HomeNewsBreaking Newsసత్యానికి సంకెళ్ళు

సత్యానికి సంకెళ్ళు

గాడ్సే మొట్ట మొదటి ఉగ్రవాది అన్నందుకు
గుజరాత్‌ యువ దళిత ఎంఎల్‌ఎ జిగ్నేశ్‌ అరెస్ట్‌
హుటాహుటిన అసోం తరలింపు
అహ్మదాబాద్‌/గువహటి : జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సే దేశంలో మొట్టమొడటి ఉగ్రవాది (టెర్రరిస్టు) అని వ్యాఖ్యానించిన గుజరాత్‌ దళిత ఉద్యమ నాయకుడు, ఎంఎల్‌ఎ జిగ్నేశ్‌ మేవానీని అసోం పోలీసులు బుధవారం ఆర్థరాత్రి దాటాక అరెస్టు చేశారు. హుటాహుటిన అసోం తరలించారు. అసోంలోని కోక్రాఝార్‌ జిల్లాకు చెందిన ఒక గ్రామ బిజెపి నాయకుడు అరూప్‌ కుమార్‌ దేవ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అసోం పోలీసు బృందం హుటాహుటిన రాత్రికి రాత్రి గువహటి నుండి గుజరాత్‌ వెళ్ళి జిగ్నేశ్‌ మేవానీని అర్థరాత్రి తలుపుతట్టి అరెస్టు చేసి వాయు మార్గంలో అసోం తరలించారు. ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు. జిగ్నేశ్‌ వ్యాఖ్యతో తీవ్రస్థాయిలో మండిపడిన బిజెపి ఆ పార్టీ మారుమూల గ్రామస్థాయీ నాయకుడితో శాసనసభ్యుడు జిగ్నేశ్‌పై కేసు నమోదుచేయించి తక్షణం అరెస్టు చేయించింది. అసలు జరిగింది ఏమిటంటే, జిగ్నేశ్‌ మేవానీ ట్విట్టర్‌లో గాంధీని
చంపిన గాడ్సేను తీవ్రంగా దుయ్యబట్టారు. అసలు దేశంలో ఉగ్రవాదానికి ఆజ్యం పోసింది గాడ్సేనే, అతగాడే దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది అని ట్వీట్‌ చేశారు. దీంతో మండిపడిన బిజెపి అసోం పార్టీ నేతతో కేసు నమోదు చేయించింది. పశ్చిమ అసోం కోక్రాఝార్‌ జిల్లాకు చెందిన భభానీపూర్‌ గ్రామ బిజెపి నాయకుడు అరూప్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఏప్రిల్‌ 19వ తేదీన కోక్రాఝార్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి గుజరాత్‌ బయలుదేరి వెళ్ళారు. 20వ తేదీ బుధవారం అర్థరాత్రి దాటాక జిగ్నేశ్‌ మేవానీని బనస్కాంథా జిల్లాలోని పలన్‌పూర్‌లో ఉన్న ఒక సర్క్యూట్‌ హౌస్‌ నుండి అరెస్టు చేసి వాయు మార్గంలో అసోం తరలించారు. అయితే జిగ్నేశ్‌ మేవానీ మద్దతు దారుల వాదన ప్రకారం, అసోం నుండి వచ్చిన పోలీసు బృందం వద్ద ఎఫ్‌ఐఆర్‌ (ప్రాథమిక సమాచార నివేదిక పత్రం) కూడా లేదు. ఎలాంటి ఆధారాలు చూపించకుండానే జిగ్నేశ్‌ను అరెస్టుచేసి అంతదూరం తరలించుకుని పోయారని ఆయన మద్దతుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘జాతిపిత గాంధీని చంపినవాడు నేరస్థుడు కాదా? అతడిని భారత రాజ్యాంగం ప్రకారం విచారించి ఉరిశిక్ష అమలు చేయలేదా? అలాంటి నేరస్తుణ్ణి విమర్శిస్తే తప్పేంటి?’ అని ఆయన మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని నిబంధనల ప్రకారం జిగ్నేశ్‌ను అరెస్టు చేసినట్లు అసోం పోలీసు బృందం చెప్పిందని ఆయన మద్దతుదారులు తెలియజేశారు. జిగ్నేశ్‌ను విచారణ నిమిత్తం అసోం న్యాయస్థానం ముందు హాజరుపరుస్తారు. అయితే ఈ విషయంపై వివరణ కోరేందుకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కోక్రాఝార్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ థూబే ప్రతీక్‌ విజయ్‌కుమార్‌ ఫోన్‌ కాల్స్‌ను ఎత్తడం లేదు. ఎంతకీ సమాధానం చెప్పేందుకు ఇష్టపడుతున్నట్టుగా లేదు. అయితే మరో పోలీసు అధికారి మాత్రం మేవానీ అరెస్టుపై వ్యాఖ్యానిస్తూ, మేవానీపై ఫిర్యాదు చేసిన వ్యక్తికి టిట్టర్‌లో మేవానీ పోస్టు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా అనిపించాయని అన్నారు. అయితే మేవానీ ట్వీట్‌ను తరువాత ట్విట్టర్‌ నుండి తొలగించారు కూడా. “నాథూరామ్‌ వినాయక్‌రావు గాడ్సేను ప్రధానమంత్రి నరేంద్రమోడీ దైవంగా పూజిస్తున్నారు,గుజరాత్‌లో మతహింస చెలరేగే అవకాశమున్న ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ప్రజలు సామరస్యంతో వ్యవహరించండి’ అని ట్వీట్‌ చేశారని అసోంలోని భభానీపూర్‌ గ్రామ బిజెపి నాయకుడు అరూప్‌ కుమార్‌ దేవ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది తీవ్ర అభ్యంతరకరమని ఆయన పేర్కొన్నారు. గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో 1980 డిసెంబరు 11వ తేదీన జన్మించిన జిగ్నేశ్‌ మేవానీ గుజరాత్‌ విశ్వవిద్యాలయంలో బిఎ ఎల్‌ఎల్‌బి చదివారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. గుజరాత్‌ రాష్ట్రంలో ప్రముఖ దళిత ఉద్యమ నాయుడు జిగ్నేశ్‌. ఆయన జర్నలిస్టు, రచయిత, సామాజిక కార్యకర్త. పైగా గుజరాత్‌ వద్గామ్‌ ఎస్‌సి నియోజకవర్గం నుండి 2017 నవంబరులో పోటీచేసి 18,000 మెజారిటీతో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. అనేన చైతన్యవంతమైన సామాజిక ఉద్యమాలలో ఆయన పాల్గొంటూ ఉంటారు. ఆయన అనేక సదస్సులలో ప్రముఖ వక్తగా జాతీయ లౌకిక,సామరస్య దృక్పథాన్ని సమర్థిస్తూ మేథో చర్చల్లో పాల్గొంటూ ఉంటారు.
జిగ్నేశ్‌ అరెస్టు అప్రజాస్వామికం
సత్యాన్ని మోడీ జైల్లో దాచలేరు ః రాహుల్‌గాంధీ ఖండన
గుజరాత్‌ యువ దళిత ఉద్యమ నాయకుడు, ఇండిపెండెంట్‌ ఎంఎల్‌ఎ జిగ్నేశ్‌ మేవానీ అరెస్టును కాంగ్రెస్‌పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ గురువారంనాడు తీవ్రంగా ఖండించారు. జిగ్నేశ్‌ అరెస్టు అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. జిగ్నేశ్‌ను తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సత్యాన్ని ఎప్పటికీ జైల్లో దాచిపెట్టి మరుగుపరచలేరని రాహుల్‌గాంధీ విమర్శించారు. జిగ్నేశ్‌ను అరెస్టు చేయడం ద్వారా సత్యాన్ని సమాథిచేసి అసమ్మతిని, అసంతృప్తిని అణచిపెట్టలేరని ఆయన హెచ్చరించారు.జిగ్నేశ్‌ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల వ్యవస్థ ద్వారా ప్రజల ఆమోదంతో ఎన్నికయ్యారని, ఆయన అరెస్టు రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ఇది ఎన్నికల వ్యవస్థకు,ప్రజాప్రతినిధులకు తలవంపులు కలిగించే విషయమని ఆయన మండిపడ్డారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments