HomeNewsBreaking Newsసమస్యల పరిష్కారంలో ముందుంటాం

సమస్యల పరిష్కారంలో ముందుంటాం

గ్రామీణ, కులవృత్తులకు అనేక పథకాల అమలు తెలంగాణలోనే..
వికలాంగులైన గీత కార్మికులకు మెడికల్‌ బోర్డుతో ప్రమేయం లేకుండా ఎక్స్‌గ్రేషియా : ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌
తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం ద్వితీయ మహాసభలు షురూ
ప్రజాపక్షం / హైదరాబాద్‌
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని గ్రామీణ, కుల వృత్తులకు అనేక పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. తమ ప్రభు త్వం దృష్టికి ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించడంలో ముందుంటామని ఆయన స్పష్టం చేశారు. చెట్టు మీద నుండి పడి వికలాంగులైన గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా విషయంలో మెడికల్‌ బోర్డు ప్రమేయం లేకుండా ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ సర్టిఫికెట్‌తో మంజూరయ్యే విధంగా త్వరలో జిఒ తీసుకురానున్నామని, ఇప్పటికే అధికారులకు ఆ దిశగా ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. రైతుబంధు తరహాలో గీత కార్మికులు మరణించిన ఐదారు రోజుల్లోనే ఎక్స్‌ గ్రేషియా ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని చెప్పారు. గీత కార్మికులకు మోపెడ్లు ఇచ్చే హామీ కూడా అమలు చేస్తామని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం ద్వితీయ మహాసభ, సంఘం 65వ వార్షికోత్సవం హైదరాబాద్‌లోని పీర్జాదీగూడలో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా తొలుత తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో పీర్జాదిగూడలో ప్రదర్శన జరిగింది. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్‌ అధ్యక్షతన జరిగిన భారీసభకు ముఖ్య అతిథిగా ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌, విశిష్ట అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎంఎల్‌సి వి.గంగాధర్‌గౌడ్‌, తెలంగాణగౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్‌ గౌడ్‌, వృత్తి సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి టి.వెంకట్రాములు, మహాసభ ఆహ్వాన సంఘం చీఫ్‌ ప్యాట్రన్‌ పల్లా వెంకట్‌ రెడ్డి హాజరయ్యారు. సమావేశానికి గీత పనివారల సంఘం ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ కెవిఎల్‌ స్వాగతం పలుకగా, ప్రధాన కార్యదర్శి డి.జి.సాయిలు గౌడ్‌ వందన సమర్పణ చేశారు.
గీత కార్మికులకు రూ.1000 కోట్ల పెన్షన్‌
సభను ఉద్దేశించి మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రసంగిస్తూ ప్రత్యేకించి యాబై ఏళ్ళు నిండిన గీత కార్మికులకు ఇచ్చే పెన్షన్‌ రూ.2016 చొప్పున 65,213 మందికి ప్రతి నెలా పెన్షన్‌లు ఇస్తున్నామని, ఇప్పటివరకు పెన్షన్‌ల కిందనే రూ.1,268 కోట్లు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. అసరాలో పెన్షన్‌ పొందే గీత కార్మిక కుటుంబాలు ఇందుకు అదనమని చెప్పారు. కల్లు ప్రకృతి పానీయమని, దీని ద్వారా క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయని, కిడ్నీ జబ్బులు తగ్గుతాయని, పుష్కలమైన పోషకాలు ఇందులో ఉన్నాయని తెలిపారు. అందుకే గీత వృత్తిదారుల నాయకులు ధర్మభిక్షం కలలు కన్న నీరాను ప్రవేశపెడుతున్నామని, స్వయంగా ఆయన పేరును మూడు సార్లు అసెంబ్లీలో ప్రస్తావించి ఈ విషయాన్ని ప్రకటించానని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గుర్తు