14 గేట్ల ద్వారా 1,06,000 క్యూసెక్కుల నీటి విడుదల
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 4,64,724 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో
ప్రజాపక్షం/ నందికొండ నాగార్జునసాగర్‌లో కృష్ణమ్మ సందడి మొదలైంది. శ్రీశైలం నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లను డ్యామ్ ఎస్‌పి ధర్మా నాయక్ 13వ గేటు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఎగువ శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను 20 అడుగుల మేరకు ఎత్తగా, దిగువనున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 4,64,761 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని డామ్ అధికారులు 585.40 అడుగుల నీటిమట్టాన్ని ఖరారు చేసుకొని రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. 14 గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి దిగువ కృష్ణానదిలోకి 1,06,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆదివారం సాయంత్రానికి సాగర్ జలాశయం నీటి మట్టం 585.40 అడుగులుగా ఉంది. నీటి విడుదల అనంతరం ప్రాజెక్టు పర్యవేక్షణ అధికారి ధర్మా నాయక్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎగువ కృష్ణా పరివాహాక ప్రాంతంలో వర్షాలు కురువడం వల్ల కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండాయన్నారు. నీటి విడుదల కార్యక్రమంలో ప్రాజెక్టు ఇంజనీర్లు పరమేశ్, సత్యనారాయణ, శ్రీనివాసరావు, కృష్ణయ్య, పుల్లారావు, తదితరులున్నారు.
సాగర్ గేట్లు ఎత్తివేత
RELATED ARTICLES