హాలియా, నందికొండ మున్సిపాల్టీలకు రూ.30 కోట్లు
నల్లగొండ జిల్లాలో 15 ఎత్తిపోతల పథకాలు మంజూరు
తెలంగాణపై కేంద్రం వ్యతిరేక వైఖరి
కృష్ణా జలాలపై ఎపి ప్రభుత్వం దాదాగిరి చేస్తోంది
ఆరు నూరైనా దళితబంధు అమలు చేస్తాం
ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడి
ప్రజాపక్షం/ నల్లగొండ ప్రతినిధి “నాగార్జునసాగర్ అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది, అభివృద్ధి జరగలేదు. హాలియా పట్టణాన్ని సుందరవనంగా చేసుకుందాం. నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్నాం’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వప్రకటించారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.15 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు చెప్పారు. హాలియాలో డిగ్రీ కళాశాల, మినీ స్టేడియం నిర్మిస్తామన్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 15 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేశామని, వీటన్నింటినీ ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందని, కృష్ణా జలాలపై ఎపి ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలపై రానున్న రోజుల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గం పై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వరాల జల్లు కురిపించారు. సాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై హాలియా మార్కెట్ యార్డులో నియోజవకర్గ ప్రగతి సమీక్ష సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి సిఎం కెసిఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడారు. సాగర్ ఉప ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని ఇచ్చి ముందుకు నడిపించినందుకు ప్రజలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ నియోజకవర్గ ఎంఎల్ఎ నోముల భగత్ అనేక సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా శాసన సభ్యులతో పాటు ఇతర శాసనసభ్యులు సమస్యలపై నివేదిక అందించారు. గ్రామాలలో పొలాలకు వెళ్లే దారిలేక కల్వర్టులు లేక, ఆసుపత్రుల పరిస్థితి దయనీయంగా ఉందని వివరించారు. తాను నియోజకవర్గానికి మూడు సార్లు వచ్చానని, ఎప్పుడు కూడా హాలియా పట్టణానికి రాలేదని, పట్టణాన్ని చూస్తేనే సమస్య అర్థమవుతుందని వచ్చానని, ఇక్కడ రోడ్లు సక్రమంగా లేవని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, వాటిని క్రమ క్రమంగా పూర్తి చేసుకుందామని తెలిపారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటన్నింటిని త్వరలో పూర్తి చేసుకునేందుకు మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసి పనులు త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేపిస్తానన్నారు.
హాలియా, నందికొండ మున్సిపాల్టీలకు రూ. 15 కోట్ల చొప్పున నిధులు
సమస్యలకు నిలయంగా ఉన్న హాలియాతో పాటు నందికొండ మున్సిపాల్టీల అభివృద్దికి చెరో రూ.15 కోట్ల చొప్పున రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు. మున్సిపాల్టీల అభివృద్ధికి మున్సిపల్ అధికారులతో సమీక్షించి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ మంత్రి లేదా మున్సిపల్ సెక్రటరీ పిలిపించుకుని అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. హాలియాలో మంజూరు చేసిన డిగ్రీ కళాశాలకు పక్కా భవనం, సిబ్బంది ఏర్పాటుకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా నియోజకవర్గంలో ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ రోడ్లు సరిగా లేవని వాటితో పాటు కల్వర్టు నిర్మాణానికి రూ.120 కోట్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. నియోజకవర్గానికి మొత్తం రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా నాగార్జున సాగర్‌లో శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎంపిగా ఉన్న సమయంలో కొన్ని ఫండ్స్ ద్వారా రెడ్డి కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేశారని, ఆ కళ్యాణ మండపానికి స్థలం కేటాయిస్తున్నామన్నారు. షాదీఖానా, మినీ స్టేడియం, బంజార భవనం నిర్మాణానికి స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు. సాగర్ క్వాటర్స్లలో, ఇరిగేషన్ స్థలాల్లో ఇండ్లు కట్టుకుని నివసిస్తున్న వారందరికి రెగ్యులరైజ్ చేస్తూ పట్టాలు అందిస్తామని తెలిపారు. పోడు భూముల విషయంలో 2005 కటాఫ్ తేదీ చట్టం ఉన్నందున చట్టం ప్రకారం సమస్యలు పరిష్కారిస్తామన్నారు.
