HomeNewsBreaking Newsసబ్బండ వర్గాల సమీకరణే లక్ష్యం

సబ్బండ వర్గాల సమీకరణే లక్ష్యం

11న కొత్తగూడెంలో ప్రజాగర్జన బహిరంగ సభ
సచ్చిలతతో కూడిన సిపిఐ ప్రజాపోరాటం
మీడియా సమావేశంలో కూనంనేని
ప్రజాపక్షం / ఖమ్మం
లక్ష మంది జన నినాదమే ఈ నెల 11న కొత్తగూడెంలో జరగనున్న ప్రజా గర్జన బహిరంగ సభ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ బహిరంగ సభకు సబ్బండ వర్గాల సమీకరణే లక్ష్యంగా నెల రోజులుగా సిపిఐ శ్రేణులు పని చేస్తున్నాయని ఆయన తెలిపారు. సిపిఐ ఖమ్మం కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకు రావడంతో సిపిఐ భవిష్యత్‌ కార్యాచరణకు సంబంధించి బహిరంగ సభలో దిశా నిర్దేశం చేయనున్నామని ఆయన తెలిపారు. ప్రజాపోరాటాలు, పార్టీ విస్తృతితో పాటు ఎన్నికలు కూడా పార్టీ కార్యక్రమంలో ఒక భాగమని ఆయన స్పష్టం చేశారు. తొమ్మిదేళ్ల బిజిపి పాలనపై నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల గ్రామాల్లో ప్రచారం చేయడంతో పాటు లక్ష మంది కార్యకర్తలను ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేలా చేశామని, ప్రత్యక్షంగా, పరోక్షంగా కోటి మందికి సందేశాన్ని అందించామన్నారు. దేశ్‌కో బచావో -బిజెపికో హఠావో నినాదంతో పార్టీ విస్తృత కార్యక్రమం తీసుకోవడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి మత భావజాలాన్ని నిలువరించగలిగామన్నారు. దేశ వ్యాప్తంగా బిజెపికి గడ్డుకాలం ప్రారంభమైందని రామాలయం ఉన్న అయోధ్య మున్సిపల్‌ ఎన్నికల్లో సిపిఐ ఆరు స్థానాల్లో విజయం సాధించిందని రామాలయం ఉన్న ప్రాంతంలో కూడా సిపిఐ అభ్యర్థి కౌన్సిలర్‌గా గెలుపొందారని సాంబశివరావు తెలిపారు. బిజెపి తొమ్మిదిన్నర ఏళ్లలో జాతీయ సంస్థలను విక్రయించడం, మత ప్రచారాన్ని చేయడం, ప్రైవేటీకరణను వేగవంతం చేయడం తప్ప సాధించింది ఏమి లేదన్నారు. బ్యాంకులు, రైల్వేలు, ఎల్‌ఐసి సహా ప్రధాన సంస్థలన్నింటిని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఆధీనత స్థానే కాంట్రాక్టీకరణ పెరిగి పోయిందని బిజెపి ప్రైవేటీకరణ వైపు పరుగులు పెడుతుంటే రాష్ట్రంలో కాంట్రాక్టీకరణ జరుగుతుందన్నారు. ప్రజల పక్షాన సిపిఐ సచ్చిలతతో కూడిన ప్రజాపోరాటాలను నిర్వహిస్తుందని పార్టీ విస్తృతి కోసం విశేష కృషి జరుగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడుతూ తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తామన్నారు. డబ్బు రాజకీయాలకు కాలం చెల్లేరోజు రాక తప్పదని అన్ని రంగాలు అవినీతిమయమై దిగజారుడు తనం పెరుగుతుందని దీనిని నిలువరించక తప్పదన్నారు. దామాషా ప్రతిపాదికన ఎన్నికలు నిర్వహించాలని కూనంనేని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని కానీ అర్హులైన రైతుల స్వాధీనంలో ఉన్న భూమి ప్రకారం 11 లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని కూనంనేని డిమాండ్‌ చేశారు. పింఛన్లు, డబుల్‌బెడ్‌రూం ఇండ్లతో పాటు కాంట్రాక్ట్‌ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న శ్రమ దోపిడీని నిలువరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సొంత స్థలంలో ఇండ్లు నిర్మించుకునే వారికి రూ. 10 లక్షలు ఇవ్వాలని, సొంత స్థలాలు లేని వారికి నివాస స్థలాలు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉండటానికి ఇల్లు, చదువు, వైద్యం, పింఛన్‌ సౌకర్యం లక్ష్యాలుగా సిపిఐ పని చేస్తుందని కూనంనేని స్పష్టం చేశారు. కౌలు రైతులకు న్యాయం చేయాలని, భద్రత కల్పించాలని ఆయన కోరారు. ఉమ్మడిఖమ్మంజిల్లా ఆది నుంచి పార్టీకి దన్నుగా నిలిచిందని అందుకే కొత్తగూడెంలో ప్రజాగర్జన సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అవినీతిమయమైన పాలక పార్టీల వల్ల ప్రజలు విసిగిపోయారని కమ్యూనిస్టుల వైపు చూడక తప్పని రోజులు వస్తున్నాయని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో 10 స్థానాల్లో ఎనిమిది స్థానాల్లో గెలుపుకు సిపిఐ కారణమని కమ్యూనిస్టులను తక్కువగా చూపాలనుకునే వారు కు విమర్శలు చేస్తున్నారని ఆయన తెలిపారు. సిపిఐ ప్రజాపోరాటానికి సంపూర్ణ మద్దతు నివ్వాలని సాంబశివరావు కోరారు. సింగరేణి, రైతులు, ఉద్యోగ, కార్మిక వర్గాలు, దళితులు, గిరిజనుల సమీకరణ లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఈ బహిరంగ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, జాతీయ నాయకులు నారాయణ, అజీజ్‌పాషా, చాడ వెంకట రెడ్డి, పువ్వాడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారని కూనంనేని తెలిపారు. విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, సహాయ కార్యదర్శి దండి సురేష్‌, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎస్‌కె జానిమియా, సిద్దినేని కర్ణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments