ఆంటిగ్వా: వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు అదరగొడుతోంది. ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లీసేన తదుపరి టెస్టు సిరీస్‌పై కన్నేసింది. ఈనెల 22 నుంచి విండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌తోనే భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో టెస్టు సిరీస్‌పై మరింత ఆసక్తి పెరిగింది. అంతకన్నా ముందు భారత్ X విండీస్ XI జట్టుతో శనివారం నుంచి మూడు రోజులపాటు సన్నాహక మ్యాచ్ ఆడనుంది. కాగా టెస్టు క్రికెటర్లు పుజారా, అజింక్యా రహానే, రోహిత్‌శర్మ, వృద్ధిమాన్ సాహా, జస్ప్రిత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ తిరిగి జట్టులో చేరడంతో వీరంతా ఈ సన్నాహక మ్యాచ్‌లో ఆడనున్నారని తెలుస్తోంది. శుక్రవారం ఆంటిగ్వాలో వీరంతా సాధన చేస్తూ చెమటోడ్చారు. పుజారా, రోహిత్, రహానే తమ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టగా వృద్ధిమాన్ సాహా సైతం తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు కష్టపడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బిసిసిఐ ట్విటర్‌లో పోస్టు చేసింది. మరోవైపు కోహ్లీ చేతి బొటన వేలికి గాయమవ్వగా ఈ సన్నాహక మ్యాచ్ ఆడబోడని తెలుస్తోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ ప్రారంభానికి ముందు కెప్టెన్‌కు సరైన విశ్రాంతి ఇవ్వాలని జట్టు భావిస్తోంది. దీంతో వైస్ కెప్టెన్ అజింక్యా రహానే జట్టును ముందుండి నడపించాలి. ఇటీవల ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంతో అతడు ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడినా ఒక శతకం, ఒక అర్ధ శతకం మినహా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో టెస్టు సిరీస్‌కు ముందు ఆటగాళ్లంతా ఎలా సన్నద్ధమౌతారో వేచి చూడాలి.