బంద్‌కు సంఘీభావంగా ర్యాలీలు
ప్రజాపక్షం / హైదరాబాద్ రైతులు తలపెట్టిన ‘భారత్ బంద్’కు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు సమాయత్తమయ్యాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాల ని, కనీస మద్దతు ధరల చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 8న దేశవ్యాప్తంగా జరిగే భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని కోరాయి. బంద్‌కు సంఘీభావంగా సోమవారం ర్యాలీలు నిర్వహించారు. కాగా, రైతులను బానిసలుగా చేసే నూతన వ్యవసాయ చట్టాలను మోడీ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని సిపిఐ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 8న జరిగే భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్ నుండి సిపిఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో చాడ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. హిమాయత్ నగర్ నుండి లిబర్టీ, బషీర్‌బాగ్, గన్‌ఫౌండ్రి, అబిడ్స్, తూరూప్ బజార్, కోఠి, సుల్తాన్ బజార్, కాచిగూడ, నారాయణ గూడ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా చాడ వెంకట్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రధాని మోడీ నిరంకుశ పాలనా కొనసాగిస్తూ రైతు, ప్రజా వ్యతరేక నల్ల చట్టాలను తీసుకురావడం బడా కార్పొరేట్లకు వ్యవసాయం కట్టబెట్టడం కోసమేనని విమర్శించారు. రైతులు, సాధారణ ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పెంచే విద్యుత్ సవరణ బిల్లును కేంద్రం తీసుకురావడం దుర్మార్గమన్నారు. గత పది రోజులుగా ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో ఉద్యమం చేస్తున్న రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం తీరు అమానుషం అని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 8న జరిగే భారత్ బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని అయన కోరారు. ప్రజా వ్యతరేక చట్టాలను రద్దు చేసే వరకు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని చాడ వెంకట్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఇటి నరసింహ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను విడనాడి రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. వ్యవసాయంలోకి ప్రైవేటు రంగం అడుగుపెట్టేందుకు ఈ చట్టాలు వీలు కల్పిస్తున్నాయని, దీంతో రైతులకు రక్షణ లేకుండా పోతుందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఉద్యమం లక్ష్యాలు నెరవేరే వరకు పోరాటాలు బలోపేతం చేసి కొనసాగిస్తామని, 8న జరిగే భారత్ బంద్‌లో ప్రజలు ప్రతిఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఇటి నరసింహ విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీలో సిపిఐ రాష్ర్ట సమితి సభ్యురాలు బి. ఛాయాదేవి, హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.ఏ. మన్నన్, టి. రాకేష్ సింగ్, సిపిఐ నగర నేతలు ఎండి సలీం ఖాన్, ఆర్. మల్లేశ్, ఎ.ఐ.ఎస్.ఎఫ్ రాష్ర్ట నాయకులూ బి. స్టాలిన్, ఆర్.ఎన్. శంకర్, కె.శ్రీనివాస్, ఏ.ఐ.వై.ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్. బాలకృష్ణ, ఏ.ఐ.ఎస్.ఎఫ్ నగర నేతలు హరికృష్ణ, హరీష్ ఆజాద్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసంఘాల ర్యాలీ
ఇదిలా ఉండగా, ప్రజాసంఘాలు, ఎఐకెఎస్‌సిసి సంయుక్తంగా బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి నారాయణగూడ మీదుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్పొరేట్ అనుకూల చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, మోడీ నిరంకుశ వైఖరి విడనాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎఐకెఎస్‌సిసి కన్వీనర్లు పశ్యపద్మ, టి.సాగర్, కెచ్చల రంగయ్య, అచ్చుత రామారావులు మాట్లాడుతూ ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనకు రోజు రోజుకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతుందన్నారు. డిసెంబర్ 8న జరిగే భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు.మహిళా, యువజన, విద్యార్థి, సామాజిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయని, వారందరికీ రైతుల సంఘాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బోస్, సిఐటియు రాష్ర్ట కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐహెచ్‌యంఎస్ అధ్యక్షులు రియాజ్ ఆహ్మద్, ఐఎఫ్‌టియు నాయకులు ఎస్‌ఎల్ పద్మ, హాన్మేష్, అనూరాధ, తదితరులు పాల్గొన్నారు.
సమాయత్తం
RELATED ARTICLES