చారిత్రక వారసత్వం, వ్యూహాత్మక సైనిక సంపత్తికి నిలువుటద్దం
వైభవంగా 70వ భారత గణతంత్ర దినోత్సవం
ఆకట్టుకున్న శకటాలు, సైనిక విన్యాసాలు,
గాంధీ జీవనశైలి, ఆలోచనల సమాహారం
మహిళా సైనికులకు పెద్దపీట, రాజ్‌పథ్‌లో అలరించిన పెరేడ్
న్యూఢిల్లీ : చారిత్రక వారసత్వ సంపదకు, వైవిధ్యభరితమైన సంస్కృతీ సాంప్రదాయాలకు, వ్యూహాత్మక సైనిక సంపత్తికి భారత గణతంత్ర దినోత్సవం అద్దంపట్టింది. 70వ భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శనివారం రాజ్‌పథ్‌లో మహా సైనిక పెరేడ్ జరిగింది. వేలాదిమంది ప్రేక్షకులతోపాటు విదేశీ ప్రముఖులు, దేశ అగ్ర రాజకీయ నేతలు, సైనిక అధికారులు పాల్గొన్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా 90 నిమిషాలపాటు సాగిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లిన భారతదేశం 1950 జనవరి 26న గణతంత్ర దేశంగా అవతరించిన విషయం తెల్సిందే. భారత సైనిక సామర్థ్యం కళ్లకు కట్టినట్లు ప్రదర్శించడంతోపాటు వైమానిక, నావికా దళాలు, సైనిక బలగాలు ప్రదర్శించిన విన్యాసాలు ఒళ్లు జలదరింపజేశాయి. భారత ప్రజాస్వామ్య విలువలు, సంస్కృతిలో వైవిధ్యం, భిన్నత్వంలో ఏకత్వం, సైనిక సాధనాసంపత్తి ప్రస్ఫుటించేలా పెరేడ్ కొనసాగింది. ఈసారి విశేషమేమిటంటే, జాతిపిత మహాత్మాగాంధీ జీవనశైలి, ఆలోచన విధానాలు భావనాత్మకంగా అగుపించేలా పెరేడ్‌ను తీర్చిదిద్దారు. ఈ పెరేడ్‌లో మొత్తం 22 శకటాలు పాల్గొన్నాయి. అందులో 16 శకటాలు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, 6 శకటాలు కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందినవి. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడినే ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం ఈసారి ప్రత్యేకత. 21 సంవత్సరాలపాటు దక్షిణాఫ్రికాలోనే గడిపిన గాంధీ ఆ తర్వాతనే జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఉగ్రవాదిగా విరక్తిచెంది సైనికునిగా చేరి గడిచిన నవంబరు నెలలో కాశ్మీర్‌లోని షోపియన్ ప్రాంతంలో ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన లాన్స్‌నాయక్ నజీర్ అహ్మద్ వనీకి భారత జాతీయ అత్యున్నత శాంతి, సాహస పురస్కారం ‘అశోక్‌చక్ర’ను వనీ భార్య మహజబీన్, తల్లి రజాబానోలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేయడంతో పెరేడ్ మొదలైంది. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమరజవాన్ జ్యోతి వద్ద నివాళులర్పించారు. త్రివర్ణపతాక ఆవిష్కరణ, 21 తుపాకుల శబ్దభేరి, జాతీయ గీత ఆలాపన వెంటవెంటనే సాగిపోయాయి. అనంతరం సైనిక పెరేడ్‌కు రాష్ట్రపతి కోవింద్ వందన సమర్పణ చేశారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్‌ఎ)లో పనిచేసిన యోధులు, 90 ఏళ్లు పైబడిన మాజీ సైనికులు పర్మానంద్, లాల్‌తీరామ్, హీరాసింగ్, భాగ్మల్‌లు తొలిసారిగా పెరేడ్‌లో పాల్గొనడం గొప్ప విశేషం. అలాగే, అమెరికన్ హోవిట్జర్ ఎం777, మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ (ఎంబిటి) టి-90, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాశ్ ఆయుధ వ్యవస్థల ప్రదర్శన ఆకట్టుకున్నది. ఇక మహిళాశక్తి (నారీశక్తి) పేరుతో కేవలం మహిళా సైనికులతో కూడిన అస్సాం రైఫిల్స్ కంటింజెంట్ పెరేడ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించారు. ఈ పెరేడ్‌కు మేజర్ ఖుష్బూ కన్వర్ సారథ్యం వహించారు. అలాగే ఒక పురుషుల సైనిక దళానికి భావనా కస్తూరీ అనే హైదరాబాదీ వనిత నాయకత్వం వహించడం మరో విశేషం. నేవీ, ఆర్మీ సర్వీస్ కోర్‌లతోపాటు కోర్ ఆఫ్ సిగ్నల్స్ (శాటిలైట్ టెర్మినల్) యూనిట్లకు కూడా మహిళా అధికారులే నేతృత్వం వహించారు. