అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి
కృష్ణ-గోదావరి జలాలపై నిపుణులతో చర్చ
కొత్త సచివాలయం, అసెంబ్లీ అవసరం లేదు
మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
ప్రజాపక్షం/హైదరాబాద్: అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి జలవిధానాన్ని నిర్ణయించాలని సిపిఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం మంచి పరిణామామేనని, కానీ కృష్ణ, గోదావరి జలాలపై నిపుణులతో చర్చించాలన్నారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సిపిఐ జాతీ య కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ, నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఇటీవల తాము సందర్శించి అక్కడి పరిస్థితిని పరిశీలించామని, నీళ్లను పైకి తీసుకురావడం తప్ప రైతులకు నీరు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. దీనికి 4700 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతుందని, ప్రాజెక్టు నిర్మాణానికి రూ.లక్ష కోట్లు అవుతుందని, ఇంకా ఎంత ఖర్చు అవుతుందో స్పష్టత లేదన్నారు. ప్రాణహిత ప్రాజెక్ట్‌ను కాళేశ్వరంగా పేరు మార్చారని, అదే ప్రాంతం, అదే అలైన్‌మెంట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ర్ట ప్రభుత్వం ఇంజనీర్ నిపుణులతో చర్చించి, అఖిలక్షపక్ష సమావేశాన్ని నిర్వహిస్తే ఖర్చులను తగ్గించు కునేందుకు అవకాశం ఉంటుందని సూచించారు. ఇప్పటికే అప్పులు రూ. 1.80 లక్షల కోట్లు దాటాయని, కొత్తగా అప్పులు కూడా వచ్చే పరిస్థితి లేదని, వెనుకబడిన ప్రాంతాలకు నీరిచ్చే పాలమూరు ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులను విడుదల చేసేలా కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.
కొత్త సచివాలయం, అసెంబ్లీ అనవసరం
సిఎం కెసిఆర్ తన వాస్తు పిచ్చితో రాష్ర్ట ప్రయోజనాలకు నష్టం కలిగించవద్దని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సచివాలయం, శాసనసభ భవనాలు బాగానే ఉన్నాయని, తాము ఎంఎల్‌ఎగా ఉన్నపుడు 2005లోనే సచివాలయ కొత్త భవనాలను నిర్మించారని, అప్పుడే కూల్చివేతలా అని ప్రశ్నించారు. రెండు పడకల ఏజెండా పక్కకు పోయందన్నారు. ప్రజల చెమట, వారి పన్నులతో వచ్చిన సొమ్ము అనేది సిఎం కెసిఆర్ గుర్తుంచుకోవాలని సూచించారు. కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు అనాలోచిత, అనవసరమైన, అర్థం, పర్థం లేనిదని పేర్కొన్నారు. దీనికి రూ. 500 కోట్ల ఖర్చు అని చెబుతున్నారని, ఇదే డబ్బులతో పేదలకు రెండు పడకగల గదులు వస్తాయని సూచించారు. అయినా తాము ఏకపక్షంగా వెళ్తామంటే తాము చేసేది ఏమీ లేదని, తాను తవ్వుకున్న గోతితో కెసిఆర్ పడక తప్పదని హెచ్చరించారు. భూ ప్రక్షాళనలో తప్పులు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో వక్ఫ్‌బోర్డు ఆస్తులను శనివారం పరిశీలించనున్నట్లు తెలిపారు. పార్టీ మారితే సభ్యత్వం రద్దు కావాలని ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు చేసిన ప్రకటనకు ఆయన కట్టుబడి ఉంటాడని భావించామని, కానీ ఆంధ్రప్రదేశ్‌లోని టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపిలో విలీనం చేయడం సిగ్గుచేటని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆయన చేసిన ప్రకటనకు ఆయనే కట్టుబడి లేకపోవడం తలదించుకోవాల్సిన విషయమన్నారు.