హైదరాబాద్‌లో తెరుచుకున్న షాపులు
ఆహార పదార్థాల దుకాణాల విషయంలో స్పష్టత కరువు
వీటిని కూడా సరి, బేసిలోనే తెరవాలంటున్న అధికారులు
ప్రజాపక్షం/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో జనతా కర్ఫ్యూతో మొదలైన లాక్‌డౌన్‌తో మూతపడిన దుకాణాలు 59వ రోజు తెరచుకున్నాయి. మున్సిపల్ అధికారులు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ మహానగరంలో సరి, బేసి విధానంలో దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని మహానగర పాలక సంస్థ (జిహెచ్‌ఎంసి) నిర్ణయించింది. అయితే ఆహారపదార్థాలు విక్రయించే, బేకరీలు, తినుబండారాలు, టిపొడి వంటి దుకాణాల విషయంతో క్షేత్ర స్థాయి సిబ్బంది అవగాహన లేకపోవడంతో సరి-,బేసి నెంబర్లు కేటాయిస్తున్నారు. దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో జిహెచ్‌ఎంసి అధికారులు పర్యటించారు. దుకాణాలు తెరిచేందుకు అధికారులు అనుమతులు ఇస్తున్నారు. సరి, బేసి విధానం పాటించకపోతే దుకాణాలు మూసివేస్తామని జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ హెచ్చరించారు. ప్రతి దుకాణం వద్ద భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దుకాణదారులు తప్పనిసరిగా మాస్కులు ధరిండంతో పాటు శానిటైజర్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. మాస్కులు లేకుండా వచ్చే వినియోగదారులకు సరుకులు ఇవ్వొద్దన్నారు. మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. షాపులకు క్రమ పద్ధతిలో తెరిచేందుకు నెంబర్లు కేటాయించాలని జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. షాపుల నిర్వహణను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. పక్కపక్కన ఉన్న షాపుల మధ్య ఏదైనా సమస్య ఏర్పడితే లాక్‌డౌన్ పూర్తి అయ్యేంత వరకు మూసివేయాలని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువులను విక్రయించే షాపులతో పాటు మెడికల్, నిత్యావసర సరుకులు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్ల విక్రయాల షాపులు యథావిధిగా నడుస్తాయని తెలిపారు. వాటితో పాటు నిర్మాణ సామాగ్రిని విక్రయించే షాపులను తెరించేందుకు అనుమతులు ఉన్నాయని చెప్పారు. మాల్స్, రెస్టారెంట్లు, పబ్‌లు, బార్లు, సినిమా హాళ్లకు అనుమతులు ఇవ్వనందున వాటిని తెరవొద్దన్నారు. అయితే రెస్టారెంట్ల నుంచి ఆహారపదార్థాల టేక్‌అవేకు అనుమతి ఉందన్నారు. ఇక కంటైన్‌మెంట్ జోన్‌లలో అన్ని షాపులను పూర్తిగా మూసివేస్తామన్నారు. ఈ సందర్భంగా మలక్‌పేట్ సర్కిల్‌లో షాపులను తెరిచేందుకు చేస్తున్న మార్కింగ్‌లను కమిషనర్ తనిఖీ చేశారు. అయితే షాపుల నిర్వహణలో ఈ క్రింది నియమాలను అమలు చేయాలని షాపుల యజమానులకు, వినియోగదారులకు సూచించారు.
షాపుల యజమానులు పాటించాల్సిన నిబంధనలు…
షాపులలో పనిచేస్తున్న వ్యక్తులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
కొనుగోలుదారులు కూడా మాస్కులు ధరించి షాపులకు వెళ్లాలి.
నోమాస్కు, నో గూడ్స్, నో సర్వీస్ నిబంధనను కచ్చితంగా పాటించాలి.
మాస్కు నిబంధనను అతిక్రమిస్తే రూ.1000 అపరాధ రుసుం విధిస్తాం.
నాలుగు అడుగుల భౌతిక దూరం అమలుకు ఫుట్ మార్కింగ్ చేయాలి.
ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ వద్ద హ్యాండ్ శానిటైజర్ సదుపాయం ఏర్పాటు చేయాలి.
ఎలివేటర్ బటన్స్, డోర్ హ్యాండిల్స్‌కు రెడ్ కలర్ ఇండికేటర్స్‌ను సూచించాలి.
వీలైన చోట ఆటోమెటిక్ డోర్స్ ఏర్పాటు చేయాలి.
ఈ నెల 31వ తేదీ వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని కమిషనర్ లోకేష్ కుమార్ స్పష్టం చేశారు.
ఆహార పదార్ధాల విక్రయాలపై స్పష్టత కరువు…
దుకాణాలకు అనుమతులు ఇచ్చే విషయంలో కొన్ని చోట్ల నిత్యావసర సరుకులు విక్రయించే షాపులకు కూడా సరి-బేసి విధానం పాటించాలని జిహెచ్‌ఎంసి సిబ్బంది నెంబర్లు కేటాయించడంతో యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహారపదార్థాలు విక్రయించే బేకరీలు, టిఫిన్ సెంటర్లు, తినుబండారాలు విక్రయించే వారికి కూడా సరి-బేసి విధానం పాటించాలని అధికారులు అదేశించారు. టెక్-అవే విధానం ద్వారా ఆహారపదార్థాలు విక్రయిస్తామని, బేకరీలు, తినుబండారాలకు సంబంధించి రోజు విడించి రోజు తెరవాలనే నిబంధనలు విధిస్తే నష్టపోతామని వ్యాపారులు వాపోతున్నారు. నిత్యావసరాల పరిధిలోకి వచ్చే టి పొడి వంటి షాపులకు కొన్ని చోట్ల అధికారులు సరి-,బేసి విధానంలో దుకాణాలు నిర్వహించుకోవాలని నెంబర్లు కేటాయించడంతో దుకాణదారులు అవాక్కయ్యారు. ఆహారపదార్థాలు, నిత్యావసర సరుకులు విక్రయించే షాపుల అనుమతుల విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వాలని దుకాణదారులు కోరుతున్నారు.