చేశారు. అంతే కాకుండా గౌడ కులస్తులు మాత్రమే నీరా సేకరించే విధంగా పాలసీ తీసుకువచ్చామని, చెట్టు పన్ను రద్దు చేశామని, చెట్టుపై నుండి పడిన గీత కార్మికులకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.5 లక్షలకు పెంచామని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా చేయలేదని స్పష్టం చేశారు. నందనంలో నీరా పరిశోధన కేంద్రానికి ధర్మభిక్షం పేరు పెట్టే ఆలోచనలో ఉన్నామన్నారు. ఎక్స్‌గ్రేషియా కింద ఇప్పటివరకు రూ.46.75 కోట్లు ఇచ్చామని, కొన్ని పెండింగ్‌లో ఉన్నా వాటిని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గీత వృత్తిదారులపై కేసులే లేవని చెప్పారు. బహుజన కులాలలో ఆత్మగౌరవాన్ని నింపిన సర్దార్‌ సర్వాయి పాపన్న మహారాజ్‌ జయంతి, వర్థంతులను అధికారికంగా నిర్వహిస్తున్నామని, ట్యాంక్‌ బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. వైన్‌ షాపుల్లో గౌడ కులస్తులకు కల్పించిన 15 శాతం రిజర్వేషన్‌ను సొసైటీలకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సిఎం కెసిఆర్‌ ఎప్పుడు కూడా గ్రామీణ వృత్తులను పైకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, వాటికి సంబంధించి ఏ సమస్య చెప్పినా పరిష్కరిస్తారని చెప్పారు. గతంలో సొసైటీలకు వన పెంపకానికి భూమి ఇచ్చేవారని, కానీ తమ ప్రభుత్వంలో ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉన్నా కూడా తాటి, ఈత చెట్లను హరిత హారం కింద నాటుతున్నామని, ఇప్పటివరకు 3.83 కోట్ల తాటి, ఈత మొక్కలను నాటామని, ఇవన్నీ గీత కార్మికులకు ప్రయోజనం కల్పించేవేనని చెప్పారు. అలాగే తక్కువ ఎత్తు ఉండే గిరక చెట్లను ప్రయోగాత్మకంగా పెంచుతున్నామని, ఇది విజయవంతమైతే అంతటా విస్తరిస్తామని ప్రకటించారు. కోకాపేట్‌లో గౌడ ఆత్మగౌరవ భవనం కోసం రూ.500 కోట్ల విలువైన స్థలాన్ని, మరో రూ.5 కోట్లు భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి ఇచ్చారని, ఏ రాష్ట్రంలోనైనా కనీసం రూ.10 కోట్ల భూమిని ఆత్మగౌరవ భవనం కోసం ఇచ్చారా అని ప్రశ్నించారు.
మద్యంను తగ్గిస్తూ నీరాను ప్రోత్సహించాలి ః కూనంనేని
భారతదేశంలోనే గీత పనివారల కోసం సంఘం ఏర్పాటు చేసిన మొట్టమొదటి నాయకుడు బొమ్మగాని ధర్మభిక్షం అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. నిజాం వ్యతిరేక పోరాటంలో దున్నే వానికే భూమి నినాదంతో పాటు గీసే వానిదే చెట్టు అనే నినాదాన్ని కూడా ముందుకు తీసుకువచ్చిన ఘనత ఆయనదని చెప్పారు. ఖమ్మం జిల్లా గార్లలో 1957లోనే గీత పనివారల సంఘాన్ని ఏర్పాటు చేసి, వారి సమస్యలన్నీ పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. దేశంలోనే గీత కార్మికులకు సంబంధించి 65 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకైక సంఘం ధర్మభిక్షం ఏర్పాటు చేసిన గీత పనివారల సంఘానిదని చెప్పారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై స్వాతంత్య్ర సమరయోధుడు ధర్మభిక్షం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అబ్దుల్లాపూర్‌మేట్‌లోని స్టేడియంకు ఆయన పేరును పెట్టాలని అన్నారు. ప్రతి సొసైటీకి పది ఎకరాల స్థలాన్ని కేటాయించి, అందులో తాటిచెట్లను పెంచాలని, తాటిచెట్లను ఎక్కకుండానే కింది నుండే కల్లును సేకరించేలా నూతన సాంకేతికను అభివృద్ధి చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మద్యాన్ని క్రమంగా తగ్గిస్తూ నీరా పరిశ్రమను ప్రొత్సహించాలని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.
