ప్రజాపక్షం/ఎడపల్లి సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కారు. నిజాంసాగర్ డిస్టిబ్యూటరీ కెనాల్ 46 (డి46) కింద సాగుచేసిన పంటలకు సాగునీరు ఇస్తారా లేక ఆత్మహత్యలు చేసుకోమంటారా అంటూ అధికారులను నిలదీశారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాటాపూర్ గేటు వద్ద బోధన్ ప్రధాన రహదారిపై
పలు గ్రామాల రైతులు బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ పంటలు వేసిన నాటి నుండి సాగునీటి కోసం రైతులు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. డి. 46 కెనాల్ కింద రైతులు దాదాపు 5 వేల ఎకరాల్లో వరి పంటలు సాగు చేశారన్నారు. పంటలు వేసిన నాటి నుంచి అధికారులు డి 46 కెనాల్‌కు సాగునీటి నిలిపివేయడం సరికాదన్నారు. కెనాల కింద ఎకరాకు రూ. 35 వేలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగుచేశారన్నారు. ఇదిలా ఉండగా బోరు మోటార్లతో పంటలు పండిద్దామని అనుకొన్నా సరిగా కరెంటు ఇవ్వడం లేదని ఆరోపించారు. మరో పదిరోజుల్లో నీరు వదిలితే పంటలు చేతికొస్తాయని తెలిపారు. ఈ సమయంలో అన్ని కెనాల్ ల ద్వారా సాగు నీటిని పంపిణీ చేసి అధికారులు కేవలం డి. 46 కెనాల్‌కు నీటిని నిలిపివేయడం దుర్మార్గమన్నారు. దీనివల్ల రైతులు పెద్ద ఎత్తున పంటలు నష్టపోయే ప్రమాదముందన్నారు. కాలువకు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. నీరు ఇవ్వకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. సమాచారం అందుకొన్న బోధన్ ఏసిపి కిరణ్ కుమార్, సిఐ శ్రీనివాస్ రాజ్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చచెప్పే ప్రయత్నంచేయగా ససేమిరా అన్నారు. దీంతో ఏసిపి కిరణ్‌కుమార్ బోధన్ ఆర్‌డివోకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా త్వరలోనే డి 46 ద్వారా సాగునీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. రాస్తారోకోతో రోడ్డుకిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ రాస్తారోకోలో బర్దిపూర్, భూలక్ష్మి క్యాంప్, పెంటా కలాన్, అంబం, ఏఆర్‌పి క్యాంపు, జైతాపూర్ తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.
సాగునీటి కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
RELATED ARTICLES