HomeNewsBreaking Newsసమరోత్సాహంతో భారత్‌

సమరోత్సాహంతో భారత్‌

నేడు ఆస్ట్రేలియాతో తొలి టి20, రాత్రి 7. గంటల నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో ప్రసారం
విశాఖపట్నం: ప్రపంచకప్‌కు ముందు టీమిండియా మరో పెద్ద సమరానికి సిద్ధమైంది. నేటి నుంచి భారత్‌ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ప్రారంభంకానుంది. అనంతరం ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌ ముగిసిన తర్వాత ఐపిఎల్‌, అనంతరం వరల్డ్‌కప్‌ సమరం మొదలుకానుంది. అందుకే ఆసీస్‌తో భారత్‌ సొంత గడ్డపై జరిగే ఈ సిరీస్‌ కోహ్లీ సేనకు సెమీఫైనల్‌ లాంటిది. ఇందులో రాణిస్తే ప్రపంచకప్‌లో టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందనడంలో సందేహం లేదు. ఈ సంవత్సరం ఇంగ్లాండ్‌ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్‌ పోటీలు జరగనున్నాయి. ఈ వరల్డ్‌కప్‌ సమరంలో భారత జట్టు హాట్‌ ఫేవరేట్‌గా బరిలో దిగనుంది. ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు దాదాపు స్థానాలు ఖాయమైనప్పటికీ మరి కొన్ని స్థానాల్లో ఇంకా స్పష్టత రాలేదు. ఈ చివరి స్థానాల బర్తీ కోసం ఈ సిరీస్‌ ఒక మంచి మార్గమని భారత సెలెక్షన్‌ కమిటీ భావిస్తోంది. ఇందులో రాణించిన వారు వరల్డ్‌కప్‌ జట్టులో తమ స్థానాల్నీ మరింతగా మెరుగుపరుచుకోవచ్చు. ప్రస్తుతం టీమిండియా వరుస విజయాలతో జోరుమీదుంది. ఇటీవలే జరిగిన విదేశి పర్యటనల్లో భారత జట్టు అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో భారత్‌ మంచి ప్రదర్శనలు చేసింది. పటిష్టమైన ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై చెమటలు పట్టించింది. టెస్టుల్లో ఎదురులేని కంగారూ జట్టును వారి ఇంటిలోనే పల్టీకొట్టించి చారిత్రక టెస్టు సిరీస్‌ విజయాన్ని అందుకుంది. అనంతరం వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకుని తమ సత్తా మరోసారి చాటుకుంది. విదేశాల్లో ఎన్నడులేని విధంగా ఈసారి టీమిండియా తమ బలాన్ని ప్రదర్శించింది. తర్వాత న్యూజిలాండ్‌ పర్యటించిన టీమిండియా అక్కడ కూడా అదే జోరును కనబర్చింది. అక్కడ పరిమిత ఓవర్ల సిరీసులు ఆడిన భారత జట్టు గొప్ప విజయాలు నమోదు చేసింది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 4 కైవసం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది. తర్వాత జరిగిన టి20 సిరీస్‌లో తడబడినా ఓవరాల్‌గా విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుందనే చెప్పాలి. ఎవరికీ సాధ్యంకాని అరుదైన రికార్డులను కోహ్లీ సేన సొంతం చేసుకుంది. అయితే న్యూజిలాండ్‌తో మూడో వన్డే అనంతరం కెప్టెన్‌ కోహ్లీకి బిసిసిఐ విశ్రాంతి కల్పించింది. తర్వాత రోహిత్‌ శర్మ భారత్‌కు సారథ్యం వహించాడు. మరోవైపు ప్రధాన బౌలర్లకు కూడా విశ్రాంతి ఇవ్వడంతో కివీస్‌తో చివరి రెండు వన్డేలు, టి20 సిరీస్‌లో భారత జట్టు పూర్తి స్థాయి జట్టు లేకుండానే మైదానంలో దిగింది. అయినా పటిష్టమైన కివీస్‌కు గట్టిపోటీ నిచ్చింది. ప్రపంచకప్‌కు కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. కివీస్‌ పర్యటన తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్‌కు సిద్ధమైంది. భారత్‌ పర్యటిస్తున్న ఆస్ట్రేలియా ప్రస్తుతం మంచి ఫామ్‌లో లేకపోవడం టీమిండియాకు కలిసొచ్చే అంశమే. కానీ డిఫెండింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌ ఆసీస్‌ను తక్కువ అంచనా వేయలెం. క్లిష్ట సమయాల్లో అద్భుతంగా పొరాడే తత్వం ఆస్ట్రేలియా జట్టులో ఎంతగానో ఉంది. ఇక ప్రపంచకప్‌ సమీపించడంతో ఆస్ట్రేలియా కూడా తమ పాత ఫామ్‌ను తిరిగి సాధించాలని పట్టుదలతో ఉంది. తమ పూర్వవైభవాన్ని తిరిగి సాధించడానికి ప్రస్తుతం భారత్‌తో జరిగే సిరీసే మంచి చాన్స్‌గా భావిస్తోంది. ఇక ఏది ఏమైన ఇరు జట్లకు ఈ సిరీస్‌ చాలా ముఖ్యమైంది. తమ తమ పూర్తి బలబలగాలను వినియోగించుకొని ప్రపంచకప్‌కు ఒక పటిష్టమైన జట్టును ఎన్నుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. గత సిరీస్‌లో విశ్రాంతిలో ఉన్న భారత సారథి విరాట్‌ కోహ్లీ తిరిగి జట్టులో చేరాడు. అతనితోపాటు ప్రధాన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా టీమిండియాకు అందుబాటులో ఉన్నాడు. ఇక ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మరోసారి గాయం కారణంగా ఆసీస్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా జట్టుకు అరోన్‌ ఫించ్‌ నాయకత్వం వహిస్తున్నాడు.
