మాజీ ప్రధాని శతజయంతి ఉత్సవాల ప్రారంభ సభలో ప్రణబ్‌ముఖర్జీ
సంస్కరణల అసలైన పితామహుడు : మన్మోహన్‌సింగ్
భారతదేశ గొప్ప పుత్రుడు : చిదంబరం
పి.వి. శతజయంతి ఎవరు చేసినా అభ్యంతరం లేదు : ఉత్తమ్
జాతీయస్థాయిలో శతజయంతి చేయాలి : పి.వి.సోదరుడు మనోహర్‌రావు
ప్రజాపక్షం / హైదరాబాద్ ఎఐసిసి మాజీ అధ్యక్షులు, దేశ మాజీప్రధాని పి.వి.నరసింహారవు శతజయంతి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఘనంగా ప్రారంభించింది. ఏడాది పాటు జరిగే ఈ ఉత్సవాలను పి.వి. ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకు నాందీ పలుకు తూ 1991 జూలై 24న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తేదీ నాడే ప్రారంభించారు. గాంధీభవన్‌లో టిపిసిసి పి.వి. శతజయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో గాంధీభవన్ వేదికగా జరిగిన ప్రారంభోత్సవ సభలో ఆన్‌లైన్ ద్వారా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం, కేంద్ర మాజీమంత్రి జైరామ్ రమేశ్, టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పి.వి. సోదరుడు పి.వి.మనోహర్‌రావులు ప్రసంగించారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తమ సందేశాలను పంపారు. తొలుత ప్రణబ్‌ముఖర్జీ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత పరిపాలనలో, ఆర్థిక రంగంలో మార్పులు తీసుకొచ్చిన రెండవ ప్రధాని పి.వి.నరసింహారావు అని ప్రశంసించారు. అత్యంత క్లిష్ట సమయంలో దేశ ప్రధానిగా పి.వి.నరసింహారావు బాధ్యతలు చేపట్టారని, అప్పటికీ దేశ విదేశీ మారక నిల్వలు వంద కోట్ల డాలర్లు మాత్రమేనని, ఆ సమయంలో దేశం రాజకీయ అస్థిరతతో కూడా ఉన్నదని, కానీ విజయవంతంగా వాటిని అధిగమించారన్నారు. 1970లో పి.వి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి తమ మధ్య స్నేహం ఉండేదన్నారు.ఆయన కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా నిర్ణయం తీసుకునేవారని, ఆలస్యం చేయడమో ఓ నిర్ణయంగా మారేదని, దేశంలో విజయవంతమైన ప్రధానమంత్రిలో పివి ఒకరు అని అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ భారత దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు పి.వి.అని అన్నారు. ఆయన క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టడం తనకు సంతోషంగా ఉన్నదన్నారు. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉండగా ప్రధాని పగ్గాలు చేపట్టిన పి.వి. అత్యంత సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకున్నారని, తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని, తమ తొలి బడ్జెట్ దేశంలో అనేక దిశల్లో పెనుమార్పులకు దోహదపడిందని తెలిపారు. కేవలం ఆర్థిక రంగంలోనే కాకుండా విదేశాంగ విధానంలో లుక్ ఈస్ట్ పాలసీతో చైనా సహా పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పారన్నారు. పి.వి.నరసింహారావు తనకు మితృడు, మార్గదర్శి అని మన్మోహన్ సింగ్ అన్నారు. తాను యూత్ కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుండి పిసిసి, ఎఐసిసి స్థాయికి వచ్చేంత వరకు పి.వి.నరసింహారావు ప్రోత్సహించారని, తన క్యాబినెట్‌లో మంత్రిగా కూడా తీసుకున్నాని చిదంబరం గుర్తు చేసుకున్నారు. ఆయన భారత దేశ మహోన్నత పుత్రుడు అని అన్నారు. తాను కేంద్ర మంత్రిగా 1991 జులై 25న ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడంతో పాటు నూతన పారిశ్రామిక విధానాన్ని కూడా తీసుకువచ్చారని, ఇవి రెండు కీలక మలుపులని తెలిపారు. పి.వి. సరైన వ్యక్తులను ఎంపిక చేసుకునేవారని, వారిని ప్రోత్సహించడమే కాకుండా వారిపై పూర్తి విశ్వాసంగా ఉండేవారన్నారు. అప్పటి వరకు 45 ఏళ్ల వరకు కొనసాగుతున్న నెహ్రూ సోషలిస్టు విధానాల నుండి పక్కకు జరిగి సరళీకరణకు బాటలు వేశారని, ఇదే విషయాన్ని ఎవరైనా ప్రస్తావిస్తే తన విధానమేమీ మారలేదని, దేశ పరిస్థితులే మారాయని, వాటికనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నామని చెప్పేవారన్నారు. పి.వి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దక్షిణ భారతదేశ పుత్రుడే కాదని, భారతదేశ గొప్ప పుత్రుడు అని చిదంబరం కొనియాడారు. తనకు పి.వి. ప్రధాని కావడానికి కొంత కాలం నుండి పరిచయమని, ఆయనకు రూపాయి విలువ తగ్గించడం, సంస్కరణలు పట్ల అయిష్టత ఉన్నప్పటికీ, తాను నమ్మి బాధ్యతలు అప్పగించిన ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్, ఆర్‌బిఐ గవర్నర్ రంగరాజన్‌ల మాటపై వాటిని అనుమతించారని తెలిపారు. దేశానికి పి.వి. చేసిన అత్యుత్తమ మేలులో మన్మోహన్‌సింగ్ వంటి ఆర్థికవేత్తను ఆర్థిక మంత్రి చేయడమని చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పివి. వంగరలో ఓ సామాన్య కార్యకర్తగా పని చేసి, ఎఐసిసి అధ్యక్షుడిగా, ప్రధాని స్థాయికి ఎదిగారని తెలిపారు. పివి పుట్టుక నుండి చనిపోయే వరకు కాంగ్రెస్ వాది అన్నారు. తాను రాజకీయాలు చేయదలుచుకోలేదని, పి.వి. శతజయంతి ఎవరు చేసినా తమకు అభ్యంతరం లేదని, తాము ఏడాది పాటు ఈ ఉత్సవాలు చేస్తామన్నారు. పి.వి.సోదరుడు మనోహర్‌రావు మాట్లాడుతూ పి.వి. దేశానికి చెందిన వ్యక్తి అని, ఆయన జయంతి వేడుకలను కేవలం తెలంగాణ కమిటీ నుండి కాకుండా జాతీయ స్థాయిలో చేసే విషయాన్ని ఢిల్లీ పెద్దలు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. సిఎల్‌పి నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ మనీ, మజిల్ పవర్ లేకుండా దక్షిణాది నుండి దేశాన్ని విజయవంతంగా పరిపాలించిన ఘనత పి.వి.నరసింహారావుదని, అలాంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించిందన్నారు. వి.హనుమంతరావు మాట్లాడుతూ అగ్రకులానికి చెందినప్పటికీ బడుగు బలహీనవర్గాలను ప్రోత్సహించిన ఏకైక నేత పి.వి. అని చెప్పారు. పివి శత జయంతి కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ జె.గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో వైస్ చైర్మెన్ శ్రీధర్ బాబు, కన్వీనర్ మహేష్ గౌడ్, ముఖ్య నాయకులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, దాసోజు శ్రవణ్, అనిల్ యాదవ్, మ ల్లు రవి, రుద్ర రాజు, వేణుగోపాల్ , సిజె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సక్సెస్ ప్రధానుల్లో పి.వి. ఒకరు
RELATED ARTICLES