ఆర్థిక వృద్ధిని పెంచేందుకు కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేయాలి
నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: పురాతన చట్టాలను రద్దు చేసి భారత్ సులభంగా వ్యాపారం చేసేందుకు దృఢమైన విధానాన్ని తీసుకువచ్చామని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధిని పెంచేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. శనివారం జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి ఆరవ సమావేశంలో ప్రధాని పాల్గొని మాట్లాడారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంలో భాగమయ్యేందుకు ప్రైవేట్ రం గానికి పూర్తి అవకాశాలు కల్పించాలన్నారు. కరో నా మహమ్మారి సమయంలో కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేయడం వల్ల యావత్ దేశ్ విజయం సాధించిందని వ్యాఖ్యానిస్తూ.. దేశ పురోగతికి ఆధారం సహకార సమాఖ్య విధానమన్నారు. ఈ పోటీతత్వ సహకార ససమైక్య విధానాన్ని మరింత అర్థవంతంగా మార్చచడమే భారతావని అభివృద్ధికి పునాది అని అన్నారు. పోటీతత్వ సహకార సమైక్య విధానాన్ని రాష్ట్రాలకే పరిమితం చేయకుండా జిల్లాలకు కూడా విస్తరించాలని మోడీ పిలుపునిచ్చారు. అదే విధంగా భారాలను తగ్గిస్తూ వాడుకలో లేని చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి నేపథ్యంలో ఇకపై సంబంధంలేని నిబంధనలను తగ్గించడానికి కమిటీలు వేయాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన 2021 బడ్జెట్‌పై అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చిందని, సమయాన్ని వృథా చేయకుండా వేగంగా అభివృద్ధి సాధించాలని దేశం నిశ్చయించుకుందని చెప్పారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో ప్రైవేట్ రంగం మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తుందని మోడీ పేర్కొన్నారు. ప్రైవేట్ రంగానికి ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తుందని, అత్మనిర్భర్ భారత్‌లో భాగమయ్యేందుకు ఈ రంగానికి మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ప్రచారం గురించి మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి చేసే మార్గంలో సొంత అవసరాలకే కాకుండా ప్రపంచ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఉత్పత్తులు చేయాలని చెప్పారు. వ్యవసాయరంగం గురించి ప్రస్తావిస్తూ వంటనూనె వంటి వ్యవసాయ పదార్ధాలను ఉత్పత్తి చేసేందుకు, వాటికి దిగుమతిని తగ్గించేందుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విధంగా చేయడం వల్ల వంటనూనె దిగుమతి కోసం వెచ్చిస్తున్న రూ. 65 వేల కోట్లు తమ రైతల ఖాతాల్లోకి వెళ్తాయని ప్రధాని చెప్పారు. ఈ దిశగా రైతులకు మార్గనిర్దేశం చేయాలన్నారు. గత కొన్నేళ్లలో బ్యాంకు ఖాతాలు తెరవడం పెరిగిందని వివరిస్తూ.. ఉచిత విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు పేదల జీవితాల్లో గణనీయ మార్పులు తీసుకొచ్చాయన్నారు. పేదలు సాధికారత సాధించేందుకు ఈ చర్యలు ఉపయోగపడ్డాయని తెలిపారు. స్టార్టప్స్, ఎంఎస్‌ఎంఇలను మరింత బలోపేతం చేయాలని ఉద్ఘాటిస్తూ.. ఆత్మనిర్భర్ భారత్ కేవలం దేశ స్వాలంబన కోసమే కాదని, ప్రపంచ అసవరాల కోసం కూడా అని అన్నారు. 75వ భారత స్వాతంత్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి కమిటీలు వేయాలని రాష్ట్రాలను ప్రధాని కోరారు. 2014 నుంచి పేదల కోసం నగరాలు, గ్రామాల్లో ఒకేసారి 2.40 లక్షలపైగా ఇళ్లను నిర్మించామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ కింద 18 నెలల్లో 3.5 లక్షల గ్రామీణ ఇళ్లకు పైపుల ద్వారా తాగునీటి సౌకర్యాన్ని కల్పించామన్నారు. కాగా, 15వ ఆర్థిక కమిషన్‌లో స్థానిక సంస్థలకు ఆర్థిక వనరుల పెరుగుదల భారీగా ఉంటుందని మోడీ ప్రకటించారు. ఇదిలా ఉండగా, నీతి ఆయోగ్ పాలకమండలిలో అందరు ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, అనేక మంది కేంద్రమంత్రులు, సీనియర్ ప్రభుత్వం అధికారులు ఉంటారు. మొదటిసారిగా ఆరవ పాలకమండలి సమావేశంలో లడఖ్, జమ్ముకశ్మీర్ కూడా పాల్గొన్నాయి.
సమాఖ్య విధానమే దేశాభివృద్ధికి మూలం
RELATED ARTICLES