ఈ అభిప్రాయం ఉన్నప్పుడు చర్చల వల్ల ఉపయోగం ఏముంటుంది.. నాలుగు డిమాండ్లకు ఆర్థిక భారం ఉంటుందని కమిటీ తేల్చినప్పుడు మిగిలిన వాటిని ప్రస్తావించలేదు. 21వ డిమాండ్ ఏపీ పునర్ విభజన చట్టంతో ముడిపడిందన్నారేగానీ ఆ చట్టంలోని రూల్ గురించి చెప్పలేదు.