కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మెకు సిద్ధమవుతున్న ఆర్డినెన్స్ ఉద్యోగులు
ఆగస్టు 20న పార్లమెంటు ముందు ఉపవాస దీక్ష
ప్రజాపక్షం / హైదరాబాద్ : దేశంలోని 41 ఆర్డినెన్స్ ప్యాక్టరీలను కార్పోరేషన్స్‌గా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మూడు లక్షల మంది ఆర్డినెన్స్ సిబ్బంది నిరవధిక సమ్మెకు సమాయత్తమవుతున్నా రు. ఆగస్టు 20న పార్లమెంటు ముందు రక్షణశాఖలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, ఫెడరేషన్స్, నాయకులు ఒక రోజు ఉపవాస దీక్ష చేయాలని నిర్ణయించినట్లు ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. చంద్రయ్య తెలిపారు. ప్రభుత్వం నుండి సానుకూలత రాకుంటే నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఎన్‌డిఎ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక రక్షణ శాఖలో 100 శాతం ఎఫ్‌డిఐని ఆహ్వానిస్తూ 200 ప్రైవేటు కంపెనీలకు డిఫెన్స్ పరికరాల తయారీకి లైసెన్స్ ఇవ్వటం, 220 రకాల పరికరాల తయారీకి ప్రైవేటు కంపెనీలకు ఇవ్వజూపిన నిర్ణయాన్ని ఉపసంహరించాలని అన్ని సంఘాలు సంయుక్తంగా పోరాటం చేస్తున్నాయన్నారు. రక్షణ శాఖతో పాటు అన్ని కీలక రంగాలను పూర్తిగా ప్రైవేటు వారికి అప్పజెప్పాలని ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రకటించాక, 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ను కార్పోరేషన్స్‌గా మార్చేందుకు ప్రధాని కార్యాల యం నుండి వెంటనే ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. గతంలో టెలిఫోన్స్‌ను బిఎస్‌ఎన్‌ఎల్‌గా మార్చి ఇప్పుడు ప్రైవేటు వారికి అప్పచెబుతున్నారని ఆరోపించారు. 208 ఏళ్ళ చరిత్ర కలిగిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు దేశంలోని ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులకు అన్ని రకాల నాణ్యమైన పరికరాలను అందిస్తున్నాయన్నారు. ఈ ఫ్యాక్టరీల్లో కొన్ని లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో లక్షల ఎకరాల భూములు వేల కోట్ల రూపాయల విలువ గల మౌలిక వసతులు కలిగి ఉన్నాయన్నారు. ఆర్మి,నేవి, ఎయిర్‌ఫోర్స్‌కు మం దులు, బట్టలు, పాలు, షూతో పాటు యుద్ధ పరికరాలు అన్ని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు సమకూర్చుతున్నాయని తెలిపారు. అలాంటి ఫ్యాక్టరీలను కార్పోరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న సుమారు 3 లక్షల మంది సిబ్బంది బజారున పడనున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్గిల్ యుద్ధ సమయంలో యూనిఫాం, షూలు, ప్రైవేట్‌కు ఆర్డర్ ఇచ్చి ఆర్మికి సరఫరా చేస్తే సైజ్‌లు రాక, క్వాలిటీ లేక తిరస్కరించారని, అప్పుడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కార్మికులు రాత్రింబవళ్ళు పనిచేసి నాణ్యమైన యూనిఫారం, షూలు రెండు రోజుల్లోనే అందించిన చరిత్ర ఉందన్నారు. అయినప్పటికీ ప్రైవేటు యాజమాన్యాలకు అతి కారుచౌకగా ఆర్డినెన్స్ ప్యాక్టరీలను, వాటిలో ఉన్న లక్షలాది ఎకరాల భూములను కట్టబెట్టి ముడుపులు ఆందుకోవాలన్న దుర్మార్గపు నిర్ణయాన్ని యావత్ భారత ప్రజలు ఖండించాలని బి.చంద్రయ్య పిలుపునిచ్చారు. ఇది దేశ రక్షణకు సంబంధించిన అంశమని, రక్షణ శాఖ ఉద్యోగుల పోరాటాన్ని 130 కోట్ల భారత ప్రజలు బలపర్చాలని విజ్ఞప్తి చేశారు.