ఐసిఐసిఐ కేసు దర్యాప్తు అధికారి ఆకస్మిక బదిలీ
న్యూఢిల్లీ : ఐసిఐసిఐ బ్యాంకు కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారిని సిబిఐ బదిలీ చేసింది. ఎంతో రహస్యంగా జరుపుతున్న సోదాలకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కుతుండడంలో తన పాత్ర ఉందని ఆరోపిస్తూ సిబిఐ అతన్ని బదిలీ చేసినట్లు ఆదివారం అధికారులు తెలిపారు. ఈ కేసులో ఐసిఐసిఐ మాజీ సిఇఒ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ఎండి వేణుగోపాల్ ధూత్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన మరుసటి రోజే ఎస్‌పి సుధాన్షు ధార్ మిశ్రాను రాంచికి బదిలీ చేయడం గమనార్హం. కేసును కొత్త దర్యాప్తు అధికారి మోహిత్ గుప్తాకు అప్పగించిన తరువాత సిబిఐ వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు చెప్పా రు. అయితే మిశ్రా బదిలీని సిబిఐ సమర్థించుకుంది. ఎలాంటి కారణం లేకుండా మిశ్రా ప్రాథమిక విచారణను వాయిదా వేశారని సిబి ఐ ఆరోపించింది. కాగా, ఈ కేసుపై సమీక్షించిన తరువాత ప్రాథమిక విచారణలో వేగం పెంచి ఆ తరువాత దీనిని రెగ్యులర్ కేసుగా మార్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన వెంటనే సోదాలు నిర్వహించాల్సిందిగా ప్రతిపాదించారన్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో ఈనెల 24న చందాకొచ్చర్ తదితరులపై సిబిఐ కేసు నమోదు చేసింది. చందా కొచ్చర్ అధ్యక్షతన గల కమిటీ వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్‌కు 2009లో రూ.300 కోట్లు, 2011లో రూ.750 కోట్లు రుణంగా మంజూరు చేసిందని, ఈ విషయంలో నిబంధనలు పాటించలేదని సిబిఐ పేర్కొంది. ఇచ్చిన రుణాల్లో చాలావరకు తిరిగి వసూలు కాకపోవడంతో బ్యాంకుకు రూ.1,730 కోట్లు నష్టం వచ్చినట్టు ఆరోపించింది. రుణాలు మంజూరుకు ప్రతిఫలంగా వీడియోకాన్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్…సూపర్ ఎనర్జీ పేరుతో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు చెందిన నూపవర్ కంపెనీలో రూ.64 కోట్లు పెట్టుబడి పెట్టారని తెలిపింది. ఈ పెట్టుబడి అవినీతి కిందికే వస్తుందని ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది.