సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల
అన్నపురెడ్డిపల్లి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బంది
బెడ్లు లేక కిందనే పడుకుంటున్న వైనం
ప్రజాపక్షం/ఖమ్మం తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను, ఆహార పదార్ధాలను అందించి గురుకుల వ్యవస్థకు పెద్దపీట వేస్తుంటే దానికి విరుద్దంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు మూడు గంటలకు భోజనం చేయాల్సిన పరిస్థితి ఇక్కడ
ఉంది. కరోనా మహమ్మారి తర్వాత విద్యాసంస్థలు ప్రారంభమైన సాంఘిక సంక్షేమ పాఠశాలలలో పిల్లలు విద్యను నేర్చుకునేందుకు ఎన్నో ఆశలతో తల్లితండ్రులు పంపిస్తుండే అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో మాత్రం సమస్యలు తాండవం చేస్తున్నాయి. విద్యార్థులు ఉండటానికి నూతన భవనం నిర్మించినప్పటికీ అది అసంపూర్తిగానే ఉండటంతో పాటు భవనానికి అద్దాలు సైతం పగిలిపోయాయి. విద్యార్థులకు బెడ్స్ నేటి వరకు అందించకపోవడంతో నేలపైనే పడుకుంటున్నారు. తగిన తాగు నీటి సదుపాయం లేదు. పాఠశాలలో కాంట్రాక్టర్ కొద్ది మందినే నియమించుకుని పాఠశాలలోని సిబ్బందితోనే కూరగాయలు కోయించడం, వంట పనులకు విద్యార్థులను ఉపయోగించుకుంటూ ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. అతను వంటలు ఎప్పుడు తయారు చేస్తే అప్పుడే తినాల్సిన దుస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థులతో వంట పనులు చేయిస్తుంటే పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రిన్సిపాల్ కాంట్రాక్టర్ల కనుసైగల్లో పనిచేస్తూ విద్యార్థులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. పాఠశాలలో పారిశుద్ధ్య సమస్య దుర్భరంగా ఉందని, దుర్వాసనలతో పాటు పందులు, గొడ్లు పాఠశాల ఆవరణలో తిరుగుతూ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా అక్కడ ఎవరూ ఎవరిని అడిగే పరిస్థితి లేదని, ఒక వేళ ప్రశ్నిస్తే అధికారుల ఆగ్రహానికి గురికాక తప్పడం లేదని విద్యార్ధులు అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలపై దృష్టి సారించి విద్యార్థులను సమస్యల వలయం నుంచి విముక్తి చేసి మెరుగైన విద్యను అభ్యసించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్ధులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
సమస్యల వలయం
RELATED ARTICLES