అనారోగ్యం కారణంగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జపాన్ ప్రధాని
టోక్యో: జపాన్ చరిత్రలో అత్యంత ఎక్కువకాలం పాలించిన ప్రధానిగా ఖ్యాతి గడించిన షింజో అబె… అనారోగ్యం కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. తాను కొంతకాలంగా పెద్దపేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ‘ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఆత్మవిశ్వాసంతో ప్రజలను పాలించే స్థితిలో లేను. అందుకే ఇకపై ఆ పదవిలో కొనసాగకూడదని అనుకున్నాను. కరోనా వైరస్ క్లిష్టకాలం, పలు విధాన నిర్ణయాలు అమలు దశకు రాకముందే, ఏడాది పాటు పదవీకాలం మిగిలుండగానే.. రాజీనామా చేస్తున్నందుకు క్షమాపణలు కోరుతున్నాను’ అని ముందుకు వంగి ప్రజలను అభ్యర్థించారు. కాగా, అబె ప్రాతినిధ్యం వహిస్తోన్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీని అత్యవసరంగా సమావేశపర్చి ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారని సీనియర్ నేత టొమావి ఇనడా తెలిపారు. అస్సలు ఊహించని ఆయన నిర్ణయం ఆశ్చర్యపర్చిందన్నారు. అయితే, ఆ పదవికి తదుపరి వారసుడు ఖాయమయ్యే వరకు అబె బాధ్యతలు కొనసాగించనున్నారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్‌కు తరువాతి ప్రధాని ఎవరని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.