కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్‌లో రాస్తారోకో
ప్రజాపక్షం/చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామస్థులు కరీంనగర్ ప్రధాన రహదారిపై బుధవారం నాలుగు గం టలపాటు బైఠాయించారు. కాళేశ్వరం గాయ త్రీ పంప్ హౌజ్ నుండి నీటిని విడుదల చేసి మెట్ట ప్రాంతాలైన గుమ్లాపూర్, సాంబయ్యపల్లి, కాట్నపల్లి, మల్లన్నపల్లి గ్రామాల చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని చెరువులను నింపుతామని ఎంఎల్‌ఎ సుంకె రవిశంకర్ హామీ ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా నెరవేర్చలేదని నిరసనగా రాస్తారోకో చేపట్టినట్లు వారు చెప్పారు. గోదావరి జలాలు తమ ప్రాంతం గుండా ఎగువ జిల్లాలకు వెళ్తున్నా తమకు సాగునీటి కష్టాలు తప్పడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ రూరల్ ఎసిపి ఉషారాణి, అడిషనల్ డిసిపి శ్రీనివాస్‌లు అక్కడికి చేరుకుని విద్యార్థులు, రోగులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ధర్నా విరమించాలని కోరినప్పటికీ రైతులు తమ ఆందోళన కొనసాగించారు. జిల్లా కలెక్టర్ వచ్చేంత వరకు తమ నిరసన కొనసాగిస్తామని రైతులు చెప్పడంతో ఆర్‌డిఒ ఆనంద్ కుమార్ అక్కడికి చేరుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చా రు. అయినప్పటికీ శాంతించకపోయేసరికి పోలీసులు వారిని బలవంతంగా వాహనాల్లో చొప్పదండి పోలీస్ స్టేషన్‌కు తరలించి కొద్దిసేపటికి వదిలిపెట్టారు. కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ చొప్పదండికి చేరుకొని రైతులను సంఘీభావం ప్రకటించారు. సత్వరమే సాగునీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోలో పెద్ద ఎత్తున రైతులు, గ్రామస్థులు, రెండు వేల మందికి పైగా మహిళా రైతులు పాల్గొన్నారు.