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు పాల్గొని పెరేడ్‌ను వీక్షించారు. సైనిక సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఇదిలావుండగా, రిపబ్లిక్ డే ఉత్సవాల విచ్ఛిన్నానికి కుట్ర పన్నారన్న ఆరోపణలపై జైష్ ఏ మొహ్మద్‌కు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు అరెస్టయిన నేపథ్యంలో రాజ్‌పథ్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏరాట్లు నిర్వహించారు. క్వింట్ ఇండియా ఉద్యమాన్ని దృశ్యీకరించిన మహారాష్ట్ర శకటం, అండమాన్ సెల్యులర్ జైల్‌లో గాంధీ పాత్రను తెలిపే అండమాన్ అండ్ నికోబార్ దీవుల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పంజాబ్ శకటంలో జలియన్ వాలాబాగ్ థీమ్ విస్పష్టంగా కన్పించింది. అస్సాంలో గాంధీ ఉద్యమ జ్ఞాపకాలను తెలియజేస్తూ అస్సాం శకటం నడిచింది. కుటీర పరిశ్రమలే దేశాభివృద్ధికి ప్రధానమన్న గాంధీ ఆలోచనలు, కలలు ఈ శకటంలో అగుపించాయి. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన దండి సత్యాగ్రహం గుజరాత్ శకటం ద్వారా ప్రదర్శించగా, అనాశక్తి ఆశ్రమ రూపాన్ని చూపిస్తూ ఉత్తరాఖండ్ శకటం సాగిం ది. విశేష ప్రతిభ కనబరిచి, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ విజేతలైన 26 మంది బాలలు పెరేడ్ దర్శనమిచ్చారు. వారిలో ఆరుగురు బాలికలు వున్నారు. మద్రాస్ రెజిమెంట్, రాజ్‌పుఠానా రైఫిల్స్, సిక్ రెజిమెంట్, గోర్ఖా బ్రిగేడ్‌లతోపాటు సైనిక దళాలన్నీ ఈ మార్చ్‌ఫాస్ట్‌లో పాల్గొన్నాయి. లెఫ్ట్‌నెంట్ కమాండర్ అంబికా సుధాకరన్ సారథ్యంలో 144 యువ నావికులతో కూడిన నావికాదళ కంటింజెంట్ ఆకట్టుకున్నది. ఈ శకటానికి ‘భారతనావికాదళం-జాతీయ భద్రతకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధం’ అనే టైటిల్‌ను పెట్టారు. భారత వైమానిక దళం మార్చింగ్ కంటింజెంట్‌లో కూడా సరిగ్గా 144 మంది వైమానిక యోధులే పాల్గొనడం గమనార్హం. ‘స్వదేశీకరణను ప్రోత్సహిస్తున్న భారత వైమానికదళం’ అనే టైటిల్‌తో ఐఎఎఫ్ శకటం వారిని అనుసరించింది. ఎయిర్‌క్రాఫ్ట్, రాడార్, క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన వివిధ నమూనాలు దర్శనమిచ్చాయి. తేలికరకపు యుద్ధవిమానం (ఎల్‌సిఎ), అత్యల్ప తేలికరకపు రాడార్ (ఎల్‌ఎల్‌ఎల్‌డబ్ల్యుఆర్), సుఖోయ్-30ఎంకెఐ, ఆకాశ్ క్షిపణి వ్యవస్థ…ఇలా ఎన్నో రకాల నమూనాలు పెరేడ్‌కు నిండుదనాన్నిచ్చాయి. అర్థసైనిక బలగాలు, ఇతర అనుబంధ బలగాలతోపాటు నేషనల కోర్ (ఎన్‌సిసి), నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్‌ఎస్‌ఎస్) దళాలు కూడా పాల్గొన్నాయి. ఇక భారత వైమానిక దళ ఆకాశ విన్యాసాలు పెరేడ్‌ను తుదిఘట్టానికి తీసుకువెళ్లాయి. మూడు సి-130జె సూపర్ హెర్క్యులస్ ఎయిర్‌క్రాఫ్ట్, ఇతర హెర్క్యులస్, విఐసి విన్యాసాలు అలరించాయి. సి-17 గ్లోబ్‌మాస్టర్‌కు అటుఇటు రెండు సూ-30ఎంకెఐ యుద్ధ విమానాలు గాల్లో కొట్టిన చక్కెర్లు ఒళ్లు గగొర్పొడిచేలా వున్నాయి. ఆ తర్వాత అదే వరుసలో వచ్చిన ఐదు జాగ్వార్ యుద్ధ విమానాలు బాణం ఆకారంలో దూసుకెళ్లి మెరుపులు మెరిపించాయి. మిగ్-29 అధునాతన విమానాలు కూడా సరికొత్త విన్యాసంతో చూపరులను ఆకర్షించాయి. వెర్టికల్ చార్లీ విన్యాసంలో గంటకు 900 కిలోమీటర్ల వేగంతో సాగిన సూ-30ఎంకెఐ వైమానిక విన్యాసం అదుర్స్ అనిపించింది. భారత సైనిక వైభవాన్ని, స్ఫూర్తిని ఈ పెరేడ్ నింపింది.
సాంస్కృతిక వైవిధ్యం!
RELATED ARTICLES