ఓపెనర్లే కీలకం..
ఏ ఫార్మాటైన సరే ఒక జట్టు భారీ స్కోరు సాధించాలంటే ఓపెనర్లే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఓపెనర్లు శుభారంభాన్ని అందిస్తే టీమిండియా కూడా మంచి స్కోరును నమోదు చేయగలుగుతోంది. అందుకే ఆసీస్‌తో ఈ రోజు జరిగే తొలి వన్డేలోనూ భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ కీలకంగా మారారు. వీరిద్దరూ మంచి ఆరంభాన్ని అందిస్తే టీమిండియా మొదట బ్యాటింగ్‌ చేసినా.. లక్ష్యఛేదనకు దిగిన ఈజీగా విజయం సాధించవచ్చు. గత కొంతకాలంగా వీరిద్దరూ మంచి ప్రదర్శనలు చేస్తున్నారు. కానీ చాలా సందర్భాల్లో ఇద్దరిలో ఎవరో ఒకరు రాణిస్తుంటే మరొకరు విఫలమవతున్నారు. ఇద్దరూ నిలకడమైన ఆరంభాన్ని అందించలేక పోతున్నారు. వీరిద్దరూ రాణించిన ప్రతిసారి టీమిండియా విజయాలు సాధించింది. ఈ సారి కూడా ఈ జంట మరోసారి మంచి ఆరంభాన్ని అందించాలని అందరూ కోరుకుంటున్నారు. వీరిద్దరూ శుభారంభం అందిస్తే.. తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్స్‌కు పెద్ద స్కోరు చేయడంలో ఇబ్బంది ఉండదు. ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడి భారీ పరుగులు చేయడం సులువు అవుతుంది. అందుకే ఈ ఓపెనర్లపై అధిక భారం ఉంటుంది. ఇక కొన్ని రోజులుగా విశ్రాంతిలో ఉన్న భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తిరిగి జట్టులో రావడం టీమిండియా బలాన్ని రెట్టింపు చేసింది. భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించిన కోహ్లీ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. తన కెప్టెన్సీలోనే భారత్‌ టెస్టుల్లో నెంబర్‌ వన్‌, వన్డేలో రెండో ర్యాంక్‌లో నిలిచింది. టి20 ర్యాంకుల్లోనూ టీమిండియా రెండో స్థానంలో ఉంది. ఇక ఆస్ట్రేలియా టి20ల్లో ఐదో స్థానంలో కొనసాగుతుంది. పాకిస్థాన్‌ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక కెప్టెన్సీలో మంచి మార్కులు కొట్టేసిన కోహ్లీ వ్యక్తిగత విభాగంలోనూ ఎదురులేని శక్తిగా ఎదిగాడు. టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటి ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. గత కొంత కాలంగా అద్భుతంగా ఆడుతున్న పరుగుల యంత్రం కోహ్లీ ఎన్నో రికార్డులను తిరగరాశాడు. ఇక ఆస్ట్రేలియాతో జరగబోతున్న తొలి టి20లోనూ తన సత్తా చాటుకునేందుకు కోహ్లీ సిద్ధమయ్యాడు.
మిడిలార్డర్‌ రాణించాలి..
