ఎఐటియుసి జాతీయ మహాసభలో యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్.బాల్‌రాజ్
గురుదాస్ దాస్ గుప్తానగర్ (అలప్పుళా, కేరళ) నుంచి డి. సోమసుందర్
అసంఘటిత, సంఘటిత రంగ కార్మికులను సం ఘటితం చేసి పోరాటాలను ఉధృతం చేయడం ద్వారానే కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఓడించగలమని ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్.బాల్‌రాజ్ అన్నారు. కేరళ రాష్ట్రంలోని గురుదాస్ దాస్ గుప్తా నగర్ (అలప్పుళా)లో జరుగుతున్న ఎఐటియుసి జాతీ య 42వ మహాసభలలో ప్రధానకార్యదర్శి నివేదికపై జరిగిన చర్చలో తెలంగాణ రాష్ట్రం తరపున బాల్‌రాజ్ మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, మానిటైజేషన్ పేరుతో బిజెపి ప్రభు త్వం కొనసాగిస్తున్న విధానాలను ప్రతిఘటించే పోరాటాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉం దని ఆయన అన్నారు. కార్మికుల హక్కులు, ప్రయోజనాలకు సంబంధించిన 29 చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చడం దుర్మార్గమని ఆయన అన్నారు. కేరళ రాష్ట్రంలో ప్రజాపంపిణీ ద్వారా 29 సరుకులు పంపిణీచేస్తుంటే , కేంద్రం బియ్యం మాత్రమే ఇవ్వడం దారుణమని బాల్ రాజ్ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందు కోసం ఎఐటియుసి పటిష్టమైన ఉద్యమం చేపట్టాలని అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో హమాలీల కూలీరేట్లు పెంచాలని తమ రాష్ట్రంలో హమాలీలు గత ఐదురోజులుగా సమ్మె చేస్తున్నారని వివరించారు. కార్మిక సంఘాలు సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తున్నా, కార్మిక వ్యతిరేక బూర్జువా పార్టీలే అధికారంలోకి వస్తున్నాయని దీనిపై ఆలోచించాలని సూచించారు. రాష్ట్రంలో కార్మికోద్యమం పటిష్టం చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తెలంగాణ రాష్ట్ర మహాసభలు విజయవంతంగా జరిగాయని, మహాసభ సందర్భంగా పదివేల మంది కార్మికులతో భారీర్యాలీ నిర్వహించామని మహాసభకు నివేదించారు. తెలంగాణ రాష్ట్రంలో 1.20 లక్షల సభ్యత్వానికి, 320 సంఘాలకు ప్రాతినిథ్యం వహిస్తూ 130 మంది ప్రతినిధులు జాతీయ మహాసభకు హాజరయ్యామన్నారు. చర్చలో ఎఐటియుసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్ పాల్గొం టూ ఎపిలో యూనియన్ విస్తృతికి విశేషకృషి చేస్తున్నామని, గతంలో పట్టణ ప్రాంతాలకు, పరిశ్రమలకు పరిమితమై ఉండేదని, ప్రస్తుతం ప్రతి గ్రామంలో స్కీమ్ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు , ఆటో డ్రైవర్లు, ఇంకా వివిధ రంగాలకు చెందిన కార్మికులు ఉన్నారని, వారిని సంఘాలలో చేర్పించడంపై దృష్టి పెట్టామని వివరించారు.
యూనియన్లను అనుమతించేందుకు తెలంగాణ ప్రభుత్వంపై వత్తిడి తేవాలి
ఎఐటియుసి జాతీయ మహాసభలో కె.రాజిరెడ్డి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ఆర్టిసి)లో కార్మికవర్గానికి ప్రతినిధులుగా యూనియన్లను అనుమతించే విధంగా తెలంగాణ ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని టిఎస్ఆర్టిసి ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి అన్నారు. ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారం సంస్థలు, పరిశ్రమలలో యూనియన్లు పనిచేయడానికి అనుమతించబడతాయని, అది కార్మికుల హక్కు అని ఆయన అన్నారు. ఆర్టిసిలో కార్మికవర్గం హక్కులను టిఆర్ఎస్ ప్రభుత్వం హస్తగతం చేసుకుందని విమర్శించారు. యూనియన్ ఎన్నికలను నిర్వహించడానికి, డిసిప్లేన్ కోడ్‌ను కూడా పాటించడానికి ప్రభుత్వం కార్మిక కమిషనర్‌కు తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఎఐటియుసి జాతీయ మహాసభలో రాజిరెడ్డి ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను సభ ఆమోదించింది. టిఎస్ఆర్టిసికి వస్తున్న నష్టాలను తగ్గించడమే కాకుండా సమర్థవంతంగా పనిచేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వేలతో సమానంగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ పన్ను, వ్యాట్‌ను తగ్గించాల ని తన తీర్మానంలో డిమాండ్ చేశారు. డీజిల్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం రైల్వేలకు 4 శాతం వసూలు చేస్తోండగా, ఆర్టిసి వంటి రాష్ట్ర రవాణా సంస్థలకు లీటరుకు రూ.19.90 లు వసూలు చేస్తోందని, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ వినియోగంపై లీటరుకు రూ.27లు వసూలు చేయడం అన్యాయమన్నారు. బస్సులను అద్దెకు తీసుకోవడానికి బదులుగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేలా ఆర్టిసిలకు వెసులుబాటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సంఘాల పటిష్టత…పోరాటాల ఉధృతి
RELATED ARTICLES