రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్ ధరలు
సర్కారు దిద్దుబాటు చర్యలు శూన్యం
న్యూఢిల్లీ: సామాన్యుడికి మరోసారి చావుదెబ్బ తప్పలేదు. పెట్రో ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగి, సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కేంద్రం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడం సామాన్యుడిని మరింత అసహనానికి గురి చేస్తున్నది. ప్రతి సోమవారం పెట్రోలు, డీజిల్‌పై 25 పైసల చొప్పున పెంచ డం ఆనవాయితీగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర 84.95 రూపాయలకు చేరగా, లీటర్ డీజిల్ ధర 75.13 రూపాయలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధరలను బట్టి, దేశంలోని చమురు కంపెనీలు రోజువారీ సమీక్షను జరిపి, ధరలను నిర్దేశించాలి. కానీ, ఈ కసర త్తు జరుగుతున్న దాఖలాలు లేవు. కొవిడ్ పేరు తో సమీక్షలు జరగడం లేదుగానీ, క్రమం తప్పకుండా ధరల పెరుగుదల మాత్రం కొనసాగుతునే ఉండడం విచిత్రం. ఈనెల 13, 14 తేదీ ల్లో రెండు దఫాల్లో 25 పైసలు చొప్పున మొత్తం లీటరు పెట్రోలు, డీజిల్ ధరను 50 పైసలు పెంచేశారు. తాజా నిర్ణయంతో ఢిల్లీతోపాటు, దేశ వాణిజ్య రాజధాని ముంబయిలోనూ పెట్రో ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. ముంబయిలో లీటర్ పెట్రోలు 91.34, డీజిల్ 81.87 రూపాయలకు చేరింది. 2018 అక్టోబర్ 4వ తేదీన లీటరు పెట్రోలు 91.34 రూపాయలుగా నమోదైంది. ఇప్పటి వరకూ అదే రికార్డుగా ఉండేది. తాజా పెరుగుదలతో ఆ రికార్డు మరుగున పడింది. తిరిగి రోజువారీ ధరల సమీక్షను కొనసాగిస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) హామీ ఇచ్చాయి. భారత్‌సహా పలు దేశాల్లో కరోనా వైరస్‌కు టీకాలు రావడంతో, అంతర్జాతీయ మార్కెట్ మళ్లీ గాడిలో పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కానీ, గ్లోబల్ మార్కెట్‌తో ఏ మాత్రం సంబంధం లేదన్న రీతిలో పెట్రో ధరలు పెరగడాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. ధరలను నియంత్రీకరించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోడం పరిస్థితిని మరింతగా దిగజారుస్తున్నది. 2018 అక్టోబర్ మాసంలో కేంద్రం చివరిసారి పెట్రో ధలను సమీక్షించి, ప్రజలకు ఊరట కలిగేలా లీటర్ పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 1.50 చొప్పున తగ్గించింది. ఇది జరిగి రెండు సంవత్సరాలు దాటిపోగా, మరోసారి సమీక్షించే దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం లీటర్ పెట్రోలుపై 32.98 రూపాయలు, డీజిల్‌పై 31.83 రూపాయలు చొప్పున ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేస్తున్నారు. దీనికితోడు వాట్ బాదుడు కూడా ఉంది. వాట్ ఢిల్లీలో లీటరు పెట్రోల్‌పై రూ. 19.32, డీజిల్‌పై రూ. 10.85గా ఉంది. గత ఏడాది మే నుంచి ఇప్పటి వరకూ లీటరు పెట్రోల్ ధర 15.29, డీజిల్ ధర 12.84 రూపాయలు చొప్పున పెరిగింది. పెట్రో బాదుడు నుంచి ప్రజలను రక్షించే దిశగా కేంద్రం నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవడం లేదనడానికి ఈ పెరుగుదలే నిదర్శనం.
సామాన్యుడిపై చావుదెబ్బ
RELATED ARTICLES