గీత పనివారల సంఘం ’పోరాటాల ఫలితంగానే హక్కులు : బొమ్మగాని ప్రభాకర్‌
స్వాతంత్య్ర సమరయోధుడు ధర్మభిక్షం ఆధ్వర్యంలో గీత పనివారల సంఘం చేపట్టిన పోరాటాల ఫలితంగానే అనేక సొసైటీలు, ఎక్స్‌గ్రేషియా, పెన్షన్‌ వంటి హక్కులు, పథకాలు సాధించుకున్నామని తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్‌ తెలిపారు. ఈ సంఘానికి గొప్ప చరిత్ర ఉన్నదని, కులం,మతం, రాజకీయలకతీతంగానే గీతపనివారల సంఘం ఏర్పడిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో సహచర మంత్రులతో ప్రకృతి పానీయమైన కల్లును తాగించడం ద్వారా ఇది మత్తు పానీయం కాదనే ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించారని కొనియాడారు. ఎక్స్‌గ్రేషియాకు మెడికల్‌ బోర్డు నిబంధనను తొలగించాలని, గీత కార్మికుల పెన్షన్‌, ఎక్స్‌గ్రేషియా పెంపు డిమాండ్‌లను పరిశీలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
గీత వృత్తిని కాపాడిన ధర్మభిక్షం : గంగాధర్‌ గౌడ్‌
గీత పనివారల సంఘాన్ని స్థాపించి, గీత వృత్తిని బొమ్మగాని ధర్మభిక్షం కాపాడారని ఎంఎల్‌సి గంగాధర్‌గౌడ్‌ అన్నారు. దేశ వ్యాప్తంగానే కాకుండా, ఉమ్మడి రాష్ట్రంలో గీత వృత్తి, కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేశారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన అనంతరం రూ.14 కోట్లు పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా నిధులను విడుదల చేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌, పట్టణ ప్రాంతాల్లో కల్లు దుకాణాల రద్దు జి.ఓను 767ను సిఎం కెసిఆర్‌ రద్దు చేశారని గుర్తు చేశారు.
త్వరలోనే నీరా ప్రాజెక్టు ప్రారంభం : పల్లె లక్ష్మణ్‌ గౌడ్‌
పల్లె లక్ష్మణ్‌ రావు గౌడ్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున నెక్లెస్‌ రోడ్డులో రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టిన ‘నీరా ప్రాజెక్టు’ త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. జిల్లాల వారిగా కూడా నీరా ప్రాజెక్టు చేపట్టేందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో 4 కోట్ల ఈత, తాటి వనాలను ప్రభుత్వ సహకారంతో నాటామన్నారు. గీత వృత్తి సమస్యలపై తను ధర్మభిక్షం జరిపిన పోరాటాల్లో పాల్గొన్నట్లు తెలిపారు.
ట్యాంక్‌ బండ్‌పై ధర్మభిక్షం విగ్రహం ః టి.వెంకట్రాములు
తెలంగాణ రాష్ట్ర వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి టి.వెంకట్రాములు మాట్లాడుతూ ధర్మభిక్షం విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసేందుకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చొరవ తీసుకోవాలని కోరారు. గీత పనివారల ప్రతి సోసైటికి తాటి వనాల పెంపకానికి 10 ఎకరాల భూమి కేటాయించాలన్నారు. కల్లుగీత వృత్తి దినదిన గండంగా మారిందన్నారు. కల్లుగీత కార్మికులు మరణిస్తే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు నష్టపరిహారాన్ని పెంచాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా పెన్షన్‌ను రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచాలన్నారు. వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చొరవ తీసుకోవాలని కోరారు. ప్రధానిగా మొరార్జీ దేశాయి ఉన్నప్పుడు కల్లు సహా మద్య నిషేధాన్ని నిషేధించినప్పుడు, దేశవ్యాప్తంగా గీత కార్మికులను సంఘటితం చేసి ఉద్యమించిన నేత ధర్మభిక్షం అని గీత పనివారల సంఘం మాజీ ఉపాధ్యక్షులు గోదా శ్రీరాములు తెలిపారు. శాస్త్రీయ పద్ధతిలో గీత పరిశ్రమను అభివృద్ధి పరచాలని ఆనాడే కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు పండ్ల రాములు మాట్లాడుతూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వన విధ్వంసానికి పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సొసైటీకి కేటాయించిన భూములను అమ్ముకోకుండా చూడాలన్నారు. బిసి హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగాచారి, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌, తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం కోశాధికారి బి.నాగభూషణం, సిపిఐ బోడుప్పల్‌ మండల కార్యదర్శి రచ్చ కిషన్‌, గీత పనివారల సంఘం రాష్ట్ర నాయకులు వేదికపై ఆసీనులయ్యారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments