రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
ప్రజాపక్షం/హైదరాబాద్
సచివాలయం భవనాల కూల్చివేత పనులపై రోజువారీగా ప్రభుత్వం ప్రకటన ఎందుకు విడుదల చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. అంతా గోప్యంగా ఉంచితే సెక్రటేరియట్లో లోపల ఏదో జరుగుతోందనే అనుమానానికి ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడింది. ప్రభుత్వం రహస్యంగా ఎందుకు ఉంటుందోగానీ దీని ఫలితంగా అనుమానాలకు ఆస్కారం ఏర్పడుతుందని వ్యాఖ్యానించింది. సెక్రటేరియట్ భవనాల కూల్చివేత పనులను కవరేజీ చేసేందుకు పత్రికలు, టీవీ చానళ్లకు అనుమతి ఇస్తే వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడేందుకు వీలుగా విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ఎజి బిఎస్ ప్రసాద్ చేసిన వినతిని తోసిపుచ్చింది. శుక్రవారమే ప్రభుత్వ విధానం చెప్పాలని ఆదేశించింది. సెక్రటేరియట్‌లోకి మీడియాను అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం ప్రతికా స్వేచ్ఛను దెబ్బతీయడమేనని విల్ మీడియా తరఫున బ్యూరో చీఫ్ సంపత్ దాఖలు చేసిన రిట్‌ను గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం విచారణ జరిపారు. 95 శాతం పనులు అయ్యాయని, ఎవరినీ అనుమతి ఇచ్చినా ప్రమాదం జరిగినందుకు వీలుంటుందని, అం దుకే ఆంక్షలు పెట్టామని ఎజి బిఎస్ ప్రసాద్ చెప్పారు. సోమవారం వరకు గడువు ఇవ్వాలన్నారు. దీనితో పిటిషనర్ లాయర్ నవీన్‌కుమార్ వ్యతిరేకించారు. ఇప్పటికే 95 శాతం పనులు జరిగాయని చెప్పే ప్రభుత్వం సోమవారానికి పూర్తిగా కూల్చేస్తుందని, ఈలోగా మీడియా వెళ్లేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇది ప్రభుత్వ వ్యవహారమో ప్రైవేట్ వ్యవహారమో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ఇందుకు ఎజి అభ్యంతరం చెప్పడాన్ని నవీన్ వ్యతికించారు. పౌర, పత్రికల హక్కులకు భంగం వాటిల్లే కేసుల్లో రిట్లో లేని అంశాల్లోకి వెళ్లవచ్చునని గట్టిగా చెప్పారు. వాదనల అనంతరం ప్రభుత్వ వైఖరిని వెల్లడించే నిమిత్తం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
సచివాలయం కూల్చివేతపైరోజువారి ప్రకటనలేవీ?
RELATED ARTICLES