చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కేంద్రం యత్నం
ఎఫ్‌ఐఆర్ నుంచి హిమంత పేరును విరమించుకుంటామని మిజోరాం ప్రకటన
గువాహటి: మిజోరాంతో సరిహద్దు ఘర్షణ పరిష్కారానికి తాము సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు అసోం సిఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. కాగా చర్చల ద్వా రా సమస్య పరిష్కారానికి కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్ నుంచి హిమంత పేరును విరమించుకుంటామని మిజోరాం పేర్కొంది. కాగా, ఈశాన్య భారత రాష్ట్రాలైన అసోం, మిజోరాం మధ్య గత కొన్నిరోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దు ఘర్షణల్లో ఏడుగురు మరణించగా, 50కిపైగా మంది గాయాలపాలయ్యారని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వెంబడి ఇలాంటి సంఘటనలు అంగీకారయోగ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల మధ్య చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మిజోరాంతో సరిహద్దు ఘర్షణ విషయంలో తాము సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ వెల్లడించారు. కొన్నిరోజుల కింద సరిహద్దుల్లో జరిగిన హింసపై హిమంత బిశ్వ శర్మ, అసోం అధికారులపై మిజోరాంలో ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. దీనిపై ‘సమస్యకు పరిష్కారం’ దొరుకుతుందంటే ఎఫ్‌ఐఆర్ విషయంలో మిజోరాంకు సహకారం అందిస్తానని హిమంత స్పష్టంచేశారు. అయితే తన ప్రభుత్వ అధికారులపై మాత్రం దర్యాప్తుకు అంగీకరించబోనని ఆయన పేర్కొన్నారు. ఇక ఈశాన్య భారత స్ఫూర్తిని సజీవంగా ఉంచడంపైనే తమ దృష్టి అంతా అని ఆయన అన్నారు. మిజోరాం ముఖ్యమంత్రి జోరాంతాంగతో టెలిఫోన్‌లో సంభాషించిన అనంతరం హిమంత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇలా ఉంటే అర్థవంతమైన చర్చల ద్వారా శాంతియుతంగా సరిహద్దు సమస్యను పరిష్కరించుకునే దిశగా హిమంత బిశ్వ శర్మ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తాను ఏకీభవిస్తున్నట్లు జోరాంతాంగ స్పష్టంచేశారు. అయితే పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయని మిజోరాం ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా హిమంతపై ఎఫ్‌ఐఆర్‌ను వెనక్కి తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు మిజోరాం ప్రధాన కార్యదర్శి లాల్‌నున్మావియా చువాంగో పేర్కొన్నారు. కాగా అసోంలోని కచార్, మిజోరాంలోని కొలాసిబ్ సరిహద్దును సందర్శించే సమయంలో రెండు రాష్ట్రాల అధికారులు, బలగాలు ఆయుధాలు వెంట తీసుకువెళ్లకూడదని కేంద్రం స్పష్టంచేసింది. ఇదిలా ఉంటే గత సోమవారం రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఘర్షణల్లో అసోంకు చెందిన ఆరుగురు పోలీస్‌లతో సహా ఏడుగురు మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు. కాగా హింసాకాండపై అధికారులపై జారీచేసిన సమన్లను గౌరవించడానికి రెండు రాష్ట్రాలు నిరాకరించాయి. మిజోరాం అయితే ఓ అడుగు ముందుకువేసి ‘హత్యాయత్నం’ అభియోగం మోపి హిమంత బిశ్వ శర్మ పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. కాగా ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దులను స్పష్టంగా గుర్తించడానికి ఉపగ్రహ చిత్రాల సాయం తీసుకోవాలని కేంద్రం నిర్ణయించుకుందని సమాచారం. దీనికోసం షిల్లాంగ్ కేంద్రంగా పనిచేసే ఈశాన్య రాష్ట్రాల అంతరిక్ష అనువర్తిత కేంద్రానికి (ఎన్‌ఇఎస్‌ఎసి) బాధ్యతలు అప్పగించినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే నిత్యావసర సరకుల ట్రక్కులు సహా వాహనాల రాకపోకలపై పరిమితులు ఆదివారమూ కొనసాగాయి. దీంతో అసోం మిజోరాం సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం స్పష్టంగా కనిపిస్తోందని అధికారులు తెలిపారు. కాగా, జాతీయ రహదారి 306 వెంబడి కేంద్ర బలగాల నిఘా ఉండటంతో అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతం ప్రస్తుతం ప్రశాంతంగానే ఉందని పేర్కొన్నారు. అయితే వ్యవస్థాగత నిర్బంధం కొనసాగడం లేదని, బాధిత ప్రజలు వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారని ఓ అధికారి తెలిపారు. దీంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో పదులకొద్ది వాహనాలు నిలిచిపోయాయి.
సరిహద్దు ఘర్షణపై సుప్రీంకోర్టుకు అసోం
RELATED ARTICLES