15 లిప్టులు ఏడాదిన్నరలో పూర్తి
గుర్రంపోడ్ ప్రాంతంలో ఒక లిప్టు పెట్టినట్లయితే ఐదారు గ్రామాలకు కలిపి పది వేల ఎకరాలకు నీరు వస్తుందని చెప్పారు. త్వరలో గుర్రంపోడ్ లిప్టు సర్వే చేపట్టాలని అధికారులకు ఆధేశిస్తామని, దీనికి కూడా నెల్లికల్ లిప్టుతో పాటు మంజూరు చేస్తున్నామన్నారు. దేవరకొండలో 5 లిప్టులు మంజూరు చేశామని, మిర్యాలగూడ లో 5, నకిరేకల్ అయిటిపాముల రిజర్వాయర్ వద్ద 1 లిప్టుతో పాటు 10 వేల లిప్టులను మంజూరు చేయడం జరిగిందన్నారు. లిప్టులన్ని వచ్చే ఏడాదిన్నర పూర్తి చేసి జిల్లా ప్రజలకు అందిస్తామన్నారు.
పిహెచ్సి సెంటర్లను అప్‌గ్రేడ్ చేస్తాం
రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఆశించిన స్థాయిలో లేవని అన్నారు. ఆరోగ్య శాఖ పనితీరును మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న 18 వేల బెడ్లను, ఆక్సిజన్ సరఫరా చేసుకునే బెడ్స్‌గా మార్చుకున్నామన్నారు. 7 కొత్త మెడికల్ కళాశాలలను మంజూరు చేశామని, 33 జిల్లా కేంద్రాలలో మెడికల్ కాలేజీలతో పాటు ప్రతి కాలేజీకి 500 పడకలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. హైదరాబాద్‌లో 4 సూఫర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నామన్నారు. నల్లగొండ , సూర్యాపేట జిల్లాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని, నాగార్జున సాగర్‌లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్సి)లను అప్‌గ్రేడ్ చేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు.
గులాబి కండువా కప్పుకుని ప్రచారం చేస్తామన్న జానా మాట తప్పారు
“రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే శాసనసభలో 2 నెలల్లో విద్యుత్ వ్యవస్థను బాగు చేస్తామని చెప్పి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తామని చెబితే జానారెడ్డి ఎగతాళి చేసిండు. రెండు నెలలు కాదు ఇరువై ఏళ్లు అయినా పూర్తి చేయలేరని, పూర్తి చేస్తే తాను గులాబి కండువా కప్పుకుని టిఆర్ఎస్ పార్టీ తరుపున ప్రచారం చేస్తానని చెప్పి మాట తప్పారు. కానీమొన్న జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు. కలలో కూడా ఊహించనటువంటి ఆల్ట్రామెగా ప్లాంటు జిల్లాలో ఏర్పాటు అవుతుంది. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అతిపెద్ద పవర్ ప్లాంటు ఈ జిల్లాలోనే ఏర్పాటు చేసుకోవడం జిల్లా ప్రజలకు గర్వ కారణం” అని సిఎం కెసిఆర్ అన్నారు.
ఆరు నూరైనా దళిత బంధు అమలు చేస్తాం
రాష్ట్రం అనేక విజయాలు సాధించింది కానీ, దళిత జాతి మాత్రం వెనుకబడి ఉన్నది. వందకు వంద శాతం ఆరునూరైనా సరే దళిత బంధు పథకం అమలు చేస్తామని సిఎం కెసిఆర్ తేల్చి చెప్పారు. ప్రజలల్లో బ్రహ్మాండమైన ఆధరణ లభిస్తుందని, ప్రజల ఆధరణ ఉన్నంత వరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. దళిత బంధుపై విపక్షాలు ఇష్టమొచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణాలో 16 నుంచి 17 లక్షల మంది దళిత కుటుంబాలు ఉన్నాయని, అందులో 75 నుంచి 80 శాతం 12 లక్షల దళిత కుటుంబాలు ఈ పథకానికి అర్హులుగా కలిగివున్నారన్నారు. ఈ పథకం ద్వారా బ్యాంకుతో సంబంధం లేకుండా 10 లక్షల రూపాయలు నేరుగా దళిత కుటుంబానికి ఇస్తామని, దళిత సోదరుల అభివృద్ధిని కాంక్షిస్తూ పథకాన్ని రూపకల్పన చేశామన్నారు. దళిత జాతి వెనుకబడి ఉన్నదని, గత పాలకులు ఏనాడూ కూడా పట్టించుకోలేదని, పుక్కిడి పురాణాలు మాత్రమే చెప్పేదన్నారు.ఈ పథకం అమలైతే తమకు రాజకీయ పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని పేర్కొన్నారు.
