జెండావిష్కరణలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
ప్రజాపక్షం / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రయాణం అనుకున్నరీతిలో ఎంతో ఆశావహంగా ప్రారంభమైందని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పునరంకితమవుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు పూర్తి చేసుకు న్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం సిఎం కెసిఆర్ ప్రగతిభవన్‌లో జాతీయజెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే ఏ సమస్యలు తీరుతాయని ఆశించామో ఆ సమస్యలు పరిష్కారవుతున్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి రైతుల పరిస్థితి, వ్యవసాయం దారుణంగా ఉండేదని, నేడు తెలంగాణలో వ్యవసాయం దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. ఎండాకాలం వస్తే ప్రజలు మంచినీళ్ల కోసం గోస పడేవారన్నారు. అదే నేడు మిషన్‌భగీరథతో నీటి సమస్య తీరిందని చెప్పారు. విద్యుత్, సాగునీరు, విద్య, వైద్య, పారిశ్రామిక, ఐటి తదితర రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని సిఎం పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఎం కెసిఆర్ అమరవీరులకు నివాళులు అర్పించారు.
అమరవీరులకు నివాళులర్పించిన సిఎం కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద అమరవీరులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నివాళులు అర్పించారు. ఉదయం ప్రగతి భవన్ నుంచి నేరుగా గన్‌పార్క్ చేరుకున్న సిఎం అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపి సంతోష్ కుమార్, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ అమరవీరులకు నివాళులు అర్పించారు.
సిఎం కాన్వాయ్‌కి అడ్డంగా నిరుద్యోగి
గన్‌పార్కు వద్ద అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి తిరిగి వెళుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కాన్వాయ్‌కి నిరుద్యోగి హన్మంతు అడ్డుతగిలారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హన్మంతును అదుపులోకి తీసుకున్నారు.
అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహానికి నివాళి
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి , శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. అనంతరం శాసనసభ వద్ద పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి వద్ద గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఇక అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ముందుగా అమరవీరులకు నివాళి అర్పించి, అనంతరం పతాకావిష్కరణ చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో మంత్రులు, ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు అమరవీరులకు నివాళులు అర్పించారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు.
సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం
RELATED ARTICLES