లండన్: ప్రపంచకప్‌కు ముందు జరిగే వారప్ మ్యాచ్‌లకు కోహ్లీ సేన సిద్ధమైంది. ప్రపంచకప్‌లో భాగంగా రెండు, మూడు రోజుల క్రితం ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టిన భారత క్రికెట్ జట్టు నేడు న్యూజిలాండ్‌తో తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో రెండు నంబర్‌లో ఉన్న టీమిండియా ఆత్మ విశ్వాసంతో బరిలో దిగుతుంది. మరోవైపు ఇప్పటికే అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న ప్రపంచ 4వ ర్యాంకర్ కివీస్ కూడా విజయమే లక్ష్యంగా బరిలో దిగుతోంది. వరల్డ్‌కప్ సమరం ప్రారంభమవడానికి మరో ఐదు రోజులే ఉన్నాయి. దాని కంటే ముందు జరిగే వారప్‌మ్యాచ్‌లు ప్రతి జట్టుకు కీలకం కానున్నాయి. అక్కడి వాతవరణాన్ని, పిచ్‌లను అంచనా వేయడానికి విదేశి జట్లకు ఇది మంచి అవకాశమనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లు భారత్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతాయి. ఈ మెగా సంగ్రామంలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఈసారి టోర్నీ రౌండ్ రాబిన్ పద్దతిలో జరగనుండడం పెద్ద జట్లకు కలిసొచ్చే అంశం. ఈ పద్దతిలో ప్రతిజట్టు ఇతర జట్టుతో తలపడే అవకాశం ఉంటుంది. అందులో ఎవరూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తారో వారే విజేతలుగా నిలవడం ఖాయం. అయితే టాప్ ర్యాంకుల్లో ఉన్న జట్లే పోటీ పడుతున్నాయి. పసికూనలు ఈ టోర్నీకు దూరమవడంతో ఈసారి జరిగే ప్రతి మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయం. ఇందులో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లే సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఐపిఎల్‌లో దాదాపు రెండు నెలలు చెమటోడ్చిన భారత ఆటగాళ్లు ఇప్పుడు అసలు సీసలైన మెగా టోర్నీకి సిద్ధమయ్యారు. శనివారం కివీస్‌తో కోహ్లీ సేన ఢీ కొనేందుకు అన్ని విధాలుగా రెడీ అయింది.
ఆత్మవిశ్వాసంతో టీమిండియా..
ప్రపంచకప్‌కు ముందు జరిగిన విదేశీ పర్యటనలను విజయవంతంగా పూర్తి చేసిన టీమిండియా ఈ మెగా సమరంలో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతోంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలో కోహ్లీ సేన అద్భుత ప్రదర్శనలు చేసింది. ముందు ఆసీస్‌ను వారి సొంత గడ్డపై చిత్తుగా ఓడించి.. తర్వాత కివీస్‌లో అడుగుపెట్టి వారి సొంత మైదానాల్లో ఘన విజయాలు సాధించింది. దాంతో పాటు భారత్‌కు ఇంగ్లాండ్ గడ్డపై కూడా మంచి రికార్డులు ఉన్నాయి. గతంలో ఇక్కడే జరిగిన 1983 ప్రపంచకప్‌ను కపిల్‌దేవ్ సారథ్యంలో గెలిచింది. గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా కూడా నిలిచింది. ప్రస్తుతం భారత జట్టు మంచి ఫామ్‌లో ఉంది. విధ్వసంకర బ్యాట్స్‌మెన్‌లు, నైపుణ్యమైన బౌలర్లు, దూకుడుగా ఆడే ఆల్‌రౌండర్లతో భారత జట్టు పుష్కలంగా ఉంది. ఎలాంటి జట్లకైన సవాళ్లు విసిరేందుకు సిద్ధంగా ఉంది.
బ్యాటింగే బలం..
