సమస్య పరిశీలనకు నలుగురు సభ్యుల కమిటీ
నిరసన ఆగదని రైతుల స్పష్టీకరణ
తాత్కాలిక వెసులుబాటు మాత్రమే
న్యూఢిల్లీ: తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీం కోర్టు మంగళవారం స్టే విధించింది. ఇంకా ప్రభుత్వం, ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతుల మధ్య ప్రతిష్టంభన పరిష్కారానికి నలుగురు సభ్యుల సం ఘాన్ని నియమించింది. ఈ విషయంలో ఒక ఉత్తర్వును జారీచేస్తామని ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బోబ్డే, న్యాయమూర్తులు ఎ.ఎస్.బోపన్న, వి.రామసుబ్రమణియన్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది. రైతులకు (సాధికారత, సంరక్షణ) ధరల హామీ, వ్యవసా య సేవలపై ఒప్పందం చట్టం, రైతు ఉత్పత్తు ల వ్యాపారం వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయాలు) చట్టం, అత్యవసర సరకుల (సవరణ) చట్టం మూడు చట్టాల అమలు మీద సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించిం ది. ఈ మూడు చట్టాల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ వివిధ వ్యాజ్యాలు దాఖలైన సంగతి తెలిసిందే.
కమిటీ సభ్యులు వీరే : ఈ అంశంలో రైతుల ఇబ్బందులను పరిశీలించేందుకు ఏర్పాటుచేసిన సంఘంలోని నలుగురు సభ్యుల పేర్లను ధర్మాసనం వెల్లడించింది. వారు భారతీ య కిసాన్ యూనియన్ అధ్యక్షుడు భూపీందర్ సింగ్‌మన్, మహారాష్ట్ర షేట్కారీ సంఘటన్ అధ్యక్షుడు అనిల్ ఘన్వత్, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలిసీ రీసెర్చి ఇన్సిట్యూట్ దక్షిణాసియా డైరెక్టర్ ప్రమోద్ కుమార్ జోషీ, వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటీ. విచారణలో రైతులు సంఘానికి సహకరించాలని సుప్రీం కోర్టు కోరింది. అంతేకాదు సాగు చట్టాలపై ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు తనకు అన్ని అధికారాలు ఉన్నాయని, ఏ శక్తీ తనను అడ్డుకోలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం నియమించిన సంఘం ముందుకు వెళ్లం, చట్టాలు రద్దు చేయాలన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో రైతు సంఘాలు సహకరించాలని ధర్మాసనం కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివాద పరిష్కారానికి రైతు సంఘాలు సహకరించాలని, తాము నియమించిన సంఘం ముందుకు వెళ్లాలని ధర్మాసనం సూచించింది.
మీరు సహకరించాల్సిందే
ఈ సందర్భంగా “భారత పౌరుల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు ఆలోచిస్తున్నాం. మేం సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నాం” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగిన విచారణలో సమస్య పరిష్కారానికి చట్టాలను నిలిపివేసే అధికారం తమకు ఉందని సర్వోన్నత న్యాయస్థానం పునరుద్ఘాటించింది. ఇంకా “వ్యవసాయ చట్టాలపై న్యాయమైన పరిష్కారం కోరుకునేవాళ్లు సంఘం ముందుకు వెళ్లండి” అని ధర్మాసనం స్పష్టం చేసింది. “ఇది రాజకీయం కాదు. రాజకీయాలు, న్యాయవ్యవస్థ మధ్య తేడా ఉంది. మీరు సహకరించాల్సిందే” అని రైతు సంఘాలకు సూచించింది. ఇక ఒక నిషిద్ధ సంస్థ నిరసన చేస్తున్న రైతులకు మద్దతిస్తుందని దాఖలైన అర్జీ గురించి సర్వోన్నత న్యాయస్థానం అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్‌ను వివరణ కోరింది. దీనికి ‘ఖలిస్తానీ’లు రైతుల నిరసనలోకి చొరబడ్డారని వేణుగోపాల్ బదులిచ్చారు. అయితే దీని గురించి ఒక అఫిడవిట్ దాఖలు చేయలని ధర్మాసనం కోరగా, బుధవారం నాటికి చేస్తామని అటార్నీ జనరల్ చెప్పారు.
