రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఉయ్యాల పాటలతో ఆడిపాడిన పల్లెలు, పట్టణ వాసులు
కాంతులీనిన ట్యాంక్‌బండ్
కిక్కిరిసిన హనుమకొండలోని పద్మాక్షి ఆలయం
ప్రజాపక్షం/హైదరాబాద్ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు, యువతులు అంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబరాలు చేసుకున్నారు. మహిళలంతా తీరొక్క పువ్వులతో అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు. బతుకమ్మ సంబురాలతో నగరంలోని ట్యాంక్‌బండ్ పరిసరాలు కాంతులీనాయి. వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క బతుకమ్మను భావితరాలకు అందిద్దామని సూచించారు. రాష్ట్రమంతటా వేలాది మహిళలు ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అని ఆనందంగా ఆడిపాడారు. వేలాది మంది మహిళలు, పిల్లలతో హనుమకొండ పద్మాక్షి అమ్మవారి గుండం జనసంద్రంగా మారింది. కరీంనగర్, నల్గొండ, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో బతుకమ్మ సంబరాలు అత్యంత కోలాహలంగా సాగుతున్నాయి. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ సంబురాలు నేటితో ముగిశాయి. మరోవైపు జిల్లాల్లో సద్దుల బతుకమ్మ వేడుకల కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ ఆనందంగా గడిపారు. ఏ ప్రాంతంలో చూసినా బతుకమ్మ పాటలతో సందడి వాతావరణం కనిపించింది.
ట్యాంక్‌బండ్‌పై ఘనంగా సద్దుల బతుకమ్మ
ట్యాంక్‌బండ్ పై సద్దుల బతుకమ్మ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో వేలాది మంది మహిళలు బతుకమ్మలతో తరలి వచ్చారు. సచివాలయం వద్ద గల అరమవీరుల స్మారక కేంద్రం నుంచి మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్‌బండ్ బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికకు తరలివచ్చారు. ఈసందర్బంగా కళాకారులు వివిధ కళారూపాలతో ఆకట్టుకున్నారు. సద్దుల బతుకమ్మ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వీరితోపాటు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, ప్రజా గాయని విమలక్క, ఎంఎల్‌సికోదండరాం, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద మంత్రి సీతక్క తో పాటు మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ తదితరులు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పై దాదాపు 40 నిమిషాల పాటు ప్రదర్శించిన క్రాకర్స్, లేజర్ షోలు సందర్శకులను పెద్ద ఎత్తున ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు పర్యటక శాఖ డైరెక్టర్ ఇలా త్రిపాఠి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జలమండలిలో సద్దుల బతుకమ్మ వేడుకలు
జలమండలిలో తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండగను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్బంగా జలమండలి ఈడి మయాంక్ మిట్టల్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి. పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ సంబురాలను హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్, బేగంపేట్ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతికి నివాళులు అర్పించి స్త్రీలను గౌరవించే పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ పండుగ ఒక గర్వకారణం అని, సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్న ఈ పండుగ అంతర్జాతీయస్థాయిలో గొప్ప ఖ్యాతినార్జించిందని ఆయన అన్నారు.
సద్దుల సంబురం
RELATED ARTICLES