న్యూఢిల్లీ: కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకూ ఎన్నో సందర్భాల్లో విపక్షాలు ఐక్యతను చాటుకున్నాయి. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పాయి. నిరసన వ్యక్తం చేశాయి. పార్లమెంటులో నిలదీశాయి. ఆదివారం జరగనున్న కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలని వామ పక్షాలు, కాంగ్రెస్‌సహా 19 పార్టీలు నిర్ణయించడం, సంయుక్త ప్రకటన విడుదల చేయడం ఆ పరంపరను కొనసాగించడమే. కొత్త పార్లమెంటు భవనం విషయంలో లెక్కలేనన్ని విమర్శలు, అభ్యంతరాలు ఉన్నా యి. భవన ప్రారంభోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ చేయనుండడం సరికొత్త వివాదం. మోడీ నేతృత్వంలో బిజెపి 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భావసారూప్యంగల ప్రతిపక్షాలన్నీ పలు సందర్భాల్లో ఒకేతాటిపైకి వస్తున్నాయి. 2015లో కేంద్రం తీసుకొచ్చిన భూ సేకరణ (సవరణ) ఆర్డినెన్స్ వివాదానికి కారణమైంది. వ్యవసాయ భూములను పరిశ్రమలు స్థాపించుకోవడానికి వీలుగా పరిశ్రమలకు కేటాయింపును సులభతరం చేసే ఆర్డినెన్స్‌ను 14 ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయ. పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ర్యాలీ తీసి, నిరసన వ్యక్తం చేశాయి. అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరగడంతో, కేంద్ర ప్రభుత్వానికి ఆ ఆర్డినెన్స్‌ను రద్దు చేయక తప్పలేదు. ఆ తర్వాత కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అనేకమార్లు ఒకటిగా నిలిచాయి. ప్రతిపక్ష కూటమి ఏర్పడకపోయినప్పటికీ, కేంద్ర సర్కారు ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటంలో కలసికట్టుగా పనిచేశాయి. 2020లో కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేసే సమయంలో యజ్జం తదితర తతంగాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. సంయుక్త ప్రకటనను విడుదల చేయలేదుగానీ, ఒకే మాటపై నిలబడి, ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. అదే ఏడాది శీతాకాలంలో ప్రతిపక్షాలన్నీ మళ్లీ ఒకటిగా కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థల ఆధీనం చేసే రీతిలో రూపొందిన మూడు వ్యవసాయ చట్టాలను రైతులు వ్యతిరేకించారు. సంయుక్త్ కిసాన్ మోర్చా నేతృత్వంలో, ఢిల్లీ సరిహద్దుల్లో టెంట్లు వేసుకొని, సుమారు ఏడాది పాటు నిరసన ప్రదర్శనలు చేశారు. ఆ సమయంలో దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు రైతులకు అండగా నిలిచాయి. సాగుచట్టాలను రద్దు చేసి తీరాలంటే, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఎన్‌సిపి తదితర 16 పార్టీలు డిమాండ్ చేశాయి. లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని బహిష్కరించాయి. 2021 నవంబర్‌లో ఆ మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించడం ప్రతిపక్షాలు సాధించిన మరో విజయం. 2021 మేలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, లెఫ్ట్‌సహా 13 ప్రతిపక్ష పార్టీలు ఏకమై, బిజెపికి గట్టిపోటీనిచ్చాయి. కొవిడ్ మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో, ప్రతిపక్షాల డిమాండ్ మేరకే దేశ ప్రజలకు ఉచితంగా టీకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయించింది. అదేవిధంగా 18 నుంచి 44 సంవత్సరాల మధ్యవయసుగల వారికి కూడా టీకాలు అందుబాటులోకి తేవాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రధాని నరేంద్ర మోడీని లిఖితపూర్వకంగా కోరాయి. ఆతర్వాతే కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వెలువడింది. కోరెగావ్ భీమా కేసులో అరెస్టయిన సామాజిక కార్యకర్త స్టాన్ స్వామి, 2021లో జ్యుడిషియల్ కస్టడీ ఉన్నప్పుడే మృతి చెందిన ఘటనను కూడా ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానికి రాసిన లేఖలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ తదితర పది పార్టీలు సంతకం చేశాయి. 2022 ఏప్రిల్‌లో, విద్యేష ప్రసంగాలపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ మౌనాన్ని నిలదీశాయి. మత సామరస్యానికి విఘాతం కలిగించేలా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఎన్‌సిపి తదితర 13 పార్టీలు డిమాండ్ చేశాయి. ప్రధానికి ఒక సంయుక్త లేఖను రాశాయి. 2023 మార్చిలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ సర్కారు దుర్వినియోగం చేస్తున్నదంటూ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, డిఎంకె, టిఎంసి, ఎన్‌సి తదితర 14 పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. తాజాగా కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవ సందర్భంగా తీసుకున్న మోడీ ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా, ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి. 19 పార్టీలు ఈ సంయుక్త ప్రకటనపై సంతకం చేయడం విపక్షాల ఐక్యతకు అద్దం పడుతున్నది.
సాగు చట్టాల నుంచి పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం వరకు..ఐక్యత చాటుతున్న విపక్షాలు
RELATED ARTICLES