ఉచితాలను వ్యతిరేకించేవారు.. కార్పొరేట్లకు దోచిపెట్టే విషయంపై స్పందించాలి
మహబూబాబాద్ జిల్లా సిపిఐ రెండవ మహాసభలో పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ
ప్రజాపక్షం/ మహబూబాబాద్ రాష్ట్ర విభనజన చట్టంలో పొందు పరిచిన హామీలను సాధించి తీరుతామని, ప్రభుత్వాల ముక్కు పిండైనా అమలు చేపిస్తామని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా సిపిఐ రెండవ మహాసభలు జరిగాయి. అంత కు ముందు స్థానిక బతుకమ్మ ఘాట్ నుండి సభా స్థలి వద్దకు భారీ ర్యాలీగా వెళ్లారు. సభలకు ముఖ్యమంత్రి అతిథిగా హాజరైన నారాయణ మాట్లాడుతూ మహాసభ అంటే డ్యాన్సు లు వేసి పాటలు పాడుకోవడం కాదని, ముఖ్యమైన తీర్మానాలు చేసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకొని దానిని సాధించే దిశగా ముందుకు సాగడమన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను బిజె పి ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని, కానీ కమ్యూనిస్టుల పోరాటం నిరంతరాయంగా సాగుతుందని, హామీలను అమలు జరిపేలా తమ పోరాటాలు ఉంటాయన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకునే ప్రభుత్వానికి బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గురించి పట్టించుకుంటారా? దాని విలువ ఎలా తెలుస్తుందని అన్నారు. సింగరేణిని సైతం అమ్మాలని చూస్తే కమ్యూనిస్టులు, యూనియన్‌లు అడ్డుపడడంతో ఆగారని, లాభాల్లో ఉన్న ఎల్‌ఐసిని అమ్ముకున్నారని, దేశాన్ని అమ్ముకుని కార్పొరేట్లకు దోచి పెట్టడమే బిజేపి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోందని తెలిపారు. కార్పొరేట్లకు పన్నుల్లో రాయితీ కల్పించి సామాన్యునిపై పన్నుల భారం మోపుతూ.. వారు తినే తిండి నుండి స్మశానం ఖర్చులలో సైతం జిఎస్‌టి విధిస్తున్న ప్రభుత్వంగా బిజెపి సర్కార్ చరిత్రలో నిలిచిపోతుందని విమర్శించారు. జిఎస్‌టిలో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను ఎగనాం వేస్తున్నా టిఆర్‌ఎస్ ప్రభుత్వం జిఎస్‌టి వాటాలపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలకు తిలోదకాలు ఇచ్చే దిశగా బిజెపి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఉచితాల పేరుతో ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలను అడ్డుకోవాలని చూస్తున్న కేంద్రం.. సుమారు రూ. 20 లక్షల కోట్లు ఎగ్గొట్టిన కార్పొరేట్ దొంగల విషయమై ఎందుకు ప్రస్తావించడం లేదని, వారికి రూ. 10 లక్షల కోట్లు రుణ మాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో చూసినా డ్రగ్స్ రాకెట్‌లు దొరుకుతున్నాయని, డ్రగ్స్ స్మగ్లింగ్ మూల కర్త అదానీనేనని, అలాంటి అదానీపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం బాసరలో ట్రిపుల్ ఐటి ఏర్పాటు చేసి, విద్యార్థులకు కనీస వసతులు ఏర్పాటు చేయడంలో విఫలమైందని, సరైన ఆహారం, మరుగుదొడ్లు సైతం ఏర్పాటు చేయలేని ప్రభుత్వం ఎందుకన్నారు.
మానుకోట కమ్యూనిస్టులు మరోమారు గర్జించాలి : విజయ సారథి
తెలంగాణ ఉద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర మరవలేనిదని, జిల్లా సాధనలో సైతం కమ్యూనిస్టుల పోరాటాలు చిరస్థాయిలో నిలిచిపోతాయని సిపిఐ జిల్లా కార్యదిర్శ విజయ సారథి అన్నారు. 1994లో ఎమ్మెల్యేని గెలిపించుకున్నామని, ఆ తరువాత పలు పార్టీలు కమ్యూనిస్టులను ఎదగనీయకుండా చేస్తున్నాయని, ఆ పార్టీలకు బుద్ధి చెబుతూ జిల్లాలో పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూసంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదిర్శివర్గ సభ్యులు తక్కెల్లపల్లి శ్రీనివాసరావు, మహబూబాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్, పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్, సిపిఐ నాయకులు నల్లు సుధాకర్ రెడిడ, కట్టెబోయిన శ్రీనివాస్, కళాకారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంస్థలను అమ్ముకునే కేంద్రానికి.. బయ్యారం ఉక్కు విలువేం తెలుసు?
RELATED ARTICLES