ఐదు అసెంబ్లీల్లో మూడింటిలో గెలుపు
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో గెలుపు, మధ్యప్రదేశ్‌లో హోరాహోరి
న్యూఢిల్లీ: రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని బిజెపి నుంచి కాంగ్రెస్ కైవసం చేసుకోనుంది. కాగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ స్వల్పంగా ముందంజలో ఉంది. ఇక తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్) మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంది. మిజోరంలో కాంగ్రెస్‌ను ఎంఎన్‌ఎఫ్ అధికారం నుంచి దించేసింది. ఛత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్లపాటు నిరాటంకంగా పాలన కొనసాగించిన ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పాలనకు కాంగ్రెస్ చెక్ పెట్టింది. రాజస్థాన్‌లో 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 25 సీట్లను గెలుచుకున్న బిజెపి నుంచి అధికారాన్ని కైవసం చేసుకోబోతోంది. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో పేలవ పనితీరును కనబరిచినందుకు ఓటమి బాధ్యతను తీసుకుంటూ రమణ్ సింగ్ రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారు. ఆయన రాయ్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘మేము(పార్టీ) కూచుని వైఫల్యానికి ఆత్మపరిశీలన చేసుకుంటాం’ అన్నారు. ఛత్తీస్‌గఢ్ 90 అసెంబ్లీ స్థా నాల్లో 89 సీట్లకు తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ 64 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బిజెపి 18 స్థానాలతో రెండో స్థానంలో ఉంది. సెమీ-ఫైనల్స్‌గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని 230 స్థానాల్లో కాంగ్రెస్ సెంచరీ మార్క్‌ను దాటింది. బిజెపికి 109 సీట్లు దక్కగా, కాంగ్రెస్ 113 సీట్లతో ఆధిక్యంలో ఉంది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ అధికార వ్యతిరేకతను(యాంటీ ఇన్‌కంబెన్సీ) ప్రజల నుంచి ఎదుర్కొంటున్నారు. ఆయనైతే బుధ్నీ సీటు గెలిచారు. కానీ డజన్ల కొద్దీ మంత్రులు కాంగ్రెస్ అభ్యర్థుల కన్నా వెనుకబడి ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో ప్రజలు మార్పును కోరుకొంటున్నారనే విషయాన్ని ఎనికల ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. కాగా రాష్ట్రంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్థామన్న ధీమాను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ వెల్లిబుచ్చారు. ‘రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ విజయపథంలో కొనసాగుతోందని ట్రెండ్ సూచిస్తోంది’ అని కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలెట్ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి ప్రభుత్వంలోని ఐదుగురు మంత్రు లు- బ్రిజ్‌మోహన్ అగ్రావాల్(దక్షిణ రాయ్‌పూర్ సిటీ), కేదార్ కశ్యప్ (నారాయణ్‌పూర్ నియోజకవర్గం), మహేశ్ గగ్డా(బీజాపూర్), దయాళ్ దాస్ బాఘేల్(నవాగఢ్), అమలర్ అగ్రావల్(బీజాపూర్) వెనుకంజలో ఉన్నారు. ఐదు స్థానాల్లో మాజీ ముఖ్యమంత్రి అజీత్ జోగికి చెందిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్(జె) ముందంజలో ఉంది. కాగా సిపిఐ, గోండ్వానా గణతంత్ర పార్టీ, సిపిఐ(ఎం) పార్టీలు ఒక్కో సీటులో ఆధిక్యంలో ఉన్నాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్ మ్యాజి క్ సంఖ్య 100 దిశలో కదులుతోంది. 22 సీట్లు గెలుచుకోగా, 78 సీట్లలో ఆధిక్యతలో ఉంది. 20 ఏళ్ల సాంప్రదాయం ప్రకారం బిజెపి, కాంగ్రెస్ మార్చిమార్చి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు గెలుస్తున్నాయి. అధికారంలో ఉన్న బిజెపి మొత్తం 199 సీట్ల లో 15 గెలుచుకుంది. 58 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ గత అసెంబ్లీ లో బిజెపికి 163, కాంగ్రెస్‌కు 21 సీట్లు ఉండేవి. స్వతంత్ర అభ్యర్థులు మూడు గెలుచుకోగా, తొమ్మిదింటిలో ఆధిక్యంలో ఉన్నా రు. రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం 200 సీట్లున్నాయి. కానీ ఈసారి బిఎస్‌పి అభ్యర్థి మరణం కారణంగా అల్వార్‌కు చెందిన రామ్‌గఢ్ నియోజకవర్గంలో ఎన్నికలను వాయిదా వేశారు. రాజస్థాన్‌కు ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయించడానికి కాంగ్రెస్ జైపూర్‌లో లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని నిర్వహించనున్నది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని సంప్రదించాకే ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటించనున్నారు. కాగా సిఎం పోస్ట్‌కు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ ఫ్రంట్న్న్రర్‌లుగా ఉన్నారు. తెలంగాణలో కెసిఆర్ టిఆర్‌ఎస్ పార్టీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. గణనీయ మెజారిటీతో టిఆర్‌ఎస్ గెలుపొందింది. గజ్వేల్ నుంచి కెసిఆర్ 51 వేల ఆధిక్యతతో గెలుపొందారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి వి ప్రతాప్ రెడ్డిని ఓడించారు. కెసిఆర్ కుమారుడు కెటి రామారావు, మేనల్లుడు టి హరీశ్ రావు గెలుపొందారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు 88సీట్లు, కాంగ్రెస్‌కు 19సీట్లు, టిడిపికి 2 సీట్లు, ఎఐఎఎంకు 7 సీట్లు, బిజెపికి 1 సీటు, ఇతరులకు 2 సీట్లు దక్కాయి. ‘అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నాను’ అని ముఖ్యమంత్రి కెసిఆర్ విలేకరులతో అన్నారు. మిజోరంలోని 40 సీట్లలో మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్) 26 సీట్లు కైవసం చే సుకుని సాధారణ మెజారిటీని సాధించింది. దాంతో ఐదు సీట్లు గెలుచుకు న్న కాంగ్రెస్‌ను అధికారం నుంచి దింపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చే యబోతోంది. మిజోరం ముఖ్యమం త్రి, కాంగ్రెస్ అభ్యర్థి లాల్ థన్‌వాలా తన సొంత నియోజకవర్గం సర్చిప్, దక్షిణ ఛంఫై సీట్లను ఓడిపోయారు. ఈ ఓటమితో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికార ఉనికి లేకుండా పోయింది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపుకు సారథ్యం వహించిన రాహు ల్ గాంధీని కీర్తిస్తూ, పార్టీ జెండాలు పట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సంబరాలు చేసుకుంటుండగా, ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయం నిర్మానుషంగా కనిపించింది.