రైతు సంఘాల స్పష్టీకరణ
జింద్: కేంద్రం అమలులోకి తెచ్చిన కొత్త సాగు చట్టాలు వద్దంటే వద్దని రైతు నాయకులు స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర, మండీ వ్యవస్థ కు గండికొట్టి, తమను బడా కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలకు వదిలేసే నల్ల చట్టాలు రద్దు చేయాల్సిందేనని నిరసన చేస్తున్న రైతులు పట్టుపట్టారు. ఈ క్రమంలో హర్యానాలోని జింద్ జిల్లా కండేల్ మహాపంచాయత్‌లో రైతులు సాగుచట్టాల అమలుకు సంబంధిచి ఐదు తీర్మానాలను ఆమోదించారు. ప్రధాని, హోం మంత్రి స్వయంగా రైతులతో సమవావేశం కావాలని తెలిపారు. కండేలా ‘మహాపంచాయత్’లో కొత్త వ్యవసాయ చట్టాలు రద్దుచేయాల్సిందేనని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ పునరుద్ఘాటించారు. అయితే ఈ మహాపంచాయతీ వేదిక కూలడం దురదృష్టకరం. జింద్‌లో ని కండేలా గ్రామంలో నిర్మించిన వేదిక దానిపైకి చేరుకున్న జనం బరువుకు కూలిపోయింది. అయితే ఈ సంఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో ఆమోదించిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమైనప్పటినుంచీ తికాయత్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లోనే ఉంటున్నారు. కాగా, జింద్ జిల్లా కండేలా గ్రామంలో నిర్వహించిన భారీ సమావేశానికి వివిధ ఖాప్ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశాన్ని సర్వజాతీయ కండేలా ఖాప్ అధ్యక్షుడు కండేలా నిర్వహించారు. అయితే వేదిక కూలడంతో భయభ్రాంతులకు గురికావద్దని తికాయత్ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక మహాపంచాయతీలో అయిదు తీర్మానాలను ఆమోదించారు. వివాదాస్పద చట్టాలను రద్దుచేయడం, పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలుచేయడం, వ్యవసాయ రుణాల మాఫీ, గణతంత్ర దినోత్సవం నాటి హింసాకాండ తర్వాత అరెస్టు చేసిన రైతులను విడుదల చేయడం ఆ అయిదు తీర్మానాలు. కండేలా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా నేరుగా ఆందోళన చేస్తున్న రైతులతో సమావేశం కావాలన్నారు. రెండు దశాబ్దాల కింద హర్యానాలో ఒక రైతుల ఆందోళనకు కండేలా ఖాప్ నాయకత్వం వహించింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులకు కండేలా ఖాప్ మద్దతు ప్రకటించింది. నిరసన స్థలాల్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత, తమను వేధించిన అధికారుల చర్యకు నిరసనగా మూడు గంటలపాటు జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధం చేస్తామని రైతు సంఘాలు సోమవారం ప్రకటించాయి.
సాగు చట్టాలు వద్దే వద్దు
RELATED ARTICLES