లేకుంటే కరెంట్ కట్!
తరలింపు బాధ్యత సిఎస్ ఎస్‌కె జోషికి అప్పగింత
ప్రజాపక్షం/హైదరాబాద్: వారం రోజుల్లో సచివాలయం పూర్తి స్థాయిలో తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు సిఎస్ ఎస్‌కె జోషికి డెడ్‌లైన్ విధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 7వ తేదీ కల్లా ఖాళీ చేసి తీరాల్సిందేనంటూ ఖరాఖండిగా తెగేసి చెప్పింది. మాట వినని శాఖల పట్ల కఠినంగా ఉండాలని, అవసరమైతే కరెంటు కట్ చేయించి అక్కడి నుండి వారంతట వారే త్వరగా వెళ్లి పోయేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషిని ఆదేశించినట్లు అత్యంత విస్వసనీయంగా తెలిసింది. ఖాళీ చేయించే బాధ్యతను సిఎస్ ఎస్‌కే జోషికే అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన బిఆర్‌కే భవన్ నుండి పాత సచివాలయానికి, అక్కడి నుండి బిఆర్‌కే భవన్‌కు చక్కర్లు కొడుతున్నారు. పాత సచివాలయంలో ఇటీవలే ఆయన కొన్ని సమీక్షా సమావేశాలు నిర్వహించడంతో ఇతర శాఖలు తరలి పోకుండా ఉండి పోయాయి. సచివాలయం ఖాళీ చేస్తేనే తప్ప కూల్చే పనులు ముందుకు సాగవని, ఎలాగోలా ఖాళీ చేయించాలని ప్రభుత్వం సిఎస్‌కు తెలిపినట్లు సమాచారం. ప్రధాన విభాగాలైన సాధారణ పరిపాలన శాఖ (జిఏడి), రెవెన్యూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం, ఐటి, పరిశ్రమలు తదితర శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేసే బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఇంకా కార్యాలయాల మరమ్మత్తు పనులు కొనసాగుతూనే ఉండడంతో ఖాళీ చేసేందుకు ఆయా శాఖలు ససేమిరా అంటున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి కేటాయించిన తొమ్మిదో అంతస్తులో కూడా విజిటర్స్ గ్యాలరీ, మీటింగ్ హాల్స్ , టాయిలెట్స్ తదితరాలకు బిఆర్‌కే భవన్లో మరమ్మత్తు పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇదే భవనంలోకి మారుతున్న ముఖ్యమంత్రి కార్యాలయ ఫిర్యాదుల విభాగానికి కేటాయించిన ఛాంబర్ల పనులు కూడా నెమ్మదిగానే సాగుతున్నాయి. ఇక వివిధ శాఖల కార్యదర్శులకు కేటాయించిన కార్యాలయాలు సిద్దమవుతున్నప్పటికీ , ఉద్యోగులు, సిబ్బందికి అవసరాల మేరకు ఏర్పాట్లు పూర్తి కాక పోవడంతో విధులు ఏ విధంగా నిర్వహించాలన్న సంశయం వ్యక్తం అవుతోంది. రెవెన్యూశాఖకు, ఆర్థిక శాఖకు కూడా బిఆర్‌కే భవనంలో కార్యాలయాలు కేటాయించినా మరి కొంత కాలం వరకు ప్రస్తుత సచివాలయం నుండే తమ కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.