పన్ను చెల్లింపులకు మొండికేస్తున్న శాఖలు
శాఖాధిపతుల సమావేశంలో బకాయిల ప్రస్తావనకు మున్సిపల్ యత్నం
ప్రజాపక్షం/ హైదరాబాద్ : ఆస్తిపన్నును సకాలంలో చెల్లించేందుకు ప్రభుత్వ శాఖలే మొండికేస్తున్నాయి. పన్నులు చెల్లించే విషయంలో సామాన్యులపై కఠినంగా వ్యవహరించే మున్సిపల్ శాఖ అదే ప్రభుత్వ శాఖల విషయానికి వచ్చే సరికే కేవలం లేఖలకే పరిమితమైంది. ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వ శాఖకు చెందిన భవనాల ఆస్తి పన్నులు దాదాపు రూ.143 కోట్ల బకాయిలు ఉన్నాయి. అలాగే ఇండస్ట్రీయల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) నుంచి ఆస్తిపన్నుల్లో స్థానిక మున్సిపాలిటీలకు రావాల్సిన 35 శాతం పన్నుల బదిలీలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆస్తి పన్నులను సకాలంలో చెల్లించేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు ముందుకు రాకపోవడంతో ఆస్తిపన్నుల బకాయిలు పేరుకుపోతున్నాయి. దీంతో పన్నులను చెల్లించాలని కోరుతూ మున్సిపల్ శాఖ ఆయా శాఖాధిపతులకు లేఖలు పంపిస్తోంది. ఇప్పటికే పలు మార్లు ఆయా శాఖాధిపతులకు గుర్తు చేసినా పెద్దగా ఫలితం లేకుండా పోయిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పైగా ప్రభుత్వ భవనాల ఆస్తిపన్నులే కదా ఎక్కడికిపోతాయి అంటూ కొందరు అధికారులు చెబుతున్నారని స్థానిక సంస్థల అధికారులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని మున్సిపల్ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయా మున్సిపల్ శాఖ పరిధిలోని ప్రభుత్వ శాఖ కార్యాలయాల ఆస్తిపన్నుల వివరాలను సేకరించి మరోసారి ఆయా శాఖా ధిపతుల దృష్టికి మున్సిపల్ శాఖ తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయింది. పన్నులను చెల్లించడంలో ఆయా శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహా రించడంతో మున్సిపల్ శౠఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒఎస్‌డి దృష్టికి తీసుకెళ్లింది. రాబోయే వివిధ శాఖాధిపతుల సమావేశంలో తమ ఆస్తిపన్నుల అంశాన్ని ప్రస్తావించాలని, పన్ను బకాయిలను సకాలంలో చెల్లించేలా వారికి తగిన సూచన చేయానలి ఆ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరనుంది.