ఇకపై అంతరిక్షంలో ప్రైవేటుమార్గం
ఒబిసి కమిషన్ గడువు పొడిగింపు
పశు సంవర్ధక అభివృద్ధికి ప్రత్యేక నిధి
కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు
న్యూఢిల్లీ: దేశంలోని సహకార బ్యాంకులు ఇకపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) పరిధిలోకి రానున్నాయి. సహకార బ్యాంకులను ఆర్‌బిఐ పరిధిలోకి తీసుకొచ్చే ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ భేటీ అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. దేశంలో అర్బన్ బ్యాంకుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. అన్ని కోఆపరేటివ్ బ్యాంకులను ఆర్‌బిఐ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఈ నిర్ణయంతో 1,482 కో ఆపరేటివ్ బ్యాంకులు, 58 మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకులు ఆర్‌బిఐ పరిధిలోకి రానున్నట్టు చెప్పారు. ఆర్‌బిఐ పరిధిలోకి తేవడం వల్ల ఆ బ్యాంకుల్లోని 8.6 కోట్ల మంది ఖాతాదారులకు సొమ్ముకు భద్రత కల్పించినట్టు అవుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. మరోవైపు పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియ మరింత సులభతరం కానుందని మంత్రి చెప్పారు. ధ్రువీకరణ పత్రాల జాబితాను కుదించినట్టు తెలిపారు. పాస్‌పోర్ట్ జారీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని తెలిపారు. అంతరిక్షం ప్రైవేటీకరణ భూమ్మీద ఉన్న అన్ని వనరులను ప్రైవేటువారికి అప్పగిస్తున్న మోడీ ప్రభుత్వ కన్ను ఇప్పుడు ఆకాశంపై పడింది. అంతరిక్ష రంగంలోకి కూడా ప్రైవేటు పెట్టుబడులకు అనుమతినివ్వాలని సర్కారు నిర్ణయించింది. గ్రహాంతర అన్వేషణ కార్యక్రమాలతోపాటు అంతరిక్షానికి సంబంధించి చేసే అన్ని కార్యకలాపాల్లో ప్రైవేటు రంగం భాగస్వామ్యానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. కొత్తగా ఏర్పాటుచేసిన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రొమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్‌స్పేస్) భారత అంతరిక్ష పరిశోధన, ప్రాతిపదిక సౌకర్యాలను ఉపయోగించుకునేందుకు ప్రైవేటు కంపెనీలకు కూడా సమాంతర అవకాశాలు ఇస్తుందని, ఈ రంగంలో పోటీతత్వాన్ని పెంచడమే దీని ఉద్దేశమని అన్నారు. అంతరిక్ష విభాగం ఇకపై ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) పరిధిలోకి వస్తుంది. అంతరిక్ష రంగంలో స్నేహపూర్వక నియంత్రిత వాతావరణం కల్పించడం ద్వారా అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు పరిశ్రమలను ప్రోత్సహించడం, మార్గదర్శకత్వం వహించడం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం అంతరిక్ష శాఖ కింద ఉన్న ప్రభుత్వరంగ సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) ఇకముందు పరికరాలను సరఫరా చేసే సంస్థగా గాకుండా గిరాకీని కల్పించే సంస్థగా మారుతుందని జితేంద్రసింగ్ చెప్పారు. అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కొన్ని వారాలకే కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో కూడా సంస్కరణలు తీసుకువస్తామని చెప్పారు.
ఓబీసీ కమిషన్ గడువు పొడిగింపు
ఓబీసీ కులాల వర్గీకరణ కమిటీ గడువు మరో 6 నెలలపాటు కేంద్రం పొడిగించింది. కరోనా వైరస్ ప్రబలిన కారణంగా ఈ కమిషన్ పనిచేయడానికి అవకాశం లేకుండా పోయిందని, అందువల్ల ఇతర వెనుకబడిన కులాలకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసి, సిఫార్సులు చేసేందుకు మరింత అవకాశం కల్పిస్తున్నామని, 2021 జనవరి 31 నాటికల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తామని మంత్రి జవదేకర్ తెలిపారు. ఓబీసీలో ప్రధానంగా ఉప కులాల సమస్యపై కమిషన్ దృష్టి పెట్టాల్సివుందన్నారు.
పశు సంవర్ధక నిధి
పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 15,000 కోట్లు కేటాయిస్తున్నట్లు జవదేకర్ తెలిపారు. 35 లక్షల ఉద్యోగాలను సృష్టించడానికి అవకాశమున్న డైరీ, మాంసం ప్రాసెసింగ్, పశుదానా క్షేత్రాలు వంటి విభాగాల్లో ప్రైవేటు వ్యక్తులు, ఎంఎస్‌ఎంఇలు పెట్టుబడులు పెట్టడానికి అనుమతినిస్తున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా రూ. 15,000 కోట్లతో పశు సంవర్ధక నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలని కూడా కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.
గొప్ప నిర్ణయాలు ః మోడీ
కేంద్ర మంత్రివర్గం బుధవారంనాడు గొప్ప నిర్ణయాలు తీసుకుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన తన అభిప్రాయాలను ట్వీట్ చేశారు. ఆర్థిక పురోగతికి ఉపయుక్తమైన నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. అంతరిక్ష రంగంలోకి ప్రైవేటువారిని అనుమతినివ్వడం అద్వితీయమైన మార్పునకు సంకేతమని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో ఇదొక విప్లవమవుతుందన్నారు. ప్రధాన్ మంత్రి ముద్రా యోజన కింద శిశు లోను ఖాతాల కోసం వడ్డీ రాయితీ పథకాన్ని ఆమోదించడం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ)కు ఉపయోగకరమవుతుందని పేర్కొన్నారు. పశు సంవర్ధక నిధి రైతుల ఆదాయాన్ని పెంచుతుందని ట్వీట్ చేశారు.
ఆర్‌బిఐ పరిధిలోకి సహకార బ్యాంకులు
RELATED ARTICLES