జగన్ మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు చోటు
ఐదుగురు డిప్యూటీ సిఎంలు
స్పీకర్‌గా తమ్మినేని సీతారాం
ప్రజాపక్షం/హైదరాబాద్: విజయవాడ చేరుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్‌ఎల్.నరసింహన్‌తో ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రుల జాబితాను జగన్ గవర్నర్‌కు అందజేశారు. మంత్రివర్గ కూర్పుపై ఇద్దరు కాసేపు చర్చించుకున్నారు. ఎపి సచివాలయం సమీపంలో శనివారం ఉదయం సరిగ్గా 11:49 నిమిషాలకు కొత్త మంత్రులతో నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. తర్వాత తొలిసారి కేబినెట్ భేటీ జరగబోతోంది. శుక్రవారం ఉదయం జగన్ అధ్యక్షతన వైసిపిఎల్‌పి సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రివర్గ కూర్పుపై ఎంఎల్‌ఎలతో చర్చించారు. మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా రు. వీరిలో 20 మంది మంత్రులు.. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు మంత్రివర్గంలో చోటు దక్కిన వారికి వరుసగా ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నారు. ఇటు సిఎం జగన్ కూడా శనివారం ఉద యం 8:39 నిమిషాలకు సచివాలయంలో తొలిసారిగా అడుగుపెట్టబోతున్నారు. కాగా, సెక్రటేరియెట్ మొదటి బ్లాక్‌లో జగన్ కార్యాలయాన్ని సిద్ధం చేశారు.
మంత్రివర్గ కూర్పు పూర్తి
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ కూర్పు పూర్తయింది. తన జట్టులోని సభ్యుల పేర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. దాదాపు అన్ని సామాజిక వర్గాలకూ మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఏడుగురు బిసిలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఎస్‌సి వర్గానికి చెందిన ఐదుగురికి అవకాశం ఇవ్వగా వీరిలో మాదిగ వర్గానికి 2, మాల వర్గానికి 3 కేటాయించారు. కాపు, రెడ్డి వర్గాలకు నాలుగుచొప్పున ఇచ్చారు. వైశ్య, క్షత్రియ, కమ్మ, మైనార్టీ వర్గాలకు ఒక్కో మంత్రి పదవి కేటాయించారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని గత కొన్ని రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేసిన జగన్ ఆయా వర్గాలకు చెందిన ప్రతినిధులకు అవకాశం కల్పిస్తూ మంత్రివర్గాన్ని కూర్చారు. పార్టీ నుంచి గెలిచిన 151 మంది శాసనసభ్యులు మంత్రి పదవులకు అర్హులే అయినప్పటికీ కొంతమందికి మాత్రమే అవకాశం ఉందని, రెండున్నరేళ్ల తర్వాత దాదాపు 20 మందిని మార్చి వారి స్థానంలో కొత్తవారికి మంత్రులుగా అవకాశం ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. శనివారం ఉదయం 11.49గంటలకు వెలగపూడిలోని సచివాయలయం ప్రాంగణంలో నూతన మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.