నేడు భారత్, నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్
రాత్రి 7 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో ప్రసారం
పురుషుల హాకీ ప్రపంచ కప్
భువనేశ్వర్: భారత హాకీ జట్టుకు గత 43 సంవత్సరాలుగా అందని ద్రాక్షగా ఉన్న పతకం కల ఈ సారి నెరవేరనుందనిపిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శన అద్భుతంగా కొనసాగుతోంది. వరుసగారెండు విజయాలతో పాటు తమకంటే మెరుగైన జట్టును కూడా నిలువరించి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించి జోరుమీదుంది. అయితే టీమిండియాకు అసలైన పరీక్ష ఇప్పుడుంది. నాకౌట్ స్టేజ్‌లో ప్రతి మ్యాచ్ కీలకం గెలుస్తే ముందుకు.. ఓడితే ఇంటికే.. చివరి సారిగా 1975లో పతకం గెలిచిన భారత్ అప్పటి నుంచి వరుసగా విఫలమవుతూనే వస్తోంది. ఒకానొక సమయంలో భారత జట్టు హాకీ క్రీడలో ప్రపంచాన్ని వణికించింది. భారత్‌తో పోరంటే ప్రత్యర్థులకు దడ.. కానీ, రానురాను ఈ ఆటకు క్రేజ్ తగ్గుతూ పోవడంతో మన జాతీయా క్రీడ అయిన హాకీ కనుమరుగైంది. క్రికెట్‌కు ఆధరణ విపరీతంగా పెరగడంతో రానురాను హాకీ ఆట వెనుకబడిపోయింది. ఈ ఆటపై సీనియర్ క్రీడాకారులు కూడా పెద్దగా శ్రద్ధ చూపకపోవడంతో మన దేశంలో క్రికెట్ హవా ఊపందుకుంది. అయితే చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడ హాకీ క్రీడలో భారత జట్టు తిరిగి పాత ఫామ్‌ను కనబరుస్తోంది. ఈ ఏడాది జరిగిన పెద్ద టోర్నీల్లో మెరుగైన ప్రదర్శనలతో ప్రపంచ ఐదో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. చాంపియన్స్ ట్రోఫీలో కూడా గొప్పగా ఆడింది. యువ ఆటగాళ్లు భారత జట్టుకు కొత్త ఊపునందించారు. ఆటలో దూకుడును ప్రదర్శిస్తూ ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు.
ఆత్మవిశ్వాసంతో భారత్…
ఎన్నో ఏళ్లుగా పతకం కోసం ఎదురుచూస్తున్న భారత జట్టు ఈసారి అన్ని విధాలుగా సిద్ధమయ్యే ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది. యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ ఆటగాళ్లు కూడా మంచి ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసోస్తుంది. లీగ్ దశలో టీమిండియా అద్బుతమైన ప్రదర్శనలతో తమ పూల్‌లో అగ్రస్థానంలో నిలిచి ప్రపంచకప్ క్వార్టర్ బెర్త్ దక్కించుకుంది. ఇక ముందున్న అసలుసిసలైన సమరానికి పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. పూల్ దశలో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను 5-0తో చిత్తు చేసి సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శిస్తూ ప్రత్యర్థి జట్టుపై ఏకపక్షంగా విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టింది. తర్వాత రెండో మ్యాచ్‌లో తమకంటే మెరుగైన బెల్జియంను నిలువరించింది. ఒలింపిక్ మెడలిస్ట్, ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియంతో జరిగిన పోరులో భారత ఆటగాళ్లు ప్రదర్శించిన ఆట అమోఘం. ఈ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో భారత్‌కి ఓటమి తప్పదని విశ్లేషకుల అంచనా. కానీ, వారి అంచనాలను తారుమారు చేస్తూ భారత జట్టు ఈ మ్యాచ్‌లో గొప్పగా పోరాడింది. చివరికి మ్యాచ్‌ను 2-2 డ్రా చేసుకుని పాయింట్ల పట్టికలో ఆధిక్యాన్ని సాధించింది. ఇక కీలకమైన చివరి లీగ్ మ్యాచ్‌లో కెనడాను 5-1తో ఓడించి తమ
పూల్ నుంచి నేరుగా నాకౌట్‌కు అర్హత సాధించింది. ఈ ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లు ఆడుతున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది. ఈ సారి స్వదేశంలో ప్రపంచకప్ పోటీలు జరగడం భారత్‌కు ప్లస్ పాయింట్‌గా మారింది. ఈసారి ఎలాగైనా పతకం గెలువాలనే కసితో ఉన్న టీమిండియాకు ఇది మంచి అవకాశం. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని భారత జట్టు తహతహలాడుతోంది.
విజయమే లక్ష్యం: మన్‌ప్రీత్
గురువారం జరిగే క్వార్టర్ పోరులో తమకంటే ర్యాంకింగ్స్‌లో మెరుగైన నెదర్లాండ్స్‌తో భారత్ తలపడ నుంది. నెదర్లాండ్స్‌ను ఓడించడం భారత్‌కు కఠిన సవాలేనని భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ అంటున్నాడు. కానీ, ఆసవాలును అధిగమించి విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మన్‌ప్రీత్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రత్యర్థి సవాలుకు తాము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. లీగ్ దశలో పటిష్టమైన బెల్జియం జట్టును కట్టడి చేశం. ఈసారి క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌ను కూడా కట్టడి చేసి సెమీస్‌కు చేరుతామని మన్‌ప్రీత్ అన్నాడు. వరుస విజయాలతో తమ జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయిందని జట్టులో యువ ఆటగాళ్లు మంచిగా రాణిస్తున్నారని, రెండు మ్యాచుల్లో ఐదు ఐదు గోల్స్ చేశామని ఆయన అన్నాడు. ఈసారి అదే జోష్‌తో భారీ గోల్స్ సాధిస్తామని అన్నాడు. అటాకింగ్‌కే ప్రాధాన్యం ఇస్తామని మన్‌ప్రీత్ అంటున్నాడు. సత్తా చాటుకునేందుకు తమ ఆటగాళ్లు అతృతాతో ఉన్నారని, విజయమే లక్ష్యంగా తాము బరిలోకి దిగుతున్నామని భారత సారథి మన్దీప్ సింగ్ అన్నాడు.
నెదర్లాండ్స్ రికార్డే బాగుంది…
ఇప్పటి వరకు భారత్, నెదర్లాండ్స్ జట్లు 105 సార్లు తలపడితే అందులో 33 విజయాలు సాధించి 48 మ్యాచుల్లో ఓటములను చవిచూసింది. మిగతా మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. చివరి సారిగా ఈ రెండు జట్లు చాంపియన్స్ ట్రోఫీలో తలపడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఆ మ్యాచ్ 1-1తో డ్రా అయింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ ఐదో ర్యాంకులో ఉంటే.. నెదర్లాండ్స్ నాలుగో ర్యాంక్‌లో భారత్ కంటే మెరుగ్గా ఉంది.
భారత జట్టు: మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), పిఆర్. శ్రీజేశ్ (వికెట్ కీపర్), కృషన్ పాఠక్ (వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, సిమ్రన్ సింగ్, హార్దిక్ సింగ్, మన్దీప్ సింగ్, ఆకాశ్ దీప్ సింగ్, కొతాజిత్, చింగ్లేన్ సనా, సురేందర్, లలిత్ ఉపాధ్యాయ్, నీలకంఠ శర్మ, సుమీత్, వరుణ్ కుమార్, అమిత్ రోహిదాస్, బీరేంద్ర లాక్రా.