సంయుక్త కిసాన్ మోర్చా లేఖ
న్యూఢిల్లీ: వివాదాస్పద చట్టాల మీద ఇతర రైతు సంఘాలతో “సమాంతర చర్చలు” నిలిపివేయాలని 40 రైతు సంఘాల సంయుక్త సంస్థ బుధవారం కేంద్రానికి లేఖ రాసింది. వివిధ రాష్ట్రాలకు చెందిన కొన్ని రైతు సంఘాలు కొత్త రైతు చట్టాలకు మద్దతు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపిన నేపథ్యంలో “సంయుక్త కిసాన్ మోర్చా” ప్రభుత్వానికి లేఖ రాసింది. సంయుక్త కిసాన్ మోర్చాలో పంజాబ్‌కు చెందిన సంఘాలు ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న నిరసనలను తక్కువ చేసి చూపొద్దని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్‌కు మోర్చా తెలిపింది. “రైతుల ఆందోళనను తక్కువ చేసి చూపడాన్ని, ఇతర రైతు సంఘాలతో సమాంతర చర్చలు నిర్వహించడాన్నిఆపివేయాలని మేం ప్రభుత్వాన్ని కోరుతున్నాం” అని సంయుక్త కిసాన్ మోర్చాకు చెందిన దర్శన్ పాల్ అనే రైతు హిందీలో రాసిన తన లేఖలో పేర్కొన్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌కు చెందిన భారతీయ కిసాన్ యూనియన్ (కిసాన్) ప్రతినిధులు మంగళవారం వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కలిశారు. చట్టాలకు కొన్ని సవరణలు, కనీస మద్దతు ధర గురించి ఒక మెమొరాండం సమర్పించారు. ఉత్తరప్రదేశ్‌లో జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న తమ ఆందోళనను ప్రస్తుతానికి విరమిస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. అయితే ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు జరుపుతున్న 40 రైతు సంఘాలలో ఇది భాగం కాదు. రైతు సంఘాలకు, ప్రభుత్వానికి జరిగిన చర్చల్లో మాత్రం పాల్గొన్నది.
సహృదయుల సహకారం
సాగు చట్టాలకు వ్యతిరేకంగా మూడు వారాలుగా వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు దగ్గర ఆందోళన చేపట్టారు. రైతులకు కనీస సౌకర్యాలకు లోటు లేకుండా చూసేందుకు కొంతమంది దాతలు, గురుద్వారా కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు సాంకేతిక వనరులను సమకూర్చారు. గంటకు 1,200 వరకు చపాతీలు చేసే యంత్రాలు, వాషింగ్ మెషిన్లు, ఫోన్లు ఛార్జింగ్ చేసుకునేందుకు ట్రాక్టర్ ట్రాలీల్లో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. అలా నిరసనకారులు మకాం వేసిన జాతీయ రహదారి ఒక టౌన్‌షిప్‌ను తలపిస్తోంది. ఆటోమేటిక్‌గా పనిచేసే చపాతీ తయారీ యంత్రాల కారణంగా రైతులకు మధ్యరాత్రి వరకు సమయానికి భోజనం అందుతోంది. రైతులు బట్టలు ఉతుక్కునేందుకు అవసరమైన వాషింగ్ మెషిన్లను కూడా నిరసన స్థలానికి చేర్చారు. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఖాల్సా ఎయిడ్ సింఘు సరిహద్దుల్లో ఉన్న నిరసనకారులకు పాదాలు మసాజ్ చేసేందుకు మసాజర్లు, గీజర్లను ఏర్పాటుచేసింది.
తోమర్ వక్రభాష్యాలు
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న నిరసనలు ఒక “మినహాయింపు”, అవి “ఒక్క రాష్ట్రానికే పరిమితం” అని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. రైతు సంఘాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది కనుక తొందరగానే పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో ఇటీవలి సంస్కరణల కారణంగా దేశంలో ఒక రకమైన ఉత్సాహకరమైన వాతావరణం కనిపిస్తోందని తోమర్ అన్నారు. పారిశ్రామిక సంస్థ అసోచామ్ ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ పక్క నిరసన జరుగుతుండగానే, మరోవైపు లక్షల మంది రైతులు చట్టాలకు మద్దతు ఇస్తున్నారని ఆయన వెల్లడించారు.
సమాంతర చర్చలు నిలిపివేయాలి
RELATED ARTICLES