ఇందిరాపార్కు వద్ద ధర్నాలో ఉద్యోగుల ప్రతిన
ప్రజాపక్షం/హైదరాబాద్: ఆంధ్రాబ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగులు ముక్తకంఠంతో ఖండించారు. ఆంధ్రాబ్యాంకును రక్షించుకుంటామని వారు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఆల్ ఇండియా ఆంధ్రాబ్యాంక్ అవార్డ్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో గురువారం రోజంతా ఇందిరా పార్కు వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. ఎఐ బిఇఎ జనరల్ సెక్రటరీ బిఎస్. రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో ఎఐటియూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్, ఎఐఎబిఎయు ఫౌండర్ జనరల్ సెక్రటరీ బిఎస్‌ఆర్ మోహన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమద్ ఖాన్‌తో పాటు బ్యాంకు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఎస్ బోస్ మాట్లాడుతూ దేశంలో కోట్లాది మంది ప్రజానీకం వారి కష్టార్జిత డబ్బులు బ్యాంకుల్లో దాచుకుంటే.. కార్పొరేట్ రంగానికి ఊడిగం చేసేందుకు పాలకులు కంకణం కట్టుకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్యాంకింగ్ రంగాన్ని నిర్వీర్యం చేయడంలో కాంగ్రెస్ పార్టీ తొలి ముద్దాయి కాగా, ఇప్పుడు మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం రెండో ముద్దాయి అన్నారు. డీ మానిటైజేషన్ పేరుతో 50 రోజుల పాటు నోట్లు కంటికి కనిపించకండా చేశారని, ఆఖరికి ఆర్‌బిఐలో సైతం డబ్బులు లేకుండా చేశారన్నారు. సామాన్య, పేద ప్రజానీకం ఎన్నడూ ఒక్క రూపాయి కూడా బ్యాంకులకు ఎగ్గొట్టలేదని, అదే లగడపాటి రాజగోపాల్, సుజనా చౌదరి, కావూరి సాంబశివరావు లాంటి పెద్ద మనుషులు కోట్లాది రూపాయల బ్యాంకు డబ్బులు ఎగవేశారని ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. నష్టాల నెపం చెప్పి 196 గ్రామీణ బ్యాంకులను విలీనం చేయడం దుర్మార్గం అన్నారు. అనంతరం బిఎస్ రాంబాబు మాట్లాడుతూ 1951 నుండి కూడా ఎస్‌బిఐ ఒక్కరోజు నష్టాల్లో లేదని, కానీ నరేంద్ర మోడీ పాలనలో బ్యాంకుల విలీనం పేరుతో బాగా నడుస్తున్న ఎస్‌బిహెచ్ లాంటి వాటిని విలీనం చేసుకున్నారన్నారు. మహాత్మాగాంధీ పిలుపుమేరకు స్వాతంత్య్ర స్ఫూర్తితో తెలుగు ప్రజల కోసం భోగరాజు పట్టాభి సీతారామయ్య స్థాపించిన ఆంధ్రాబ్యాంకు 96 సంవత్సరాలుగా అంచలంచెలుగా ఎదిగి దేశవ్యాప్తంగా 3 వేల శాఖలతో రూ. 4 లక్షల కోట్ల వ్యాపారంతో అన్ని ఆర్థిక అంశాలలో మెరుగైన సామార్యాన్ని కనబర్చిందని, దేశంలోని అన్ని బ్యాంకుల కంటే కూడా వినియోగదారులకు సేవలందించడంలో ఆంధ్రాబ్యాంకు ముందుందన్నారు. ఇలాంటి బ్యాంకును కూడా విలీనం చేయడం దుర్మార్గం అని అన్నారు.