డిసెంబర్ జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ పెంచటానికి ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న చర్యలు మంచివే. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్, కమిషనర్ అశోక్ లావాసా, సునీల్ అరోరా సమేతంగా అధికారుల బృందంతో హైదరాబాద్ వచ్చి జిల్లా ఎన్నికల అధికారులతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను సవివరంగా సమీక్షించారు. కమిషన్ అధికారులు మరోసారి వస్తారని కూడా చెప్పారు. అంతకుముందు ప్రత్యేకించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడా సమావేశమైనారు. ఓటర్ల జాబితాల్లో అక్రమ ఎంట్రీలు, తొలగింపులపై చేసిన ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేసినా ఇంకా అనేక లోపాలు కొనసాగుతున్నట్లు రాజకీయ పార్టీల ప్రతినిధుల్లో కొందరు ఫిర్యాదు చేశారు. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాల్సిందిగా రావత్ అధికారులను కోరారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ మురికివాడలు, మారుమూల ప్రాంతాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందిగా ఆయన ఎన్నికల అధికారులను కోరారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ దివ్యాంగులు, వృద్ధులు ఓటు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయటంతోపాటు మహిళా ఓటర్లకు ఆకర్షణగా గ్రేటర్ హైదరాబాద్ 23 నియోజకవర్గాల్లో ‘సఖి’ పేరిట నియోజకవర్గానికొక ప్రత్యేక పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తోంది. సిబ్బంది కూడా అందరూ మహిళలే ఉంటారు. ఆ బూత్ గులాబీరంగుతో సర్వాంగసుందరంగా అలంకరిం చాలని నిర్ణయించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని అమలు జరిపారు. అయితే తెలంగాణలో పాలకపార్టీ అయిన తెలంగాణ రాష్ట్రసమితి పతాకం, ప్రచార సామాగ్రి అంతా గులాబీరంగులో మునిగి ఉందని గ్రహించకపోవటం అధికారుల మెకానికల్ దృష్టికి నిదర్శనం. గుడ్డిగా గులాబీ రంగునే ‘సఖి’ బూత్ ఉపయోగిస్తే అది అధికార పార్టీకి తోడ్పడినట్లు నిందమోయాల్సి వస్తుంది, పక్షపాతాన్ని మూటగట్టుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఎన్నికల కమిషన్ వెంటనే పునరాలోచించాలి. ఏ ఒక్క రాజకీయ పార్టీనీ గుర్తుకు తేని రంగును ఎంచుకోవాలి. ఓటర్లు స్వేచ్ఛగా, ప్రశాంత చిత్తంతో ఓటుహక్కు వినియోగించుకునేటట్లు చేయటం ఎన్నికల కమిషన్ విధి అయనప్పుడు ‘సఖి’ బూత్ గులాబీరంగు వాడటం హేతువిరుద్ధమవుతుంది.
‘సఖి’కి టిఆర్ రంగునా?
RELATED ARTICLES