మానవ జాతి సమస్యలపై నిరంతరం స్పందించే గొప్ప విధానమే కమ్యూనిజం
బిజెపి మరోసారి దేశంలో అధికారంలోకి వస్తే…
రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజం పదాలు మాయం
బద్దం ఎల్లారెడ్డి 44వ వర్థంతి సభలో వినోద్ కుమార్
ప్రజాపక్షం / రాజన్న సిరిసిల్ల ప్రతినిధి
దేశాన్ని మతోన్మాద దేశంగా మారుస్తున్న బిజెపి మరోసారి దేశంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని పీఠిక నుంచి సెక్యులరిజం, సోషలిజం పదాలు మాయం అవుతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిజం అనేది నిరంతరం మానవజాతి సమస్యలపై స్పందించే గొప్ప విధానమని, అనేక మంది మేధావులు మేధస్సుకు పదునుపెట్టి మానవజాతిని దోపిడీ నుంచి విముక్తి చేసేందుకు తీసుకువచ్చిన గొప్ప సిద్ధాంతమే మార్క్సిజం అని ఆయన అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు, కరీంనగర్ జిల్లా మొదటి పార్లమెంట్ సభ్యులు బద్దం ఎల్లారెడ్డి 44వ వర్ధంతి సభ మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక
కళ్యాణ మండపంలో జరిగింది. సభలో బోయినపల్లి వినోద్ కుమార్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎంఎల్‌ఎ రసమయి బాలకిషన్, ప్రజా గాయకురాలు విమలక్క తదితరులు ప్రసంగించారు. సభకు సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణు అధ్యక్షత వహించారు. సభలో వినోద్ కుమార్ ప్రసంగిస్తూ వామపక్ష నాయకులు బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి అనేక మంది పోరాటాల వల్లనే దేశంలో, రాష్ట్రంలో వివిధ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలకు కారణం కమ్యూనిస్టుల పోరాటాలేనని, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించలేక పోతే ప్రజలు ఎక్కడ తిరగబడతారో అనే అభద్రత ఆయా ప్రభుత్వాలలో కలగడం వల్లనే సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. ఎవరికైనా అధికారం ముఖ్యం కాదని, వ్యవస్థ ధ్వంసం కావొద్దు అని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో కుహనా దేశభక్తులు ప్రమాదకరంగా మారారని, అలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అందులో ముఖ్యంగా బిజెపి అనుసరిస్తున్న విధానాలు దేశానికి ప్రమాదకరంగా మారాయని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్న భారతదేశంలో కులాలు, మతాల పేరిట దేశభక్తి పేరిట విభజించు పాలించు పద్ధతిని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో నయాభారత్ నిర్మాణం కోసం అడుగులు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లాకు బద్దం ఎల్లారెడ్డి పేరు పెట్టాలి
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు బద్దం ఎల్లారెడ్డి పేరును కరీంనగర్ జిల్లాకు పెట్టాలని పలువురు కమ్యూనిస్టు నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితోనే నేటి తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని వారు పేర్కొన్నారు. చాడ వెంకట్ రెడ్డి మాట్లాడూతూ పేద ప్రజలను శిస్తుల పేరుతో దోపిడీ చేస్తున్న వెట్టిచాకిరి బానిసత్వాన్ని తరిమేందుకు నిజాం పాలకులను గడగడలాడించిన గొప్ప పోరాటయోధుడు బద్దం ఎల్లారెడ్డి అన్నారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ 1947 సెప్టెంబర్ 11 వ తేదీన తుపాకులు పట్టండని, వెట్టి చాకిరి నుండి విముక్తి కావాలని పిలుపునిచ్చిన వారిలో బద్దం ఎల్లారెడ్డి ఒకరని అన్నారు. కమ్యునిజం సిద్దాంతంతోనే గొప్ప నాయకులుగా తయారయ్యారన్నారు. కరీంనగర్ ఎంపి బండి సంజయ్ యాత్రలో ‘కరీ నగర్’ అని చూశానని, ఇది ఏమిటో అని పరిశీలిస్తే ఇంతకు ముందు ఎనుగులు తిరగాయని ‘కరీ నగర్’గా బోర్డు పెట్టారన్నారు. ఉమ్మడి కరీంనగర్ నుండి పోరాడిన యోధుడు బద్దం ఎల్లారెడ్డి జిల్లా అని ఎందుకు పెట్టకూడదని సాంబశివరావు ప్రశ్నించారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ బద్దంఎల్లారెడ్డి గ్రామం నా స్వంత నియోజకవర్గంలో ఉండడం గర్వకారణమన్నారు. సమయి పాడిన ఎర్రజెండా పాట సభికులను ఆకట్టుకుంది.
సంక్షేమ పథకాల అమలు… వామపక్షాల పోరాట ఫలితమే
RELATED ARTICLES