ఇంగ్లాండ్ పిచ్‌లపై భారీ పరుగులు నమోదవుతుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. భారత జట్టు బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు భీకర ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరూ భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. ఈసారి కూడా తమ భాగస్వామ్యంతో భారత్‌కు మంచి ఆరంభాలను అందించేందుకు ఈ ఓపెనింగ్ జోడీ సిద్ధంగా ఉంది. ఇక్కడి పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలించడం వీరికి కలిసొచ్చే అంశం. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇతడు ఒకసారి బ్యాట్‌ను ఝుళిపించడం ఆరంభిస్తే పరుగుల వరద పారడం ఖాయం. అంతే కాకుండా వన్డే చరిత్రలో ఇప్పటికే మూడు డబుల్ సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించిన రోహిత్ మరో డబుల్ సంచరీ కోసం అతృతగా ఉన్నాడు. ఇక టీమిండియా గబ్బర్ కూడా దూకుడుగా ఆడడంలో సిద్దహస్తుడు. ఈసారి ఐపిఎల్‌లో తన బ్యాట్ పవర్‌ను చూపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన ధావన్ చెలరేగి బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్‌గా మంచి ఆరంభాలు ఇస్తూ తమ జట్టుకు పెద్ద అండగా నిలిచాడు. ఢిల్లీ జట్టు చాలా కాలం తర్వాత ప్లే ఆఫ్స్‌కు చేరడంలో ఇతని పాత్ర కూడా అధికంగా ఉంది. మరోవైపు ఇంగ్లీష్ పిచ్‌లపై కూడా ధావన్‌కు మంచి రికార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన విదేశీ పర్యటనల్లో భారత తరఫున మెరుగైన ప్రదర్శనలు చేశాడు. ఈసారి కూడా తన బ్యాట్‌ను ఝుళిపించేందుకు సిద్ధమయ్యాడు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే కెప్టెన్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ధోనీ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా ఇప్పటికే పేరు సంపాదించుకున్నాడు. ఈసారి ప్రపంచకప్‌లోనూ కోహ్లీ తన విధ్వసంకర బ్యాటింగ్‌తో అందరిని ఆకర్షించనున్నాడు. ప్రస్తుతం కోహ్లీ వన్డే బ్యాట్స్‌మెన్‌ల ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ క్రీజులో ఉన్నంత సేపు ప్రత్యర్థి బౌలర్లకు వణుకే. ప్రపంచకప్‌లో కోహ్లీపై టీమిండియా ఎక్కువగా ఆధారపడి ఉంది. ఇతను పుంజుకుంటే భారత్‌కు మరిన్ని విజయాలు ఖాయం. ఇక నాలుగో స్థానంలో కెఎల్ రాహుల్, విజయ్ శంకర్‌లలో ఎవరిని ఆడిస్తారో తెలియదు. ఇద్దరిలో ఎవరికి అవకాశం లభించినా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక లోయర్ ఆర్డర్‌లో సీనియర్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, కేదర్ జాదవ్‌లు పరుగుల వరద పారించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ధోనీ పాత ఫామ్‌ను అందుకున్నాడు. ఐపిఎల్‌లో క్లాస్ షాట్లతో ఆకట్టుకున్నాడు. ఇప్పటికే భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన ఘనత సొంతం చేసుకున్న ధోనీ మూడో ప్రపంచకప్ వేటలో బరిలో దిగుతున్నాడు. ధోనీ అనుభవం భారత్‌కు ప్లస్ పాయింట్ కానుంది. ఇక యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య టీమిండియాలో ప్రత్యేక ఆకర్షనగా ఉన్నాడు. ఇతనిపై భారత యాజమాన్యం చాలా ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ యువ ఆల్‌రౌండర్ బ్యాట్‌తో, బంతితో మంచి ఫలితాలు రాబట్టుతున్నాడు. ఇక వీరందరికీ తోక బ్యాట్స్‌మెన్‌లు సహకరిస్తే భారత్ ఈ ప్రపంచకప్‌లో భారీ పరుగులు చేయడం ఖాయం.
బౌలర్లు కీలకంగా మారనున్నారు..
ఈ మెగా సమరంలో భారత జట్టుకు బౌలర్లే కీలకంగా మారనున్నారు. ఇక్కడి పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌లకు సహకరిస్తుండంతో భారీ పరుగులు నమోదు అవుతున్నాయి. అలాంటి సమయంలో బౌలర్లపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ప్రస్తుతం టీమిండియ బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. పేస్ బౌలర్లతో పాటు స్పిప్ విభాగం కూడా మెరుగైన ప్రదర్శనలు చేస్తోంది. పరుగులు నియంత్రించేందుకు భారత బౌలర్ల దగ్గర ప్రత్యేక వ్యూహాలు ఉన్నాయి. భారత పేసర్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా విజృంభించి బౌలింగ్ చేస్తున్నాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న బుమ్రా బంతితో మాయ చేస్తున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తున్నాడు. ప్రపంచకప్‌లోనూ బుమ్రా కీల కం కానున్నాడు. ఇక ఇతనికి తోడుగా భువనేశ్వర్ కుమా ర్, మహ్మద్ షమీలు కూడా మంచి ఫామ్‌లో ఉండటం టీమిండియాకు అదనపు బలం. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్, యాజువేంద్ర చాహల్, రవీంద్ర జడేజా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. శనివారం కివీస్‌తో జరిగే మ్యాచ్‌లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది.
కివీస్‌ను తక్కువ అంచనా వేయలేం..
ప్రపంచకప్ ఫేవరెట్ జట్లలో న్యూజిలాండ్ కూడా ఒకటి. కివీస్ ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉంది. ప్రపంచ అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌లతో ఈ జట్టు చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కేన్ విలియమ్సన్ సారథ్యంలో కివీస్‌మంచి ఫలితాలు సాధిస్తోంది. ఇప్పటికే ఎన్నో చిరస్మరణీయ విజయాలను ఈ జట్టు సొంతం చేసుకుంది. జట్టులో కెప్టెన్ విలియమ్సన్, మార్టిన్ గుప్టిల్, టామ్ లాథమ్, రాస్ టేలర్, టామ్ బ్లండల్, కొలిన్ మున్రో బ్యాటింగ్‌లో సంచలనం సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆల్‌రౌండర్లు గ్రాండ్‌హోమ్, మాట్ హెన్రీ, జిమ్మీ నీషమ్‌లతో పాటు విధ్వంసకర బౌలర్లు టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, ఇష్ సోధీ, ఫెర్గ్యూసన్, మిచెల్ సాంట్నర్‌లతో కివీస్ జట్టు పటిష్టంగా ఉంది. ఈ జట్టును ఓడించడం టీమిండియాకు అంత ఈజీ కాదనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో కివీస్‌కు ఎదురులేదు. ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలవని న్యూజిలాండ్ ఈసారి బలమైన బృందంతో టైటిలే ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది.
సవాళ్లకు సిద్ధమైన కోహ్లీసేన
RELATED ARTICLES