కృష్ణ జలాల వివాదంలో ఎపిపై కెసిఆర్ ఆగ్రహం
కృష్ణ నది జలాలపై కేంద్రం, ఏపి ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరి సిఎం కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంభించే తెలంగాణ వ్యతిరేక వైఖరి కావ్వొచ్చు , ఆంధ్రావాళ్లు చేస్తున్న దాదాగిరి కావ్వొచ్చు కృష్ణా నది ఏ విధంగా అక్రమ ప్రాజెక్టులను కడుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. కృష్ణా నీళ్లల్లో రాబోయే రోజుల్లో ఇబ్బంది జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో మనం జాగ్రత్త పడాల్సిన అవసరముంది. పెద్ద దేవులపల్లి చెరువు వరకు పాలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి నీళ్లు ఇచ్చి అనుసంధానం చేయాలని సర్వే జరుగుతుందని, అది పూర్తయితే నాగార్జున సాగర్ ఆయకట్టు చాలా సేప్ అయ్యే అవకాశముందన్నారు. పెద్దదేవులపల్లి, పాలేరు రిజర్వాయర్ అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నాడు కోదాడ నుండి హాలియా వరకు కృష్ణా నది జలాలపై పాదయాత్ర చేశాం, ప్రజల ధీవెన ఉన్నంతవరకు కృష్ణా వాటర్ మనకు తీసుకొస్తామన్నారు. నాడు చంద్రబాబు హాయాంలో కృష్ణా నీటి జలాలను రాకుండా అడ్డుకుంటే తాను స్వయంగా వచ్చి 50 వేల మందితో ధర్నా చేశానని గుర్తు చేశారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నాడు సమైక్య పాలకులకు సంచులు మోశారని ఎద్దేవా చేశారు. కృష్ణా నది ఆయాకట్టు ప్రాంతం రైతులు రెండు పంటలు పండించుకునే విధంగా సాగు నీరు అందిస్తున్నామని తెలిపారు.
దళితుల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేందుకు దళితబంధు ః మంత్రి జగదీశ్‌రెడ్డి
వెనుకబడి ఉన్న దళితుల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేందుకే సిఎం కెసిఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం వస్తుంది అన్నవాళ్లకు అభివృద్ధి చేసి చూపిస్తున్నామన్నారు. నల్లగొండ జిల్లాలో రాష్ట్రం రాకముందుకు ఆకలి చావులు, రైతన్నలు, చేతన్నల ఆత్మహత్యలు ఉన్నాయని అన్నారు. జిల్లాలో సాగు, త్రాగునీరు లేక ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. పాతాల లోకం నుండి నీళ్లు తీసుకొచ్చినా ఫ్లోరిన్ విషం నీరు వల్ల త్రాగలేకపోయారని కృషి చేశారు. ఉద్యమ నాయకుడు కెసిఆర్ ఈ ప్రాంతంలో ఫ్లోరిన్ భూతాన్ని పారదోలేందుకు కృషి చేస్తామని, మిషన్ భగీరథ పథకాన్ని జిల్లానుంచి అమలు చేశారన్నారు. సమావేశానికి ఎంఎల్ఎ నోముల భగత్ అధ్యక్షత వహించారు. ఉప ఎన్నిక సమయంలో సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నామని భగత్ అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా నిరంతరం ప్రజల్లో ఉంటున్నానని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్లు వనమాల చంద్రశేఖర్, రాహుల్ శర్మ, శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, శాసన సభ్యులు గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్‌రావు, రమావత్ రవీంద్ర కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎంఎల్‌సి తేరా చిన్నపురెడ్డి, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌సి పూల రవీందర్, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దయ్య, ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాం చందర్ నాయక్, టిఆర్ఎస్ నాయకులు ఎంసి కోటిరెడ్డి, కడారి అంజయ్య, విజయ సింహారెడ్డి ఉన్నారు.
‘సాగర్’ అభివృద్ధికి రూ. 150 కోట్లు
RELATED ARTICLES