భారత టాప్‌ ఆర్డర్‌ పటిష్టంగానే ఉన్నా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్స్‌ మాత్రం నిలకడగా ఆడలేక పోతున్నారు. ప్రపంచకప్‌కు ముందు ఈ విభాగంపై కూడా టీమిండియా మంచి పట్టు సాధించాలని టీమిండియా యాజమాన్యం ఆశిస్తోంది. ఇక మిడిల్‌ ఆర్డర్‌లో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ప్రస్తుతం మంచి ఫామ్‌ను అందుకున్నాడు. ఇతను క్రీజులో ఉన్నంత సేపు పరుగులు చేయడం ఖాయం. గత ఏడాది ఘోరంగా విఫలమైన ధోనీ ప్రపంచకప్‌కు ముందు తిరిగి తన లయలోకి వచ్చాడు. ఇతనికి యువ సంచలనం రిషభ్‌ పంత్‌ గట్టి పోటీ ఎదురువుతుంది. ఇటీవలే జరిగిన ఆసీస్‌, కివీస్‌ పర్యటనల్లో ధోనీ తన సత్తా చాటుకుని వరల్డ్‌కప్‌ జట్టులో తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకున్నాడు. ఇక విజయ్‌ శంకర్‌, కృనాల్‌ పాండ్యా, దినేష్‌ కార్తిక్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. మిడిల్‌ ఆర్డర్‌లో తమ సేవలను గొప్పగా అందిస్తున్నారు. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ కార్తిక్‌కు వన్డే సిరీస్‌లో చోటు దక్కకపోయినా తనకు లభించిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నాడు. ఈసారి కార్తిక్‌ తుది జట్టులో చోటు దక్కించుకుంటే మరో గొప్ప ఇన్నింగ్స్‌ ఆడడం ఖాయం. కృనాల్‌ పాండ్యా కూడా తనకు అందిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో గొప్ప ప్రదర్శనలు చేశాడు. మంచి ఆల్‌రౌండర్‌గా పేరుదక్కించుకున్నాడు. ఇక విజయ్‌ శంకర్‌ అని ఫార్మాట్ల క్రికెట్‌లో తన సత్తా చాటుతున్నాడు. భారత ప్రధాన ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా లేని సమయాల్లో ఇతను కీలక ఆల్‌రౌండర్‌ పాత్ర పోషిస్తున్నాడు. వరల్డ్‌ కప్‌ భారత జట్టులో రెండో ఆల్‌రౌండర్‌గా విజయ్‌శంకర్‌ తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేసేందుకు శంకర్‌ పూర్తిగా సిద్ధమయ్యాడు. తాజా సిరీస్‌లో హార్దిక్‌ గాయంతో దూరమవడం ఇతనికి ఇంకా కలిసొచ్చింది.
బౌలర్ల జోరు కొనసాగాలి..
గత కొంత కాలంగా టీమిండియాకు ఒంటి చేత్తో విజయాలు అందిస్తున్న బౌలింగ్‌ దళం ఈసారి కూడా తమ జోరు కొనసాగించాలి. భారత్‌ను టాప్‌ స్థానాల్లో నిలపడంలో బౌలర్ల కృషి ఎంతగానో ఉంది. ప్రస్తుతం టీమిండియా ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లతో పటిష్టంగా ఉంది. జస్ప్రీత్‌ బుమ్రా వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌గా ఉన్నాడు. మిగతా ఫార్మాట్లలోనూ మెరుగైన ప్రదర్శనలు చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ అనంతరం రెస్టులో ఉన్న బుమ్రా తాజా ఆసీస్‌ సిరీస్‌లో భారత జట్టులో తిరిగివచ్చాడు. ఇతని రాకతో టీమిండియా బౌలింగ్‌ విభాగం మరింతగా పటిష్టంగా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో సిద్దర్థ్‌ కౌల్‌, ఉమేశ్‌ యాదవ్‌, యువ ఆటగాడు మయాంక్‌ మార్కండే ముగ్గురు పేసర్లలో ఎవరికి చోటు లభించినా తమ సత్తా చాటుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఆస్ట్రేలియాకు ఇది మంచి అవకాశం..
వరుస ఓటములతో సతమతమవుతున్న ఆస్ట్రేలియాకు ప్రపంచకప్‌ముందు భారత సిరీస్‌ మంచి అవకాశమని చెప్పాలి. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా భారత్‌పై పైచేయి సాధించి వరల్డ్‌కప్‌కు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలని భావిస్తోంది. అరోన్‌ ఫించ్‌ సారథ్యంలోని ఆసీస్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ పటిష్టంగానే ఉంది. ఆసీస్‌ జట్టులో బ్యాట్స్‌మెన్స్‌ విఫలమైన బౌలర్లు తమ జట్టును ఆదుకుంటారు. అందరూ కలిసి కట్టుగా రాణించడం ఆసీస్‌కు ప్లస్‌ పాయింట్‌. ఆసీస్‌ జట్టులో యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శనలు చేస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments