గాంధీ సత్యాగ్రహం వలే శాంతియుతంగా చేశారు
ట్రిపుల్ ఐటి విద్యార్థులపై మంత్రి కెటిఆర్ ప్రశంసలు
ట్రిపుల్ ఐటిలో రూ.3 కోట్లతో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తాం
వెయ్యి కంప్యూటర్లతో డిజిటల్ ల్యాబ్ ప్రారంభిస్తాం
ప్రజాపక్షం/ నిర్మల్ ప్రతినిధి “డిమాండ్లు పరిష్కరించాలని బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు చేసిన ఆందోళనలను పత్రికలు, టీవీ ల్లో చూశాను. రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా మీ అంతట మీరే ఆందోళన చేశారు. సమ్మె కోసం విద్యార్థులు ఎంచుకున్న పద్ధతి నచ్చింది. గాంధీ సత్యాగ్రహం ఎలా చేశారో.. అలానే విద్యార్థులు శాంతియుతంగా సమ్మె చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే సమ్మె చేస్తున్నామని స్పష్టంగా చెప్పారు. ప్రజాస్వామికంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉం టుంది” అని రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రులు కె.తారకరామారావు, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సోమవారం నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటిని సందర్శించారు. ట్రిపుల్ ఐటి విద్యార్థులతో కలిసి భోజనం చేసి, అనంతరం వారితో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంతృప్తికర స్థాయి లో సౌకర్యాలు, వసతులు కల్పించాలని విద్యార్థు లు కోరారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ట్రిపుల్ ఐటిలో రూ.3 కోట్లతో మినీ స్టేడియంను ఎనిమిది నెలల్లో ఏర్పాటు చేస్తామని అన్నారు. రెండు నెలల తర్వాత మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఇక్కడికి తీసుకొస్తామని, నవంబర్‌లో అందరికీ ల్యాప్ టాప్‌లు ఇస్తామని అని మంత్రి కెటిఆర్ చెప్పారు. ‘ఐటి, విద్యాశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాం. వెయ్యి కంప్యూటర్లతో డిజిటల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. వర్సిటీలో మినీ టీ హబ్ ఏర్పాటు చేస్తాం. అదనంగా 50 తరగతి గదులు ఆధునీకరిస్తాం. ఈ సంస్థ మీదే. మీరే కాపాడుకోవాలి. క్యాంపస్‌లో పరిశుభ్రత పాటించడంలో విద్యార్థులకు బాధ్యత ఉంటుంది’ అని కెటిఆర్ అన్నారు. తెలంగాణలో ప్రతిభగల ప్రతీ విద్యార్థి కష్టపడి ఉన్నత చదువులు చదివాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, పదిమందికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని అన్నారు. ట్రిపుల్ ఐటిలో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులు ఇన్నోవేటివ్‌గా ఆలోచించి కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలన్నారు.
శ్రమదానం చేయండి
“అతి తక్కువ జనాభా ఉన్న అమెరికా నుంచి ఆకర్షించే ఉత్పత్తులు వస్తున్నాయి. అత్యంత జనాభా ఉన్న మన దేశం నుంచి ఉత్పత్తులు ఎందుకు రావడం లేదు? ఉద్యోగం చేయడం కాదు.. ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఉండాలి. ఇన్నోవేషన్ అంటే ఎవరికీ అర్థం కాని బ్రహ్మపదార్థం కాదు. విద్యార్థుల నుంచే కొత్త ఆవిష్కరణలు రావాలి. ప్రతి సంవత్సరం ఇన్నోవేషన్ వారోత్సవాలు ఇక్కడ జరగాలి. ఉత్పత్తిలో సత్తా ఉంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది’ అని మంత్రి కెటిఆర్ అన్నారు. పది వేల మంది విద్యార్థులకు, వంద మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని, వారు కూడా మనుషులే కదా అలాంటప్పుడు ప్రతీ విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్‌ని పక్కనపెట్టి స్వచ్ఛందంగా శ్రమదానం చేస్తే ట్రిపుల్ ఐటిలో సమస్యలే ఉండవన్నారు. వంట్లో భయం ఉంటే ఒక్క విద్యార్థి కూడా చెత్తను పాడేయరని, తన సొంత ఇళ్లులాగా చూసుకోవాలన్నారు. తన కుటుంబ సభ్యులతో అమెరికా వెళ్లినప్పుడు, పోయినప్పుడు తన కూతురు కూడా అమెరికాలో ఇలాగా చెత్త పడేస్తే ఫైన్ కట్టాల్సి ఉంటుందని బోర్డును కూడా చూపించానన్నారు. ట్రిపుల్ ఐటిలో చెత్త పడేసిన వారికి జరిమానా వేసే ఓ నిబంధన తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎంఎల్‌ఎ విఠల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, వైస్ ఛాన్స్‌లర్ వెంకటరమణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.
‘సమ్మె’ విధానం భేష్
RELATED ARTICLES