నిబంధనలు ఎత్తివేసి కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ తక్షణం అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ రాష్ట్ర సమితి డిమాండ్
రాష్ట్ర సమితి నిర్మాణ సమావేశాల్లో రుణమాఫీపై ఏకగ్రీవ తీర్మానం ఆమోదం
హన్మకొండ నుంచి ఇ.చంద్రశేఖర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, పిఎంకెఎస్ నిబంధనలు, రూ.2 లక్షలకు పైబడి ఉన్న మొత్తం కడితేనే మాఫీ వర్తిస్తుందని నిబంధనలు, ఇతర సాంకేతిక సమస్యలను అన్నిటిని పరిష్కరించి, రూ.2 లక్షల రుణమాఫీని తక్షణం అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా, రైతులకు రెండు లక్షల రుణమాఫీని అమలు ప్రకటించి మూడు విడతలుగా దాదాపు 22 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేయడం పట్ల సిపిఐ హర్షం వ్యక్తం చేసింది. అయితే అందరికీ రుణమాఫీ కాకపోవడంతో రైతాంగంలో నిరాశ, ఆందోళన వ్యక్తం అవుతున్నదని సిపిఐ పేర్కొంది. హన్మకొండలో మూడు రోజులుగా జరుగుతున్న సిపిఐ రాష్ట్ర సమితి నిర్మాణ సమావేశాలు శనివారం ముగిశాయి. రైతు సమస్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. “తెల్ల రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ కాలేదు. రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేస్తామని మంత్రులు ప్రకటనలు ఇస్తున్నా ఎప్పటి వరకు చేస్తారో స్పష్టత లేకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నది. రేషన్ కార్డు ఉన్నవారికి కూడా కొంతమందికి రుణమాఫీ కాలేదు. గత 15 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వలన చాలామందికి రుణమాఫీ వర్తించలేదు. రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామన్న ప్రభుత్వం రూ.2 లక్షల పైబడిన మొత్తం చెల్లిస్తేనే రుణమాఫీ అమలవుతుందన్న ప్రభుత్వం నిబంధన వల్ల రైతుల్లో నిరాశ నెలకొన్నది. మొత్తం మీద రాష్ట్రంలో 53 శాతం మాత్రమే రుణమాఫీ పూర్తయంది. రాష్ట్రంలో ఎస్ఎల్ బీసీ లెక్కల ప్రకారం 45 లక్షల మంది రైతులకు 49 వేల కోట్ల రుణమాఫీ చేయవలసి ఉన్నది. బ్యాంకులు ఇచ్చిన లెక్కల ప్రకారం డిసెంబర్ 9 2018 నుండి 12 డిసెంబర్ 2023 తేదీల మధ్య నలువై బ్యాంకుల్లో 5742 బ్రాంచీలలో 41,78,892 మంది రైతుల అప్పులు 31 వేల కోట్లు మాఫీ చేస్తామని ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదించింది. కానీ ఇప్పటివరకు సుమారు 22 లక్షల మంది రైతులకు, సుమారు 18 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు. ఇంకా 20 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉన్నది. ఈ సమస్య తీవ్రతను రైతుల్లో నెలకొన్న నిరాశ ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు నిబంధనలు ఎత్తివేసి అందరికీ రుణమాఫీ అమలు చేయాలని ఈనెల 27న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నిర్వహిస్తున్న ఆందోళనకు సిపిఐ మద్దతు ప్రకటిస్తున్నది” అని తీర్మానం పేర్కొన్నది.