ట్రాక్టర్ ర్యాలీపై అర్జీ
జనవరి 26 నాడు రైతులు నిర్వహించేందుకు ప్రతిపాదించిన ట్రాక్టర్ ర్యాలీ, లేదా మరో నిరసన గణతంత్ర వేడుకలకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని, దానిని నిలిపివేసేందుకు ఉత్తర్వులు జారీచేయాలని కేంద్రం ఢిల్లీ పోలీసులతో దరఖాస్తు పెట్టించింది. దీనిపై కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. గణతంత్ర దినోత్సవం నాడు నిరసనకారుల చిన్న బృందం ఒకటి ట్రాక్టర్ ర్యాలీకి ప్రణాళిక రచించినట్లు భద్రతా సంస్థలకు సమాచారం అందిందని కేంద్రం ఈ దరఖాస్తులో పేర్కొంది. కొత్త సాగు చట్టాలపై రైతుల నిరసనకు కేంద్ర స్పందనపట్ల “తీవ్ర అసంతృప్తికి” లోనైనట్లు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ప్రకటించింది. సమస్య పరిష్కారానికి మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని నియమిస్తామని కోర్టు పేర్కొంది. చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం చెప్పడంతో జనవరి 7 నాడు ప్రభుత్వానికి, రైతు సంఘాలకు జరిగిన ఎనిమిదో విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. అయితే రైతు నాయకులు కూడా చచ్చేవరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ‘లా వాపసీ’ అయితేనే తమ ‘ఘర్ వాపసీ’ జరుగుతుందని స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.
చట్టాలు రద్దయ్యేవరకు నిరసన
మూడు సాగు చట్టాల మీద సుప్రీం కోర్టు విధించిన స్టేను రైతు నాయకులు స్వాగతించారు. అయితే చట్టాలు రద్దు చేసేంతవరకు నిరసన కొనసాగుతుందని స్పష్టంచేశారు. తర్వాత కార్యాచరణ గురించి నిర్ణయించేందుకు 40 నిరసన చేస్తున్న రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్చా మంగళవారం ఒక సమావేశం ఏర్పాటుచేసింది. సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ముందు తాము హాజరు కాలేమని రైతు నాయకులు వెల్లడించారు. అయితే ఈ విషయంలో మోర్చా ఒక అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. “మాకు కమిటీ అనే ఆలోచనపై నమ్మకం లేదు. ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తాం అని సూచించినప్పటినుంచీ మేం ఇదే చెప్తున్నాం. ఈసారి సుప్రీం కోర్టు చెప్పింది. ఈ కమిటీ ఎలా పనిచేస్తుందో చూడాలి” అని ఆల్ ఇండియా కిసాన్ సభ (పంజాబ్) ఉపాధ్యక్షుడు లఖ్‌బీర్ సింగ్ పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థానం నియమించినప్పటికీ కమిటీ విచారణలో రైతు సంఘాలు భాగం కాబోవని సంయుక్త కిసాన్ మోర్చా సోమవారం ఒక ప్రకటన జారీచేసింది.
ప్రభుత్వానికి చెంపపెట్టు
సాగు చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 23 నాడు ఉత్తరప్రదేశ్ రాజ్‌భవన్‌ను ‘ఘెరావ్’ చేస్తామని ఒక వర్గం నిరసనకారులు సోమవారం హెచ్చరించారు. ఆ రోజు సాగు చట్టాల ప్రతులను తగలబెడతామని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) ప్రతినిధి ధర్మేంద్ర మాలిక్ ఒక ప్రకటనలో అన్నారు. ఘాజీపుర్ సరిహద్దుల్లో జరిగిన బికెయు కార్యనిర్వాహక వర్గం సమావేశంలో జనవరి 18 నాడు ‘మహిళా కిసాన్ దివస్’గా జరపాలని నిర్ణయించినట్లు మాలిక్ పేర్కొన్నారు. ఆ రోజు నిరసన ఉద్యమానికి గ్రామీణ మహిళలు నేతృత్వం వహిస్తారని ఆయన చెప్పారు. ఇక సాగు చట్టాలపై సుప్రీం తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని, నైతిక బాధ్యతగా వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాజీనామా చేయాలని బికెయు నాయకుడు రాకేశ్ తికాయత్ అభిప్రాయపడ్డారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులు నవంబర్ 28 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ చట్టాలు వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణలని, దళారులను తొలగించి, రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛను ఇస్తాయని కేంద్రం అంటోంది. అయినప్పటికీ కొత్త చట్టాలు కనీస మద్దతు ధర, మండీ వ్యవస్థలకు గండికొడతాయని, రైతులను బడా కార్పొరేట్ల దయకు వదిలేస్తాయని నిరసన చేస్తున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాగు చట్టాలపై సుప్రీం స్టే
RELATED ARTICLES