విపక్షాల అభిప్రాయాలు చాలా ముఖ్యం : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : ప్రతిపక్షాలు తమ సంఖ్యాబలం గురించి మర్చిపోవాలని, ప్రజాస్వామ్యంలో విపక్షాల అభిప్రాయాలు చాలా ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. లోక్‌సభ సమావేశాలకు ముందు ఆయన పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతల ప్రతి మాట విలువైనదే అని ఆయన చెప్పారు. ఎలాంటి సంఘర్షణ లేకుండా, ప్రజాధనం వృథా కాకుండా సభ లో అర్థవంతమైన చర్చలు జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరారు. ‘ఈ రోజు మరో కొత్త సభ ప్రారంభం కానుంది. 17వ లోక్‌సభ అనుభ వం, నవతరం సభ్యులతో కొలువుదీరింది. ఉత్సాహవంతులైన కొత్త సభ్యులు సభకు వచ్చారు. స్వాతంత్య్రం తర్వాత తొలిసారిగా అత్యధిక సంఖ్యలో మహిళా ఎంపిలు లోక్‌సభలో ఉన్నారు. చాలా దశాబ్దాల తర్వాత ఓ ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఈ దేశానికి సేవ చేసేందుకు ప్రజలు మరోసారి మాకు అవకాశం ఇచ్చారు. అలాంటి ప్రజల సంక్షేమం కోసం ప్రతి అందరం కలిసి పనిచేద్దాం. ప్రజా ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని కోరుతున్నా’.‘ప్రజాస్వామ్యంలో చురుకైన ప్రతిపక్షాల పాత్ర చాలా కీలకమైనది. విపక్ష పార్టీలు తమ సంఖ్యా బలం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.వారి అభిప్రాయాలను, భావాలను మేం గౌరవిస్తాం.సభాసమావేశా ల్లో ప్రతిపక్షాలు చురుగ్గా పాల్గొంటాయని, అర్థవంతమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నా. స్వపక్షం, విపక్షం అనేది మరచి ప్రజా సంక్షేమం కో సం ప్రతి ఒక్కరం నిష్పక్షపాతంగా పనిచేద్దాం’అని మోదీ విపక్షాలకు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 542 స్థానాలకు గానూ బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ 353 స్థానాలు గెలుచుకున్న సం గతి తెలిసిందే. కాంగ్రెస్ సహా దాని మిత్రపక్షాలు 92 సీట్లు దక్కించుకున్నాయి.