ఈ ఏడాది 5,87,599 ఎకరాల్లో సాగు అంచనా
86,524 క్వింటాళ్ల విత్తనాలు అవసరం
2,86,740 మెట్రిక్ టన్నుల ఎరువులకు ప్రతిపాదనలు
పెరగనున్న వరి, పత్తి సాగు
ప్రజాపక్షం / ఖమ్మం వ్యవసాయం : వానాకాలం సాగుకు రైతన్నలు నిమగ్నమయ్యారు. మే నెలాఖరు నాటికి తొలకరి పలకరిస్తే దుక్కులు దున్నేందుకు తమ చేలను సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్నీ మండలాల్లో చేలల్లోని చెత్తను తొలగించి దుక్కులు దున్నే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే జిల్లాలో సాగు విస్తీర్ణం, ఏమేరకు విత్తనాలు అవసరమవుతాయో అంచనాలు వేసి ప్రతిపాదనలు సిద్దం చేసి కొంత మేర విత్తనాలను కూడా అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది పత్తి 2,69,000 ఎకరాల్లో, వరి 2,80,200 ఎకరాల్లో , అపరాల సాగు తదితర పంటలను అంచనా వేసి వాటికి అనుగుణంగా విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు వ్యవసాయ శాఖాధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే రైతులకు జిలుగులు , పిల్లిపెసర, జనుము విత్తనాలను సిద్దం చేసి రైతులకు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు.
పెరగనున్న పత్తి విస్తీర్ణం :
గతేడాది పత్తికి ధర కూడా ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది పత్తి సాగు వైపు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది 2,69,000 ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యంతో వ్యవసాయ శాఖాధికారులు ప్రణాళికలు రూపొందించారు. వాటికి అనుగుణంగా 6,39,940 పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం ఉంటాయని అంచనాలు రూపొందించారు. నకిలీ బెడద లేకుండా ప్రభుత్వం అనుమతి పొందిన విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కంది, పెసర వంటి అపరాల సాగు చేసేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తుండడంతో దానికి అనుగుణంగా ముందుకు సాగాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గతేడాది ప్రకృతి కూడా రైతులపై కన్నెర్ర చేసింది. రైతుల పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాదైనా సాగు కలిసి వస్తుందన్న ఆశతో రైతులు ఉన్నారు.
2,86,740 మెట్రిక్ టన్నుల ఎరువులకు ప్రతిపాదన ః
వానా కాలం సాగును దృష్టిలో ఉంచుకుని 2,86,740 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారులు అంచనాలు రూపొందించి రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపించారు. యూరియా, డిఏపి, ఎంవోపి, కాంప్లెక్స్, సింగిల్ సూపర్, ఫాస్పెట్ ఎరువులు అవసరం ఉంటాయని ప్రతిపాదనలో పేర్కొన్నారు. నేల సారాన్ని, సాగును దృష్టిలో పెట్టుకుని ఎరువులు అవసరమవుతాయని గుర్తించారు.
సాగు విస్తీర్ణం : ఈ ఏడాది అంచనా (ఎకరాల్లో)
పత్తి సాగు 2,69,000
వరి 2,80,200
పెసర 25,000
కంది 5,500
మొక్కజొన్న, జొన్న 804
మినుములు 350
వేరు శెనగ 200
చెరకు 5,000
ఇతరములు 1505
మొత్తం 5,87,559
అవసరమైన విత్తనాలు అంచన : క్వింటాలలో
వరి – 84,060
కందులు – 220
మినుములు 28
పెసర 2,000
మొక్కజొన్న, జొన్న 36
మొత్తం 86,344
పత్తి విత్తన ప్యాకెట్లు – 6,39,940
ఎరువుల వివరాలు ఇలా :
ఎరువు మెట్రిక్ టన్నుల్లో
యూరియా 80,718
డిఏపి 36,276
ఎంవోపి 25,824
కాంప్లెక్స్ 13,49,72
ఎస్‌ఎస్‌సి 8, 950
మొత్తం 2,86,740